Share News

ఇరవై రెండు భాషలకూ అధికార హోదా

ABN , Publish Date - Mar 21 , 2025 | 01:45 AM

భారత గణతంత్ర రాజ్య అధికార భాషగా హిందీ ఇంకెంతకాలం ఈ ప్రహసనం? జరూరుగా ముగించేద్దాం. ఈ పరిత్యజనం వల్ల హిందీ ప్రాభవానికి ఎటువంటి హాని సంభవించదు. నిరంతరం...

ఇరవై రెండు భాషలకూ అధికార హోదా

భారత గణతంత్ర రాజ్య అధికార భాషగా హిందీ! ఇంకెంతకాలం ఈ ప్రహసనం? జరూరుగా ముగించేద్దాం. ఈ పరిత్యజనం వల్ల హిందీ ప్రాభవానికి ఎటువంటి హాని సంభవించదు. నిరంతరం బాల రాజు హోదాలో ఉండడం వల్ల హిందీకి మేలు జరగదు; దేశ శ్రేయస్సుకూ తోడ్పడదు. ఈ హోదా తగ్గింపు హిందీని వివిధ భారతీయ భాషలతో సమస్థాయిలో కలుపుతుంది. నష్టమేమిటి? దానివల్ల అసలు భాషా వివక్షకు కారణమైన ఆంగ్ల భాషా సామ్రాజ్యవాదంపై తీవ్ర చర్చను నిరోధిస్తున్న ‘హిందీ విధింపు’ అన్న భావావేశాల దారి మళ్లింపు వ్యవహారం అన్న అడ్డు తొలగిపోతుంది. ఇది, భావాలలో స్వరాజ్యం దిశగా ఒక గొప్ప ముందడుగు అవుతుందేమో! హిందీ భాష విషయమై గత 75 సంవత్సరాలుగా అనుసరిస్తున్న విధానం ఆశించిన లక్ష్యాలను నెరవేర్చకపోగా ప్రతికూల ఫలితాలను మాత్రమే ఇస్తోంది. మాట్లాడే ప్రజల సంఖ్య అత్యధికంగా ఉన్న కారణంగా భారతీయ భాషా ప్రపంచ వైవిధ్యంలో హిందీకి ఒక ప్రత్యేక స్థానమున్నది. జనాభా గణన ప్రక్రియలో హిందీ భాష మాట్లాడేవారుగా వర్గీకృతమైన జనుల సంఖ్య 60 కోట్లకు (దేశ జనాభాలో 42 శాతంకు) పైగా ఉన్నది.


ప్రపంచంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాషలలో హిందీ నాల్గవ స్థానంలో ఉన్నది. మరే ఇతర భారతీయ భాషకు ఇటువంటి ప్రాధాన్యం లేదు, పొందలేదు కూడా. బహు భాషామయమైన మన జాతి జీవితంలో హిందీ ఒక వారధిగా ఉపయోగపడగలదు. అయితే తనలో అంతర్గతం చేసుకున్న బహు భాషల మూలాలను, ఇతర భారతీయ భాషలకు విస్తరించిన తన ప్రభావాన్ని నిలుపుకుని అభివృద్ధిపరచుకోగలిగితే హిందీ ఒక వారధి భాషగా తప్పకుండా వెలుగొందుతుంది. భారతీయ భాషా జగత్తులో అత్యున్నత హోదాను ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరి నుంచి గౌరవాదరాలను అపేక్షించే ‘శుద్ధ’ హిందీ అంతిమంగా మతతత్వానికి ఆలంబన అవుతుంది. సాంస్కృతిక విభేదాలను పెంచి, జాతీయ సమైక్యతను బలహీనపరుస్తుంది. హిందీకి అధికార భాష హోదా దానికి మేలు చేయకపోగా హాని మాత్రమే చేసింది. తనలో అంతర్గతం చేసుకున్న భాషలకు సవతి తల్లిగాను, ఇతర భారతీయ భాషలకు అత్తగారుగాను పరిణమించింది. అటూ ఇటూ ఎవరి నుంచి గౌరవాన్ని పొందలేకపోతోంది. దీనికి తోడు ఇప్పుడు హిందీని దేశవ్యాప్తంగా అధికార భాషగా చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలతో పరిస్థితులు మరింతగా విషమించాయి. ప్రముఖ కవి, రచయిత, పాత్రికేయుడు రఘువీర్‌ సహాయ్‌ తన ‘హమారి హిందీ’ అన్న కవితలో భార్యను కోల్పోయిన సంపన్న వృద్ధుడి కొత్త, పడుచు భార్యగా పోల్చాడు! ఆయన ఆ పద్యం ఆరు దశాబ్దాల క్రితం రాశారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. ఏమైనా మార్పు ఉంటే అది ఆంగ్ల భాష తన స్థానాన్ని మరింతగా బలోపేతం చేసుకోవడమే.


