P.Chidambaram: పేదలు లేనేలేరా నిర్మలమ్మా?!
ABN , Publish Date - Feb 22 , 2025 | 05:13 AM
నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం 2014 నుంచి ఇచ్చిన హామీలలో మచ్చుకు కొన్నిటిని పేర్కొంటాను. ఇవేవీ నిర్దేశిత లక్ష్యాల పరిపూర్తితో ప్రజల శ్రేయస్సుకు దోహదం చేసినవి కావని మరి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఒక ప్రభుత్వం యథోచితంగా ఇచ్చే హమీలను నేను సాధారణంగా సంశయిస్తాను; చేసిన వాగ్దానాలను అమలుపరిచేందుకు, అంతిమంగా అవి ఎలాంటి ఫలితాలనిచ్చాయో పార్లమెంటుకు నివేదించేందుకు ఒక నిర్దిష్ట గడువును సూచిస్తూ ఇచ్చే హామీలకు మాత్రమే నేను ప్రాధాన్యమిస్తాను. నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం 2014 నుంచి ఇచ్చిన హామీలలో మచ్చుకు కొన్నిటిని పేర్కొంటాను. ఇవేవీ నిర్దేశిత లక్ష్యాల పరిపూర్తితో ప్రజల శ్రేయస్సుకు దోహదం చేసినవి కావని మరి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇవిగో ఆ హామీలు: 2022 సంవత్సరం నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ రెట్టింపు అయి 5 ట్రిలియన్ డాలర్ల విలువ సంతరించుకుంటుంది: మోదీ (సెప్టెంబర్ 20, 2014); 2022లో దేశంలోని ప్రతి గృహానికి ప్రతి రోజూ రేయింబవళ్లు పూర్తిగా విద్యుత్ సరఫరా జరుగుతుంది : మోదీ (సెప్టెంబర్ 4, 2015); 2022 నాటికి ప్రతి భారతీయుడికీ గృహ వసతి సమకూరుతుంది: మోదీ (ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఉటంకింపు); 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది: మోదీ (జూన్ 20, 2018); 2022లోగా ఇండియా బుల్లెట్ ట్రైన్‌లు ఒక వాస్తవంగా ప్రజలకు సేవలు అందిస్తాయి: (ఒమాన్‌లో ప్రవాస భారతీయుల సమావేశంలో మోదీ ఉవాచ). ఇంతకూ 2022 మన జీవన గమనంలో గడిచిపోయిన సంవత్సరమా లేక రాబోయే సంవత్సరమా?
2025–26 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్‌లో 7 పథకాలు, 8 లక్ష్యసాధన సంఘాలు (మిషన్స్), 4 నిధులు (ఫండ్స్)తో సహా అనేక హామీలు ఉన్నాయి. అయితే ఈ పథకాలు, లక్ష్య సాధన సంఘాలలో చాలా వాటికి డబ్బు కేటాయించనే లేదు. సహజంగానే బడ్జెట్‌పై చర్చలో బడ్జెట్‌లో అంకెల గురించి పలువురు ఎంపీలు గౌరవనీయ ఆర్థికమంత్రిని ప్రశ్నించారు. బడ్జెట్ అనేది డబ్బు గురించి కదా. కేటాయించిన డబ్బు, ఖర్చు చేసిన డబ్బును సమగ్ర అంకెలలో తెలుపుతారు.
ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు రూ.1,00,000 కోట్ల మేరకు తాను తగ్గించిన మొత్తంలో సంపన్నుల (వార్షికాదాయం రూ.1 కోటికి పైగా ఉన్నవారు)కు, మహా సంపన్నుల (వార్షికాదాయం రూ.100 కోట్లు ఉన్నవారు)కు, కుబేర సమానుల (వార్షికాదాయం రూ.500 కోట్లు ఉన్నవారు)కు ఇచ్చిన పన్ను మినహాయింపులు కూడా ఉన్నాయని ఆర్థికమంత్రి అంగీకరించారు. అయినా తాను ధనవంతులకు చాలా స్వల్పస్థాయిలో మాత్రమే పన్ను మినహాయింపు నిచ్చానని ఆమె వివరించారు! ‘రూ.1 కోటి నుంచి రూ.500 కోట్ల దాకా వార్షికాదాయం ఉన్న వారు పన్ను తగ్గింపునకు అసలు ఎలా అర్హులు అవుతారు అన్న ప్రశ్నకు ఆర్థిక మంత్రి సమాధానమివ్వలేదు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ప్రతి నిర్ణయంలోనూ సమానహక్కు, నైతికత (ఈక్విటీ, మొరాలిటీ) సూత్రం అంతర్భూతంగా ఉంటుంది. మోదీ ప్రభుత్వం ఈ సూత్రాన్ని చాలా కాలం క్రితమే త్యజించింది. ఆర్థికమంత్రి ‘పన్ను మినహాయింపుల’ నివ్వడంలో తమ నాయకుడిని అనుసరించారు.
