ఉస్మానియా ప్రతిష్ఠకూ, ఏడో హామీకీ విరుద్ధం!
ABN , Publish Date - Mar 21 , 2025 | 01:36 AM
విద్యార్థులలో, ప్రజాస్వామిక ఆలోచనాపరులలో, ప్రతిపక్ష పార్టీలలో, మొత్తంగా తెలంగాణ పౌరసమాజంలో ఆందోళనకు దారి తీసిన ఉస్మానియా విశ్వవిద్యాలయ తాజా సర్క్యులర్ ఇటు వందేళ్ళు పైబడిన...

విద్యార్థులలో, ప్రజాస్వామిక ఆలోచనాపరులలో, ప్రతిపక్ష పార్టీలలో, మొత్తంగా తెలంగాణ పౌరసమాజంలో ఆందోళనకు దారి తీసిన ఉస్మానియా విశ్వవిద్యాలయ తాజా సర్క్యులర్ ఇటు వందేళ్ళు పైబడిన చారిత్రక వారసత్వానికీ, ప్రతిష్ఠకూ భంగకరం. అంతేగాక, ప్రస్తుత అధికార పక్షం, ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఏడో హామీకీ పూర్తిగా వ్యతిరేకం. ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ సంతకంతో మార్చి 13 తేదీతో వెలువడిన ఈ సర్క్యులర్ విశ్వవిద్యాలయ స్వతంత్ర ప్రతిపత్తినీ, రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక ప్రవర్తననూ, నిరసన తెలిపే ప్రాథమిక హక్కునూ కాలరాస్తున్నది. విద్యార్థులు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించి విశ్వవిద్యాలయ నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నారంటూ విశ్వవిద్యాలయ అధికారులు ఐదు రకాల చర్యలను నిషేధిస‍్తూ ఆ సర్క్యులర్ విడుదల చేశారు: 1) ట్రెస్ పాసింగ్ (అనుమతి లేకుండా చొరబడడం). 2) ధర్నాలు, ఆందోళనలు నిర్వహించడం. 3) నినాదాలు ఇవ్వడం. 4) పాలనాధికారులు, సిబ్బంది తమ విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడం. 5) విశ్వవిద్యాలయ సిబ్బందికీ, అధికారులకూ వ్యతిరేకంగా అసభ్యకరమైన, బూతుల భాష మాట్లాడడం. ‘‘ఎవరైనా వ్యక్తి ఈ చర్యలకు పాల్పడినట్టుగా తేలితే, ఆ వ్యక్తి మీద చట్టప్రకారం తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి’’ అనే హెచ్చరిక కూడా చేశారు.
విశ్వవిద్యాలయ పద్ధతులతో నిజమైన సమస్య తలెత్తినప్పుడు విద్యార్థులు మొదట తమ సంస్థ స్థాయిలో సంబంధిత అధికారిని సంప్రదించాలని, ఆ తర్వాతనే రిజిస్ట్రార్‌కు, ఇతర అధికారులకు, ‘‘ముందస్తు అనుమతితో’’ తమ ప్రాతినిధ్యం ఇచ్చుకోవాలని కూడా సలహా ఇచ్చారు. విశ్వవిద్యాలయంలో అన్ని విద్యార్థి సంఘాలూ ఈ సర్క్యులర్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టాయి. అధికారపక్షపు అనుబంధ విద్యార్థి సంఘ నాయకులతో సహా విద్యార్థి సంఘాల నాయకులందరూ ఈ అప్రజాస్వామిక సర్క్యులర్‌ను నిరసిస్తూ బంద్ పాటించారు. పోలీసులు ఆర్ట్స్ కాలేజీ భవనంలోకి ప్రవేశించి విద్యార్థుల మీద బలప్రయోగం సాగించడం, విద్యార్థినీ విద్యార్థులను అక్రమంగా ఎత్తుకుపోయి పోలీసు వాహనాల్లో విసరడం వంటి చర్యలను లైవ్ టెలివిజన్ సాక్షిగా సమాజమంతా చూసింది. ఒకవైపు ఇలా విద్యార్థుల అక్రమ నిర్బంధం, తరలింపు జరుగుతుండగానే ఎందరో విద్యార్థి నాయకులు ఈ నిర్బంధ సర్క్యులర్ పట్ల నిరసనను ప్రకటించారు. సర్క్యులర్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ కూడా ఈ సర్క్యులర్‌ను ఖండించి వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రతిపక్షాలూ రంగంలోకి దిగాయి. రాష్ట్ర శాసనసభలో అధికారపక్షపు మిత్రపక్ష శాసనసభ్యులు కూడా సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సర్క్యులర్ గురించీ, వెల్లువెత్తుతున్న నిరసన గురించీ, ప్రభుత్వ మౌనం గురించీ చర్చించవలసిన విషయాలెన్నో ఉన్నాయి. ఈ సర్క్యులర్ ఒక విద్యా సంస్థకు, విద్యా సంబంధమైన స్వతంత్ర, ప్రజాస్వామిక, చర్చా, మేధా వాతావరణానికి తగిన భాషలో ఎంతమాత్రమూ లేదు. ప్రతి సామాజిక సమస్యనూ శాంతిభద్రతల సమస్యగా మాత్రమే చూసే పోలీసు పరిభాషలో ఉంది.
