ఆమెకో జీవితముంది
ABN , Publish Date - Mar 24 , 2025 | 03:23 AM
రొటీన్ నుంచి కొంచెం కొత్తగా కనిపించిన కవిత ఇది. వ్యక్తిగత జీవితంలో, వృత్తి జీవితాల్లో ఆమెల చుట్టూ సమాజం అల్లే అలుసు మాటలు చులకన భావజాలం సుపరిచితం....

రొటీన్ నుంచి కొంచెం కొత్తగా కనిపించిన కవిత ఇది. వ్యక్తిగత జీవితంలో, వృత్తి జీవితాల్లో ఆమెల చుట్టూ సమాజం అల్లే అలుసు మాటలు చులకన భావజాలం సుపరిచితం. ఆధునిక జీవితాల్లో అలాంటి భావజాలం గురించి ఈ కవితలో మాట్లాడారు కవి రాజేశ్వరి రామాయణం. వినోద రంగం లోని స్త్రీ అప్రాధాన్య వ్యాఖ్యలకు లోనవటం ఇతివృత్తంగా తీసుకున్నారు. సినిమాల్లో హీరోకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కానీ హీరోయిన్ లేకుండా వెండితెరను ఊహించలేరు. ఎన్నో రకాల పాత్రల్లో ఆమె ఒదిగిపోతుంది. కథ చివరిలోనైనా తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం ఉండకపోదా అని ఎదురుచూస్తుంది. ఏదో అరుదుగా మినహాయింపు ఉంటుందేమో కానీ, అలనాటి నుండి నేటి వరకూ చాలాసార్లు తెరపై ఆమె ఒక ఆటబొమ్మ. నలుగురు తీరిగ్గా కూర్చుని చెప్పుకునే కబుర్లలో ఆమె కాలక్షేపపు బఠాణీ. సినిమా బయట ఎక్కడ ఏ వ్యక్తిగత సందర్భం లోనైనా ‘‘ఫలానా వాడి నాయిక’’గా వదంతులు సృష్టిస్తుంటారు. వెండితెర మీద కనిపించే ఆమెకు అది వృత్తి అని, వ్యక్తిగతంగా ఆమెకూ ఒక జీవితం ఉంటుంది అని ప్రపంచం గుర్తించదు. పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న యూట్యూబ్ ఛానెల్స్ ఒకడుగు ముందుకేసి సంబంధం లేని థంబ్ నెయిల్స్‌తో కృత్రిమ ఆసక్తిని కలిగిస్తుంటాయి.
వేలి గోటి వెర్రి రాతల్లారా అని రాజేశ్వరి ఈ థంబ్ నెయిల్స్‌ను ఉద్దేశించి మాట్లాడింది. వృత్తి ఉద్యోగ విధులు నిర్వర్తించే వారంతా దాని తాలుకా వాసనల్ని తమ ఇంట్లోకో బెడ్రూమ్ లోకో ఎలా తీసుకురారో అలాగే ఆమె పాత్ర కూడా ఆమె పనిలో భాగంగా మాత్రమే చూడాలని చెప్తోంది. పని చోట సంబంధాలను వ్యక్తిగతంతో ముడిపెట్టటాన్ని ప్రతిఘటిస్తోంది. కవిత టైటిల్‌లో ‘ఫలానా’ ముందు ఎట్ ది రేట్ ఆఫ్ సింబల్ (@) పెట్టటం ద్వారా ఆమె ఒకరి కేరాఫ్ కాదు అని చెప్పేసింది కవి. ఎవరెవరి పేర్లతోనో జత చేసి ఆమెకో పేరుపెట్టటాన్ని నిరసిస్తోంది. ఆమె అపరిచిత కాదు. అనామకురాలు అంతకన్నా కాదు. వెండితెర కోసం పెట్టుకున్నదో తల్లితండ్రులు పెట్టినదో ఆమెకో సొంత పేరుంది. ఆమెదైన సొంత బతుకుంది అని చెప్పటం రాజేశ్వరి ఉద్దేశం.
ఫణి మాధవి కన్నోజు
ఇవి కూడా చదవండి..
Ex MP Kesineni Nani : డీలిమిటేషన్‌పై స్పందించిన మాజీ ఎంపీ
CM Chandrababu: పోలవరానికి సీఎం చంద్రబాబు
Vidadala Rajini: ఆయనకు నాపై చాలా కోపం.. ఎందుకో తెలియదు
Viral News: శవయాత్రలో ఆశ్చర్యకర ఘటన..
KTR: కేటీఆర్ కాన్వాయ్‌లో అపశ్రుతి
IPL Uppal Stadium: ఐపీఎల్ మ్యాచ్.. బ్లాక్ టికెట్ల దందా.. రంగంలోకి పోలీసులు
For Andhrapradesh News And Telugu News