హిందీ భాష మాట్లాడే ప్రజలు అందరూ తమ బిడ్డలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చేర్పించేందుకే ఆరాటపడుతున్నారు. హిందీ రాష్ట్రాలలోని మధ్యతరగతి’ విద్యావంతులలో ఎంతమంది హిందీ దినపత్రికను చదువుతున్నారు? ఇంట వారు మాట్లాడే భాష అటు హిందీనూ కాదు, ఇటు ఆంగ్లమూ కాదు. రెండిటి మిశ్రమం. అదొక సంకర భాష. ఆంగ్లంతో సరిచూసినప్పుడు హిందీ ఎంత అప్రధానంగా ఉంటుందో నిత్య సామాజిక జీవితంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇంగ్లీష్‌ స్పీకింగ్‌ కోర్సులకు హిందీ దినపత్రికల నిండా వాణిజ్య ప్రకటనలే. తల్లిదండ్రులు తమ బిడ్డలను అతిథులకు వచ్చీరాని ఆంగ్లంలో పరిచయం చేస్తుంటారు. యువజనులు తమ స్నేహితుడు లేదా స్నేహితురాలును ఆకట్టుకునేందుకు వచ్చీరాని ఆంగ్లంలో వింతగా మాట్లాడుతుంటారు! ఆంగ్లానికి విలువ పెరుగుతోంది. హిందీకి ఆదరణ తగ్గుతోంది. ప్రపంచపు నాల్గవ అతి పెద్ద భాషను దానిని మాట్లాడే రాష్ట్రాలలోనే బోధించడం సాధ్యం కావడం లేదు. ఇక హిందీని నేర్చుకోవాలని ఇతరులను ఎలా బలవంతపెట్టడం? హిందీ మాతృభాషగా ఉన్న ఐదవ తరగతి గ్రామీణ విద్యార్థులలో రెండవ తరగతి హిందీ పాఠ్యగ్రంథంలోని పాఠాలను ఒక పేరా కూడా తప్పులు లేకుండా చదవలేకపోతున్నారని అసర్‌ సర్వే వెల్లడించింది. హిందీ మాధ్యమంలో కళాశాల విద్యను అభ్యసించిన పట్టభద్రులు వ్యాకరణ యుక్త హిందీని రాయలేకపోతున్నారు. వారి హిందీ పదాల అక్షర క్రమం కూడా సరిగ్గా ఉండదు. మరీ ముఖ్యంగా హిందీ భాష ఒక మేధో సంస్కృతిని సృష్టించనేలేదు.


ప్రపంచ స్థాయి ఉత్తమ సాహిత్యాన్ని హిందీ రచయితలు సృజిస్తున్నారు. అయితే హిందీ రాష్ట్రాల ప్రజానీకంలో ఎంత మంది సమకాలీన మహా రచయిత వినోద్‌ కుమార్‌ శుక్లా పేరును గుర్తుపట్టగలరు? అసాధారణ పాత్రికేయులు ఉన్నారు. అయితే ఉత్తమ, ఉత్కృష్ట పాత్రికేయానికి ఆలంబనగా ఉన్న వార్తా పత్రిక ఒక్కటీ లేదు కదా. అధునాతన వైజ్ఞానిక, సాంకేతిక, సామాజిక శాస్త్రాల విషయం అటుంచండి, ఏ విద్యా విభాగంలోను లక్షలాది విద్యార్థుల అవసరాలను తీర్చే పాఠ్య గ్రంథాలు లేనే లేవు. మరి హిందీ మాధ్యమంలో ఉన్నత విద్యాభ్యాసం వల్ల ప్రయోజనమేముంది? నవీన భావాల వ్యాప్తికి దోహదం చేసిన చివరి హిందీ మ్యాగజైన్‌ దిన్‌ మాన్‌ (కాకతాళీయంగా దీనికి ఎడిటర్‌ రఘువీర్‌ సహాయ్‌) యాభై సంవత్సరాల క్రితమే మూతపడింది. పాఠశాలలో హిందీలో మాట్లాడితే బాలలకు జరిమానా విధించే పరిస్థితులు ఉన్న దేశం మనది. మరి హిందీ ఆధిపత్యం గురించి మాట్లాడడం ఒక క్రూర పరిహాసమే సుమా! ఆధిపత్యంలో ప్రభావశీల నియంత్రణ, సాంస్కృతిక న్యాయబద్ధత అంతర్గతంగా ఉంటాయి. హిందీకి ఇవేవీ లేవు. భారతీయ పాలకవర్గాల భాష ఇంగ్లీష్‌. దానికి సాంస్కృతిక ప్రాబల్యమున్నది. ఆర్థిక వనరులు ఉన్నాయి. శక్తిమంతమైన విద్యా సంబంధిత పరిశ్రమ మద్దతు ఉన్నది. ఆ భాష ఎవరి మీదైతే పెత్తనం చేస్తుందో వారు దానిని రక్తగతం చేసుకున్నారు. సాంస్కృతిక అధిపత్యమంటే ఇదే కదా? హిందీ భాషా దురభిమానులు ఎంతగా అహంకారాన్ని ప్రదర్శిస్తున్నా హిందీని హీందీయేతర భాషల వారిపై రష్యన్‌ భాషను, సోవియట్‌ యూనియన్‌లో రష్యన్‌ భాషను, రష్యనేతర ప్రజలపై రుద్దినట్టు రుద్దలేదు. భారతీయ భాషా వైవిధ్యాన్ని గౌరవించడం వల్లే భారత గణతంత్ర రాజ్యం సమైక్యంగా మనగలుగుతోంది. అయితే హిందీ విధింపు అన్న ఆరోపణలో నిజం లేకపోలేదు అధికార భాషగా హిందీని ప్రోత్సహించడం దాని సాధికారతకు చేసిన మేలు ఏమీ లేదు. బిల్‌ బోర్డులు, నేమ్‌ బోర్డులు హిందీలోనే ఉండాలనడం హిందీయేతర భాషల వారికి ఆగ్రహం కలిగిస్తోంది. భారత ప్రభుత్వం కొత్త పథకాలకు, కార్యక్రమాలకు, చట్టాలకు కూడా హిందీ లేదా సంస్కృతంలో పేర్లు పెట్టడం హిందీయేతర భాషల వారికి చిరాకు కలిగిస్తోంది. దీనికి తోడు హిందీ భాషీయులు తమది ‘జాతీయ భాష’ అని ఎల్ల వేళలా ఘోషించడం ఆ భాష పట్ల వ్యతిరేకతను మాత్రమే పెంచుతోంది. హిందీ ‘జాతీయ భాష’ అనేందుకు ఎలాంటి చట్టబద్ధత గానీ, రాజ్యాంగ బద్ధత గానీ లేదు కదా. కేవలం ప్రభుత్వ కార్యాలయాలలో మాత్రమే అది అధికార భాషగా పరిగణింపబడుతోంది. దీని పర్యవసానాలు పూర్తిగా ప్రతికూలంగా ఉంటున్నాయి. ఈ వాస్తవాల దృష్ట్యా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నాను. రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూలులోని 22 భాషలకు అధికార భాష హోదా కల్పించాలి. మనకు ఒక జాతీయ అధికారిక, లేదా అనుసంధాన భాష అవసరం లేదు. సెప్టెంబర్‌ 14ను హిందీ దినోత్సవంగా కాకుండా భారతీయ భాషలు అన్నిటినీ గౌరవించేందుకు భాషా దినోత్సవంగా నిర్వహించాలి. హిందీని ప్రోత్సహించేందుకు శత విధాల చేస్తున్న ప్రయత్నాలు అన్నిటినీ భారత ప్రభుత్వం నిలిపివేయాలి. అనుసంధాన భాష అవసరమైనవారు దానిని తమకు తామే ఎంపిక చేసుకోవాలి.


