రోగం కన్నా ఔషధమే ప్రమాదకరమైతే ఎలా?
ABN , Publish Date - Mar 26 , 2025 | 02:02 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్చి 15న రాష్ట్ర శాసనసభలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియచేసే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ, సుమారు రెండున్నర గంటలపాటు అనర్గళంగా, సమగ్రంగా..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్చి 15న రాష్ట్ర శాసనసభలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియచేసే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ, సుమారు రెండున్నర గంటలపాటు అనర్గళంగా, సమగ్రంగా, వ్యూహాత్మకంగా చేసిన సుదీర్ఘ ప్రసంగం ఆయన విమర్శకులను సైతం ఆకట్టుకున్నది. ప్రధానంగా మీడియా, అందునా డిజిటల్ మీడియా బాధ్యతకు, ప్రవర్తనా నియమావళికి సంబంధించి రేవంత్ సూటిగా ప్రసంగించారు. ఇద్దరు మహిళా యూట్యూబ్ జర్నలిస్టుల ప్రవర్తన దీనికి నేపథ్యం. తనపై వ్యక్తిగతంగా, అవమానకరంగా, దూషణాత్మక అంశాలతో వీడియో పోస్ట్ చేసినందుకు వారిద్దరూ అరెస్ట్ అయ్యారని రేవంత్ వెల్లడించారు. దూషణాత్మక కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడంపై ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తుందని, కాకపోతే, ‘నేను చేసే ప్రతిచర్యను చట్ట పరిమితుల్లోనే చేస్తాన’నీ ముఖ్యమంత్రి ప్రకటించారు. అసభ్యకరంగా, నిరాధారంగా, దూషణాత్మకంగా వ్యాఖ్యలు చేసే వ్యక్తులు జర్నలిస్టులు కాదని, వారిని నేరస్తులుగా పరిగణిస్తామని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు మీడియాలో, మేధాజనబాహుళ్యంలో చర్చనీయాంశమయ్యాయి. మీడియా కొన్ని హద్దులను పాటించాలా? దాన్ని ఒక స్వతంత్ర పౌర సమాజం లేదా వృత్తిపరమైన సంస్థ పర్యవేక్షించాలా? అనే విషయాలపై విస్తృత చర్చ జరగాలి. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యం స్వేచ్ఛ హక్కు కింద రక్షణ పొందుతున్నది. ఇది భారత ప్రజాస్వామ్య విశిష్టతకు సంకేతంగా పరిగణించబడుతున్నది. మీడియా నిష్పాక్షికత, బాధ్యత, ప్రతిస్పందనశీలత వంటి ప్రమాణాలను అనుసరించాలని ఈ హక్కు ఆశిస్తుంది. ఈ ప్రమాణాలు ‘ఫోర్త్ ఎస్టేట్’ అనే భావనలో అంతర్భాగం. హక్కులు, ప్రత్యేకాధికారాలను బాధ్యతలు, కర్తవ్యాలతో సమతుల్యం చేయకపోతే ఏ వ్యవస్థ అయినా సమర్థవంతంగా పనిచేయదు. కాకపోతే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో ఉపయోగించిన హెచ్చరిక పదాలు, తనను వ్యక్తిగతంగా దూషించినవారిని ఉద్దేశించినవే అయినప్పటికీ, వాటి తీవ్రత ఆ వీడియో కంటెంట్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన వారిని సైతం విభ్రాంతికి గురి చేసింది. ‘‘ముసుగును తొలగించి బట్టలు ఊడదీసి కొడతాం, ప్రజల ముందు ఊరేగిస్తాం,’’ అనే వ్యాఖ్యలు ఒకింత ఆందోళన కలగచేశాయి. వ్యక్తిగతంగా అవమానపరుస్తూ, అసభ్య పదజాలంతో దూషణాత్మకంగా సాగే జర్నలిజాన్ని నిర్ద్వంద్వంగా ఖండించాల్సిందే.
అయితే, ముఖ్యమంత్రిని ఈ స్థాయికి నడిపించిన ఆ ఆగ్రహావేశం ‘‘రుగ్మత కన్నా ఔషధమే ఆందోళనకరమైతే ఎలా?’’ అనే పాత సామెతను గుర్తుచేస్తున్నది. ఇది తనకు తానే నష్టం కలిగించుకునే చర్య. పత్రికా విలువలు కాపాడాలనే విషయంలో ఎవరూ రాజీపడకూడదు. తప్పుడు సమాచారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కానీ, ‘‘ప్రజాస్వామ్య ఆలయం’’గా పరిగణింపబడే శాసనసభ మధ్యలో, తీవ్ర పదజాలాన్ని ఉపయోగిస్తూ ప్రతిదాడికి దిగడం అనవసరం. ఆ ఇద్దరు యూట్యూబ్ మహిళా జర్నలిస్టులు హద్దులు దాటి వ్యవహరించారనేది నిజమే కావచ్చు. చట్టపరమైన చర్య తీసుకోవడం కూడా పూర్తిగా సమంజసమే కావచ్చు. అయితే, వారి చర్య హద్దులు మీరినదైతే, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సభ గడప దాటి, అంతస్తు దాటి, మొత్తం భవనాన్ని దాటి వెళ్లాయి! తప్పుడు సమాచార ప్రసారానికి ప్రభుత్వ బాధ్యతకు మధ్య జరిగిన ఈ యుద్ధంలో ప్రభుత్వ ప్రతిస్పందన మరింత శాంతంగా, సూక్ష్మంగా ఉండాల్సింది. జర్నలిస్టుల కథనం మార్గభ్రష్టమైనదే కాబట్టి, వాస్తవాధారంగా చేయాల్సిన ఖండన లేదా చట్టపరమైన తీవ్రమైనచర్య సరిపోయేది. శాసనసభ వేదిక నుండి ముఖ్యమంత్రి కటువైన పదజాలంతో జరిపిన ఈ మౌఖిక దాడి సమస్యను మరింత జటిలం చేయడమే గాక, ఆ ఇద్దరు మహిళా జర్నలిస్టుల పట్లే సానుభూతిని పెంచేదిగా ఉంది. విచిత్రమేమిటంటే– అదే శాసనసభలో గౌరవ సభ్యులు స్వేచ్ఛగా మాట్లాడే హక్కును పూర్తిగా వినియోగించుకుంటారు. తీవ్ర ఆరోపణలు, పరస్పర దూషణలు కూడా అక్కడ జరుగుతుంటాయి.
