Trading Fraud: ప్రేమ కోసం తపించిన పాపానికి రూ.7 కోట్లకు కుచ్చు టోపీ పెట్టింది
ABN , Publish Date - Mar 29 , 2025 | 01:18 PM
మొదటి వివాహం బెడిసికొట్టి విడాకులు అయినాయి కదా.. ఇకనైనా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే, దాని పర్యవసానం రూ.7 కోట్లు

ఢిల్లీకి చెందిన ఒక సంస్థ డైరెక్టర్ దల్జిత్ సింగ్(Daljit Singh). విడాకులు తీసుకున్న ఈయన, సరైన లైఫ్ పార్టనర్ కోసం గతేడాది డిసెంబర్లో ఒక డేటింగ్ యాప్ లో తన ప్రొఫైల్ అప్ లోడ్ చేశాడు. ఈ క్రమంలో అనిత అనే ఒక యువతి సింగ్ కు పరిచయం అయింది. తనది హైదరాబాద్ అని చెప్పింది.ఇలా తరచూ ముచ్చటించుకోవడంతో అప్పటి నుంచి వీరిద్ధరి మధ్య పరిచయం బాగా పెరిగి అత్యంత సాన్నిహిత్యానికి దారితీసింది. ఈ క్రమంలో మంచి స్నేహితులుగా ముందుకెళ్తున్నారు.
ఇలా దల్జిత్ సింగ్ నమ్మకాన్ని గెలుచుకున్న తర్వాత, అనిత తన ప్రీ ప్లాన్ అమలు చేయడం మొదలుపెట్టింది. ట్రేడింగ్ ద్వారా భారీ లాభాలు సంపాదించడం గురించి మాట్లాడేది. ఇందులో భాగంగా వెబ్ సైట్స్ ద్వారా పెట్టుబడులు పెడితే మంచి లాభాలు ఆర్జించవచ్చని సూచించింది. నమ్మి మొదటి సారి రూ. 3.2 లక్షలు పెట్టుబడి పెట్టాడు సింగ్. బదులుగా కొన్ని గంటల్లోనే మంచి రిటర్న్స్ ఇప్పించి అతని శ్రేయోభిలాషిగా సింగ్ నమ్మకాన్ని పూర్తిగా గెలుచుకుంది అనిత.
ఆ తర్వాత సింగ్ తను అప్పటి వరకూ కష్టపడి పొదుపు చేసుకున్న దాదాపు రూ. 4.5 కోట్లను బదిలీ చేశాడు. అనిత సూచన మేరకు, మరో రూ. 2 కోట్ల రుణం తీసుకొని దానిని కూడా పెట్టుబడి పెట్టాడు. 30 వేర్వేరు లావాదేవీల ద్వారా మొత్తం రూ. 6.5 కోట్లను 25 బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. అయితే, ఇంతకు ముందు మాదిరే సింగ్ డబ్బును విత్ డ్రా చేసుకోడానికి ప్రయత్నించినప్పుడు అతనికి తత్వం బోధపడింది.
పెట్టుబడి పెట్టిన మొత్తంలో 30 శాతం మాత్రమే వస్తాయంటూ చెప్పడంతో సింగ్ కు అనుమానం తలెత్తింది. మరోవైపు, ఇక దల్జీత్ నుంచి ఇంతకు మించి రాలవని తలంచిన అనిత బ్యాచ్ మూట ముళ్లె సర్దుకుని అంతా పత్తా లేకుండా పోయారు. సింగ్ పెట్టుబడి పెట్టిన మూడు వెబ్‌సైట్‌లు నిలిపివేశారు. దీంతో అనుమానం వచ్చి నోయిడా సెక్టార్-36లోని సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు సింగ్. పోలీస్ దర్యాప్తులో, అనిత డేటింగ్ యాప్ లో పెట్టిన ప్రొఫైల్ నకిలీదని తేలింది. డబ్బు బదిలీ చేయబడిన ఖాతాల గురించి పోలీసులు ఇప్పుడు సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Attack On Maoists: భద్రతా దళాలకు ఎదురుపడిన మావోయిస్టులు.. చివరకు..
టీడీపీ ఆవిర్భావ దినోత్సవం.. జెండా ఆవిష్కరించిన సీఎం
Read Latest AP News And Telugu News