‘‘సంస్కృతి అన్నమాట వినబడగానే నా చెయ్యి రివాల్వర్ మీదికి పోతుంది’’ అని హిట్లర్ దగ్గర పోలీసు మంత్రి గోరింగ్ అన్నట్టు, విద్యార్థి ఆందోళన అనగానే పోలీసు పరిభాష వచ్చినట్టుంది. ఈ పరిభాషలో సమస్యలను అర్థం చేసుకోవడం, వాటికి సామరస్యపూర్వక చర్చలో పరిష్కారాలు వెతకడం ఉండదు. ఉక్కుపాదంతో అణచివేస్తే సమస్యలు లేకుండా పోతాయనే ధూర్త వైఖరి అది. ‘‘ట్రెస్‌పాసింగ్’’ అనే న్యాయశాస్త్ర పారిభాషిక పదం ఒకరి సొంత ఆస్తిలోకి మరొకరు అనుమతి లేకుండా చొరబడటానికి సంబంధించినది. కాని విద్యా సంస్థలు కొద్ది కాలం అధికారంలో ఉండే వైస్ ఛాన్సలర్‌కో, ఇతర అధికారులకో సొంత ఆస్తులు కావు. అధ్యాపకుల, విద్యార్థుల ఆస్తులు కూడా కావు. అవి సామాజిక ఆస్తులు. సమాజం తన భవిష్యత్తరాలను తయారు చేసుకోవడానికి నెలకొల్పుకున్న కేంద్రాలు విద్యాలయాలు. అవి బహిరంగ సామాజిక స్థలాలు. ఒక విద్యాలయం గురించి ‘‘ట్రెస్‌పాసింగ్’’ అనే మాట వాడడమే పూర్తిగా అర్థరహితం, అనుచితం. నిజానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం మధ్య నుంచి రెండు ప్రధాన రహదారులతో ‘‘ట్రెస్‌పాసింగ్’’ అనే మాటకే అర్థం చెరిపేసింది. ధర్నాలు, ఆందోళనలు నిర్వహించడం మీద గంపగుత్తగా నిషేధం విధించడం రాజ్యాంగ వ్యతిరేకం. తమ నిరసన ప్రకటించడానికి ప్రజలకు ధర్నా, ఆందోళన, ప్రదర్శన, ఊరేగింపు, సభ, సమావేశం జరుపుకోవడం వంటి అనేక హక్కులు ఉన్నాయని గుర్తించి, రాజ్యాంగ అధికరణం 19 ఆ హక్కుకు హామీ ఇచ్చింది. అందులో భాగమే విద్యార్థుల ధర్నాల, ఆందోళనల హక్కు కూడా. ఆ హక్కును నియంత్రించడానికి ప్రత్యేక సందర్భాల్లో రాజ్యానికి అధికారం ఉందని చెపుతూ కూడా, రాజ్యాంగం స్పష్టంగా ఆ అధికారాన్ని ‘‘సహేతుకమైన ఆంక్షలు విధించడానికి’’ మాత్రమే పరిమితం చేసింది. మొత్తంగా ఆ హక్కును రద్దు చేసే, ఆందోళనలను నిషేధించే అధికారం రాజ్యానికి కూడా ఇవ్వలేదు. రాజ్యానికే లేని ఆ అధికారం ఒక విద్యా సంస్థలో తాత్కాలికంగా అధికార పీఠాల మీద కూర్చున్నవాళ్లకు అసలే ఉండదు.