మూలధన వ్యయాలలో ‘కోత’లను వివరించడంలో కూడా ఆర్థికమంత్రి అదే పద్ధతిని అనుసరించారు. 2024–25లో కేంద్ర ప్రభుత్వ మూలధనవ్యయంలో రూ.92,682 కోట్ల మేరకు కోత పెట్టారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు మూలధన వ్యయానికి మంజూరు చేసిన మొత్తాలలో రూ.90,887 కోట్లు కోత పెట్టారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో మూల ధన వ్యయానికి సంబంధించిన బడ్జెట్ అంచనాలు గత ఆర్థిక సంవత్సరంలో కంటే అధిక మొత్తంలో ఉన్నాయని ఆమె అన్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆ అంచనా వ్యయాలలో కోత పెట్టరనే భరోసా ఏమున్నది?
ఈ కోతల పర్యవసానాలు ఎలా ఉన్నాయి? 2024–25లో మూలధన వ్యయం, రెవెన్యూ వ్యయంలో కోతలు ఆయా రంగాలలో ఈ విధంగా ఉన్నాయి: (అంకెలు అన్నీ కోట్ల రూపాయాలలో)– ఆరోగ్యం: 1,225; విద్య: 11,584; సాంఘిక సంక్షేమం: 10,019; వ్యవసాయం: 10,992; గ్రామీణాభివృద్ధి: 75,133; పట్టణాభివృద్ధి: 18,907; ఉపాధి కల్పన: 8,283. వ్యయాలలో కోతల వల్ల ఎక్కువగా నష్ట పోయింది ఎవరు? పేదలు. ఆర్థికమంత్రి ఉదారంగా ఇచ్చిన ఆదాయపు పన్ను మినహాయింపు వల్ల లబ్ధి పొందింది ఎవరు? పేదలు ఎంత మాత్రం కాదు.
సమానహక్కు, నైతికత సూత్రానికి ఆర్థికమంత్రి నిబద్ధమయి ఉంటే వస్తు సేవల పన్ను రేట్లు లేదా పెట్రోల్, డీజిల్‌పై పన్నులలో కోత ద్వారా పన్ను తగ్గింపు చేసి వుండేవారు. లేదూ గ్రామీణ ఉపాధి హామీ పథకం లబ్ధిదారుల దినసరి వేతనాల పెంపుదల, అలాగే అన్నిరకాల ఉద్యోగితలోను చట్టబద్ధమైన కనీస వేతనాలను పెంచడం ద్వారా ప్రజల చేతుల్లో భారీ మొత్తంలో డబ్బు ఉంచేవారు.
రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చకు ఆర్థికమంత్రి తన సమాధానాన్ని సాయంత్రం 4 గంటలకు ప్రారంభించారు. ఆమె వాదనా ధోరణి ఎంపీలకు బాగా తెలుసు కనుక, ఆమె సమాధానం తీరు వారినేమీ నిరుత్సాహపరచలేదు. 5.20 గంటలకు మన్మోహన్ సింగ్‌పై ఆమె ఒక విసురు విసిరారు. ఆయన 1991 దార్శనికత, వివేకాన్ని ఆమె పరిహసించారు, ప్రధానమంత్రిగా ఆయన పదేళ్ల హయాంలో సంస్కరణలు ‘స్తంభించి’ పోయాయని ఆమె అన్నారు. 5.30 గంటలకు పేదలను ఆమె అపహసించారు. ‘మీరందరూ పేదవాళ్లే, నేనూ పేదవ్యక్తినే’ అని ఆమె వ్యాఖ్యానించారు కొద్ది నిమిషాల అనంతరం రాఘవ్ ఛద్దా (ఆప్ సభ్యుడు)ను ఉద్దేశించి ‘మీరు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అని భావించడంలో నేను సరిగానే ఉన్నానా?’ అని హేళన చేశారు. 6 గంటల తరువాత 1 నిమిషానికి ఆమె తన సమాధానాన్ని ముగించారు.
ఆర్థికమంత్రి సమాధానంలో పెరుగుతున్న నిరుద్యోగిత లేదా కుదించుకు పోతున్న వస్తూత్పత్తి రంగం గురించి ఒక్కమాట లేదు. ద్రవ్యోల్బణం, వేతనాల స్తంభన, పెరుగుతున్న కుటుంబ రుణభారం గురించీ ఒక్క మాటంటే ఒక్క మాట లేదు. విద్య ఆరోగ్య భద్రతా రంగాలకు బడ్జెట్ కేటాయింపులలో ఖర్చుచేయని నిధుల గురించి ఆమె పెదవి విప్పనేలేదు. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల స్థితిగతులపై మౌనమే ఆమె ప్రతిస్పందన. దేశ జనాభాలో ఆర్థికంగా దిగువన ఉన్న 50 శాతం మంది గురించి ప్రస్తావించనే లేదు. యుఎన్‌డిపి (ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం) ప్రకారం దేశంలోని పేదలలో నిరుపేదలు అయిన (దేశ జనాభాలో) 14.96 శాతం (21 కోట్లు) మంది గురించి ఆమె పూర్తిగా విస్మరించారు. ఇంతెందుకు, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టిలో మన దేశంలో పేదలు లేనే లేరు! ఈ భారత భాగ్య విధాతలను అభాగ్య భారత జన కోటి క్షమించుగాక!!
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)