అనుసంధాన భాషగా గౌరవం పొందాలని హిందీ ఆశిస్తుంటే ఇతర భాషలతో సంకరమయ్యేందుకు సిద్ధమవ్వాలి. ‘సరైన’ హిందీని నిర్ణయించి నమోదు చేసేందుకు ఒకటి గాక బహుళ సంస్థలను అనుమతించాలి. హిందీని ప్రమోట్‌ చేయడానికి బదులు భారతీయ భాషలను ప్రోత్సహించడం, అభివృద్ధిపరచడమమే జాతీయ లక్ష్యంగా ఔదలదాల్చాలి. ‘ఇంగ్లీష్‌ను బహిష్కరించాలి’ అన్న ఒకనాటి లోహియా నినాదం ఇంకెంత మాత్రం పనిచేయదు. ‘భాషలను అభివృద్ధిపరచడమే’ మన ఉద్ఘోష కావాలి. ఉద్యమ ఉద్వేగంతో, సంకల్ప శుద్ధితో ఈ విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి. మొత్తం 22 భాషలలోను ఉన్నత విద్యకు అవసరమైన పుస్తకాలు అన్నిటినీ అనువాదం చేసుకోవాలి. బాలసాహిత్యాన్ని పునః సృజించుకోవాలి. ఇందుకు అవసరమైన ఆర్థిక వనరులు ప్రభుత్వం సమకూర్చాలి. దీనితో పాటు ‘మాండలికాలు’గా మాత్రమే పరిగణన పొందుతూ, ఎనిమిదో షెడ్యూలులో లేని కనీసం 100 భాషలను కాపాడేందుకు అవసరమైన సంస్థలను ఏర్పాటు చేసి వాటికి అన్ని విధాల మద్దతునివ్వాలి. ప్రతి ఒక్కరికీ మాతృభాషలో విద్య సమకూర్చాలనే విద్యాహక్కు నిర్దేశాన్ని అమలుపరిచేందుకు చిత్తశుద్ధితో పూనుకోవాలి. హిందీ ప్రజల భాష. అది అలా ఉండిపోవడమే దానికి అన్ని విధాల మేలు.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

ఈ వార్తలు కూడా చదవండి...

Marri Rajasekhar: జగన్ అలా చేయడం తీవ్రంగా బాధించింది

Pawan Kalyan : ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే.. వారే కారణం

Tirumala: తిరుమలలో భక్తుల మధ్య ఘర్షణ.. ఒకరికి గాయాలు

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Mar 21 , 2025 | 01:46 AM