చేనేతలో ‘చంద్ర’కాంతులు
ABN , Publish Date - Mar 26 , 2025 | 01:58 AM
చేనేత కేవలం వస్త్రమే కాదు లక్షల కుటుంబాలకు జీవనాధారం. అన్న ఎన్టీఆర్ బాటలోనే నడుస్తూ నేడు సీఎం చంద్రబాబునాయుడు చేనేతకు పెద్దపీట వేస్తున్నారు. జనతా వస్త్రాల పేరుతో సగం ధరకే పేదలకు ధోవతి, చీరను...

చేనేత కేవలం వస్త్రమే కాదు లక్షల కుటుంబాలకు జీవనాధారం. అన్న ఎన్టీఆర్ బాటలోనే నడుస్తూ నేడు సీఎం చంద్రబాబునాయుడు చేనేతకు పెద్దపీట వేస్తున్నారు. జనతా వస్త్రాల పేరుతో సగం ధరకే పేదలకు ధోవతి, చీరను అందజేశారు ఎన్టీఆర్. ఈ పథకం వల్ల చేనేత వస్త్రాల అమ్మకాలు పెరగడంతో పాటు ఆకలితో అలమటిస్తున్న చేనేత కార్మికులకు ఉపాధి లభ్యమైంది. దీంతో పాటు, చేనేతలకు నూలు, రంగులు, రసాయనాలను సబ్సిడీపై అందజేశారు. నేతన్నలు నేసిన వస్త్రాలను అన్నగారి ప్రభుత్వమే సేకరించింది. ఆనాడు తీసుకున్న ఈ నిర్ణయం ఓ సంచలనం సృష్టించింది. ఆత్మహత్యలకు పాల్పడకుండా ఎంతోమంది నేత కార్మికులను రక్షించిన గొప్ప పథకమిది.
ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న చంద్రబాబు నాయుడు సైతం నేతన్నలకు లబ్ధి కలిగేలా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరెన్నో పథకాలు అమలు చేస్తున్నారు. తన తాత, తండ్రి లక్షణాలు పుణికి పుచ్చుకున్న యువ నాయకులు, మంత్రి నారా లోకేశ్ కూడా చేనేత రంగానికి మరింత వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు నేతన్నల ఆర్థిక వృద్ధికి ఎన్నో పథకాలు, ప్రయోజనాలు అందజేశారు. 2014–19 మధ్య కాలంలో త్రిఫ్ట్ పథకాన్ని అమలు చేసి, ప్రభుత్వం అందించే వాటాను పెంచారు. పావలా వడ్డీ పథకం అమలు చేసి, నేతన్నలకు వడ్డీ భారాన్ని తగ్గించారు. పవర్ టారిఫ్‌లో 50 శాతం రాయితీ ఇచ్చారు. 2014–19లో రూ.50.15 కోట్లతో 54 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. 2024లో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం కూడా చేనేతలకు మరోసారి అండగా నిలిచింది. చంద్రబాబు దిశానిర్దేశంలో అధికారులతో కలిసి చేనేత, జౌళి శాఖ మంత్రిగా ఎన్నో పథకాలు రూపొందించాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 92,724 మంది నేతన్నలకు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెన్షన్ పెంచాం. మొదటి ఏడాది పెన్షన్ల రూపంలోనే రూ.370.89 కోట్లు లబ్ధిదారులకు చెల్లించాం.
