Share News

రిలయన్స్‌ జియో రూ.40,000 కోట్ల ఐపీఓ!

ABN , Publish Date - Jan 03 , 2025 | 05:33 AM

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌).. తన టెలికాం సేవల అనుబంధ విభాగమైన రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ను మెగా పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు సిద్ధం చేస్తున్నట్లు...

రిలయన్స్‌ జియో రూ.40,000 కోట్ల ఐపీఓ!

రూ.10 లక్షల కోట్లకు కంపెనీ మార్కెట్‌ విలువ

న్యూఢిల్లీ: భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌).. తన టెలికాం సేవల అనుబంధ విభాగమైన రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ను మెగా పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో కంపెనీ ఐపీఓకు రావచ్చని, తద్వారా రూ.35,000-40,000 కోట్లు సమీకరించే అవకాశం ఉందని సమాచారం. అనగా, దేశీయ మార్కెట్‌ చరిత్రలో ఇదే అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూ కానుంది. ఐపీఓలో భాగంగా రిలయన్స్‌ జియో మార్కెట్‌ విలువను రూ.10 లక్షల కోట్ల స్థాయిలో లెక్కించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పలు బ్రోకరేజీ సంస్థలు ఇప్పటికే జియో విలువను రూ.8.5 లక్షల కోట్ల స్థాయిలో అంచనా వేశాయి. ఐపీఓలో భాగంగా జియో తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులకు చెందిన ఈక్విటీ వాటాను సైతం ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) పద్ధతిన విక్రయించే అవకాశం ఉంది. ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌ ఆలోచన కూడా ఉన్నట్లు, ఇందుకోసం ప్రాథమిక చర్చలు కూడా ప్రారంభమైనట్లు సమాచారం.


ఒకవేళ ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌ ద్వారా నిధులు సమీకరిస్తే, ఐపీఓ ద్వారా నిధుల సమీకరణ ప్రస్తుత అంచనా కంటే తగ్గవచ్చు. ఆర్‌ఐఎల్‌ డిజిటల్‌ సేవల అనుబంధ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో భాగంగా రిలయన్స్‌ జియో ఉంది. అబుదాబీ ఇన్వె్‌స్టమెంట్‌ అథారిటీ (ఏడీఐఏ), సిల్వర్‌ లేక్‌, కేకేఆర్‌, ముబాదల వంటి అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజాలకు జియోలో వాటాల విక్రయం ద్వారా అంబానీ 2020లో 1,800 కోట్ల డాలర్లు సమీకరించారు. ప్రస్తుతం జియోలో 33 శాతం వాటా విదేశీ ఇన్వెస్టర్ల చేతుల్లో ఉంది.


ఇండో ఫార్మ్‌ ఐపీఓకు 227 రెట్ల బిడ్లు

ఇండో ఫార్మ్‌ ఎక్వి్‌పమెంట్‌ రూ.260 కోట్ల ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి అపూర్వ స్పందన లభించింది. గురువారంతో ముగిసిన ఈ పబ్లిక్‌ ఇష్యూకు ఏకంగా 227.57 రెట్ల సబ్‌స్ర్కిప్షన్‌ లభించింది. ఎన్‌ఎ్‌సఈ డేటా ప్రకారం.. ఐపీఓలో భాగంగా కంపెనీ 84.70 లక్షల షేర్లను విక్రయానికి పెట్టగా.. ఇన్వెస్టర్ల నుంచి 192.75 కోట్లకు పైగా షేర్ల కొనుగోలుకు బిడ్లు వచ్చాయి. గడిచిన 11 నెలల్లో అత్యధిక రెట్ల సబ్‌స్ర్కిప్షన్‌ సాధించిన ఐపీఓ ఇదే. 2024 ఫిబ్రవరిలో విభోర్‌ స్టీల్‌ ట్యూబ్స్‌ ఐపీఓ 320 రెట్లు సబ్‌స్ర్కైబ్‌ అయింది. కాగా, కోల్‌కతాకు చెందిన ఆగ్రో కంపెనీ రీగాల్‌ రిసోర్సెస్‌ లిమిటెడ్‌ ఐపీఓకు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.190 కోట్ల తాజా ఈక్విటీతో పాటు ప్రమోటర్‌కు చెందిన 90 లక్షల షేర్లను సైతం విక్రయించాలనుకుంటోంది.

Updated Date - Jan 03 , 2025 | 05:33 AM