ఇంకా విచిత్రం– నినాదాలు ఇవ్వడాన్ని నిషేధిస్తున్నారట! నినాదం అంటే ఏమిటి, బిగ్గరగా మాట్లాడడం. భగత్‌సింగ్ అన్నట్టు ‘‘చెవిటివాళ్లకు వినిపించేలా చేయడం’’. మరి, మాట్లాడడాన్ని కూడా నిషేధిస్తున్నారా? ఇంత అమానవీయమైన, అనాగరికమైన నిషేధం విధించే అధికారం ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులకు ఎంత మాత్రమూ లేదు. అంతే కాదు, ఇది ఎంతటి నియంతలు కూడా అక్షరాల్లో పెట్టడానికి సాహసించని నిరంకుశమైన, హాస్యాస్పదమైన నిషేధం. సర్క్యులర్ ప్రస్తావించిన నాలుగో, ఐదో చర్యలు నిజానికి ఇప్పుడున్న చట్టాల ప్రకారమే నేరాలు. అవి ఎవరైనా చేస్తే చట్టప్రకారం దర్యాప్తు చేయవచ్చు, న్యాయస్థానం ముందుకు తీసుకుపోయి విచారణ జరిపించవచ్చు, శిక్షలు పడేలా వాదించవచ్చు. కాని, వాటిని నిషేధిస్తున్నాము అని ఒక సర్క్యులర్ జారీ చేసినంత మాత్రాన ఆ చర్యలు ఆగిపోవు. ఆగిపోతాయనుకోవడం భ్రమ. ఎంతటి శిక్షాభయం చూపినా కొన్ని పనులు జరపకుండా ఆపలేము. ఎందువల్లనంటే అటువంటి పనులు అయితే తక్షణ, తాత్కాలిక ఆవేశం మీదనైనా జరుగుతాయి, లేకపోతే పథకం ప్రకారమైనా జరుగుతాయి. తాత్కాలికావేశంలో అయితే ఆ సమయానికి శిక్షా భయం గుర్తు కూడా రాదు. ఉద్దేశపూర్వకంగా, ప్రణాళిక ప్రకారం చేసేవారికైతే శిక్ష గురించి తెలిసే పథకం రచిస్తారు గనుక వారిని కూడా శిక్షా భయం ఆపజాలదు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నూటా ఏడు సంవత్సరాల చరిత్రలో విద్యార్థి ఆందోళనలు, ప్రదర్శనలు, నినాదాలు లేకుండా ఉన్న కాలం అతి స్వల్పం. తెలంగాణ సమాజంలోని అనేక కీలక పరిణామాలకు ఉస్మానియా విశ్వవిద్యార్థుల చైతన్యమే కారణం. నిజాం ప్రభుత్వం, జె.ఎన్. చౌధురి సైనిక ప్రభుత్వం, కె.ఎ. వెల్లోడి పౌర ప్రభుత్వం, హైదారాబాద్ రాష్ట్రపు బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం, ఆ తర్వాత యాభై ఎనిమిదేళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, తర్వాత పదేళ్ళ ప్రత్యేక తెలంగాణ తొలి ప్రభుత్వం – ఏ ఒక్క ప్రభుత్వాన్నీ ఉస్మానియా విద్యార్థులు నిలదీయకుండా లేరు. విద్యార్థుల బహిష్కరణ, రస్టికేషన్, విద్యాసంవత్సరం రద్దు, ఆంక్షలు, ముళ్లకంచెలు, గేట్లు మూసివేయడాలు చేసి, ఆ అపకీర్తి మూటకట్టుకున్న ప్రభుత్వాలున్నాయి గాని, ఇప్పటి సర్క్యులర్ లాంటి నిరంకుశ చర్యలు ప్రకటించడానికి ఎవరూ సాహసించలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు తెలిసి చేసినా, తెలియక చేసినా, ప్రభుత్వ జోక్యంతో చేసినా, సొంతంగానే చేసినా, మొత్తానికి ఈ సర్క్యులర్ అత్యంత అనుచితమైన నిర్ణయం. ఇప్పటికైనా గౌరవప్రదంగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం ఉస్మానియా ప్రతిష్ఠకూ, ప్రజాస్వామిక పునరుద్ధరణకూ, ఏడో హామీ అని కాంగ్రెస్ పార్టీ చేసిన ఎన్నికల వాగ్దానానికీ అత్యవసరం.
ఎన్. వేణుగోపాల్
సీనియర్ జర్నలిస్ట్
ఈ వార్తలు కూడా చదవండి...
Marri Rajasekhar: జగన్ అలా చేయడం తీవ్రంగా బాధించింది
Pawan Kalyan : ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే.. వారే కారణం
Tirumala: తిరుమలలో భక్తుల మధ్య ఘర్షణ.. ఒకరికి గాయాలు
For More Andhra Pradesh News and Telugu News..