చేనేతలకు త్రిఫ్ట్ కింద ప్రభుత్వ వాటాను 8 నుంచి 16 శాతానికి పెంచాం. ఈ పథకం కింద 2024–25లో రూ.5 కోట్లు కేటాయించాం. 2025–26లోనూ త్రిఫ్ట్ పథకానికి మరో రూ.5 కోట్లు కేటాయించాం. క్యాష్ క్రెడిట్ కార్డులతో సహకార సంఘాలకు బ్యాంకు రుణాలు అందజేస్తున్నాం. నేటి తరం అభిరుచులకు అనుగుణంగా నూతన వస్త్రాల తయారీలో అయిదు జిల్లాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాం. చేనేత వస్త్రాల విక్రయాలకు రాష్ట్రంతో పాటు దేశంలోని ఏడు నగరాల్లో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశాం. ఆప్కో నేతృత్వంలో ఈ కామర్స్ ద్వారా నేరుగా వినియోగదారుల ఇళ్ల వద్దకే చేనేత వస్త్రాలను అందజేస్తున్నాం. జాతీయ హ్యాండ్‌లూమ్ అభివృద్ధి ప్రోగ్రామ్ కింద 2024–25లో 10 క్లస్టర్లు ఏర్పాటు చేశాం. వీవర్స్ ముద్రా స్కీమ్ ద్వారా చేనేతలకు రుణాలు అందజేశాం. ముడిపదార్థాల సరఫరా పథకం కింద నూలుపై 15 శాతం సబ్సిడీ ఇస్తున్నాం. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా చేనేత ఉత్పత్తుల 5 శాతం జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని చంద్రబాబునాయుడు నిర్ణయించారు. త్వరలోనే ఈ పథకాన్ని కూడా అమలు చేయబోతున్నాం. చేనేత ఉత్పత్తులకు జి.ఐ. ట్యాగ్ కోసం, పది కొత్త ఉత్పత్తులకు కేంద్రానికి దరఖాస్తు చేశాం. ప్రస్తుతం నాలుగు ఉత్పత్తులకు జి.ఐ. ట్యాగ్ ఉంది. అది కూడా 2014–19లో టీడీపీ ప్రభుత్వం కృషి వల్లే లభించింది. విశాఖపట్నంలో రూ.172 కోట్లతో యూనిటీ మాల్ నిర్మిస్తున్నాం. రాయదుర్గం, హిందూపురం, బ్రాండెక్స్‌లో టెక్స్ టైల్స్ పార్కుల అభివృద్ధితో పాటు ఎమ్మిగనూరు టెక్స్ టైల్స్ పార్క్ కూడా నిర్మించబోతున్నాం. నూతన టెక్స్ టైల్స్ పాలసీని తీసుకొచ్చాం.
ఈ పాలసీ ద్వారా చేనేత రంగంలో రూ.10,000 కోట్ల పెట్టుబడులు సేకరించాలని, 1.51 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. డీకార్బనైజేషన్, వ్యర్థాలను తగ్గించడానికి సబ్సిడీలు అందజేస్తున్నాం. నేతన్నలకు 365 రోజుల పాటు పనిదినాలు కల్పించడంతో పాటు, చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడానికి టాటా తనీరా, ఆదిత్య బిర్లా గ్రూప్, తమిళనాడుకు చెందిన కో ఆప్టెక్స్‌తోనూ ఒప్పందం చేసుకున్నాం. ఈ ఒప్పందాలతో చేనేత వస్త్రాల అమ్మకాలు గణనీయంగా పెరగనున్నాయి. స్వయం సహాయక సంఘాల్లో ఉన్న చేనేత మహిళలకు రూ.10 వేలు విలువ చేసే నూలును ఉచితంగా అందజేస్తున్నాం. మంత్రి నారా లోకేశ్ సూచనతో రాష్ట్ర వ్యాప్తంగా వీవర్ శాలల ఏర్పాటుకు నిర్ణయించాం. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించాం. ఇందుకోసం ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. చేనేత కుటుంబాలకు త్వరలో ఆరోగ్య బీమా పథకం అమలు చేయబోతున్నాం. చేనేత సహకార సంఘాల ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నాం. 2019–24 కాలం చేనేతల బతుకుల్లో చీకటి మిగిల్చింది. ఈ అయిదేళ్లలో జగన్ అసమర్థ పాలన కారణంగా చేనేతలు అన్ని విధాలా నష్టపోయారు. టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ రద్దు చేసి, ఒకే ఒక్క పథకం నేతన్న నేస్తం మాత్రమే అమలు చేశారు. ఈ పథకం కింద అర్హులకు బదులు అనర్హులకు, వైసీపీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చారు. ఉత్పత్తి అయిన వస్త్రాలకు మార్కెటింగ్ లేక, చేసిన అప్పులు తీర్చలేక, జగన్ ప్రభుత్వం నుంచి సాయం అందక... నేతన్నలు ఐదేళ్లు నరకం అనుభవించారు. ఎందరో నేతన్నలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మరెందరో ఆ వృత్తిని వీడి వలస కార్మికులుగా ఇతర ప్రాంతాలకు వలసపోయారు. మరోసారి చంద్రబాబునాయుడు అధికారంలోకి రావడంతో చేనేత రంగానికి పటిష్ఠ ప్రణాళికలు చేపట్టారు. అదే సమయంలో గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలే కాకుండా కొత్త పథకాలకు కూడా శ్రీకారం చుట్టడంతో నేతన్నలకు భరోసా వచ్చింది. అందుకే ఏపీలో చేనేత రంగానికి సీఎం చంద్రబాబునాయుడు పాలన ఎప్పుడూ స్వర్ణయుగమే.
ఎస్. సవిత
రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే
Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్
Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ
Read Latest AP News And Telugu News