Share News

@ ఫలానా... కాదు

ABN , Publish Date - Mar 24 , 2025 | 03:20 AM

నాలుగైదు తీరిక దేహాల పోసుకోలు కబుర్లలో పచ్చని పైరు పొలంలో మెరిసే పరికిణీ సయ్యాటలో పొద్దెక్కినా లేవని మొద్దు నిద్రలో...

@ ఫలానా... కాదు

ప్రియ పద్యం

నాలుగైదు తీరిక దేహాల

పోసుకోలు కబుర్లలో

పచ్చని పైరు పొలంలో

మెరిసే పరికిణీ సయ్యాటలో

పొద్దెక్కినా లేవని మొద్దు నిద్రలో

మెరుపు రేఖంటి నృత్యంలో

మెలిక ముగ్గులో

మోగే కుక్కర్ విజిల్‌లో

మురిపెంపు ప్రేమలో

మూర్తీభవించిన విజయరేఖలో

కథ చివర్లోనైనా తానుగా నిలిచే నమ్మకంలో

నిన్న నేడు రేపులలో అరుదుగా తప్ప

బోలెడన్ని సార్లు ఆటబొమ్మ ఐనా

కంటికింపుగానో కంటగింపుగానో

తనది కాని తాత్కాలిక ఔట్‌ఫిట్‌లో

ఒదిగిపోయే ఆమె లేనిదే అతనుండడాన్ని

ఊహించలేని వెండితెర మాయాలోకం

అదేం చిత్రమో కానీ

వృత్తి జీవితానికావల

ప్రతి వ్యక్తిగత సందర్భంలో

లోకానికి ఆమె

ఫలానా వాడి నాయికనే

అరె

వేలి గోటి వెర్రి రాతల్లారా

ఇంట్లోకి బెడ్రూంలోకి

నువు తీసుకురానివ్వని

నీ ఆఫీస్ ఔట్‌ఫిట్‌ లాంటిదే

ఆమె రోల్ అండ్ వర్క్ రిలేషన్

వీటన్నిటికావల

ఇల్లలుకుతూ పేరు మరచిపోయిన

ఈగ కాదు

ఆమె గుమ్నామీ కాదు

అంజానీ కూడా కాదు

పేరు లేని పిల్ల అంతకన్నా కాదు

తనదైనదో తెర కోసం పెట్టుకున్నదో

ఆమె కూడా నామవాచకమే!

రాజేశ్వరి రామాయణం

Updated Date - Mar 24 , 2025 | 03:20 AM