శాసనసభ వెలుపల నేతల మధ్య జరిగే వాగ్వివాదాలైతే మరీ శ్రుతిమించిపోతాయి. ఇదంతా మనం రాజకీయ వ్యూహంలో భాగంగా పరిగణించి పట్టించుకోవటం మానేశాం. రాజకీయ నాయకుల అనియంత్రిత వ్యాఖ్యలు సహజంగా అంగీకరించబడినప్పుడు, ఆ యూట్యూబ్ వీడియోలో వాడిన పదజాలం విషయంలో అంతస్థాయి నైతిక ఆగ్రహం వ్యక్తీకరించడం, చట్టపరమైన చర్యలకు మించి అడుగులు వేసే ప్రయత్నం చేయడం అవసరమా అన్న ప్రశ్న సహజంగా ఉత్పన్నమవుతుంది. నాయకులు అన్యాయమైన విమర్శలకు గురి కావడం రాజకీయ వృత్తి జీవితంలో సహజం. అంతమాత్రాన అనవసరమైన తీవ్రతతో స్పందించడం వల్ల, ప్రత్యర్థి వేదికను మరింత బలపరిచినట్లే అవుతుంది. దీనివల్ల సంఘర్షణ వాస్తవాల స్థాయిలో కాకుండా, భావోద్వేగాల స్థాయిలోకి మారిపోతుంది. ఉన్నత స్థాయిలో కనిపించాలనుకునే వ్యక్తే ఆగ్రహావేశంతో స్పందిస్తే, అది అవమానానికి గురి చేసిన వారికి సానుభూతిని కలిగించే ప్రమాదం ఉంది. రాజకీయ నాయకులే ఉన్నత ప్రమాణాలను పాటించనప్పుడు, యూట్యూబ్ లేదా సోషల్ మీడియా జర్నలిస్టులు బాధ్యతగా వ్యవహరించాలని ఎలా ఆశించగలం? ఇటీవల రేవంత్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి, ఇతర బీఆర్ఎస్ నాయకుల గురించి మాట్లాడుతూ, ‘‘గౌరవం (‘స్టేచర్’) గురించి మాట్లాడుతున్నారు. కానీ వారు ఇప్పటికే స్ట్రెచర్‌పై ఉన్నారు. త్వరలోనే మార్చురీలో చేరతారు,’’ అని వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ వేదికను పిల్లల పాఠశాల స్థాయిలో తిట్ల యుద్ధంగా మార్చడమే. మీడియా నుండి గౌరవాన్ని కోరుకుంటూనే, రాజకీయ వేదికలపై తిట్లతో విరుచుకుపడటం అంటే– ‘నేను చెప్పినట్లు చేయాలి, నేనూ చేసేలా కాదు’ అన్నట్టే! మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఒక వేదిక మీద మాట్లాడుతూ ‘వివేకం, గౌరవం, మర్యాద’ అనే మూడు విలువలు ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన అంశాలని పేర్కొన్నారు.
ఇవి ‘చర్చించు, వాదించు, నిర్ణయించు’ అనే మూడు సూత్రాల ఆధారంగా మనగలుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. బహిరంగంగా ప్రకటనలు చేసే సమయంలో ఈ ప్రామాణిక సూత్రాన్ని గుర్తుపెట్టుకునే రాజకీయ నాయకులు చాలా తక్కువ. శాసనసభలో మీడియా పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రదర్శించిన ఆగ్రహం వెనుక సమర్థమైన కారణమే ఉండవచ్చు గానీ, ఆయన స్పందనలోని తీవ్ర పదజాలం మాత్రం భిన్నంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ప్రతిస్పందించాలి, ఎప్పుడు మౌనం పాటించాలి అనే విషయాన్ని తెలుసుకోవడంలోనే రాజకీయ ప్రౌఢత ఇమిడి ఉంటుంది.
వనం జ్వాలానరసింహారావు
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే
Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్
Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ
Read Latest AP News And Telugu News