Share News

వాక్యాల్లేని ప్రపంచంలో...

ABN , Publish Date - Mar 24 , 2025 | 03:34 AM

నీతో కలిసి నీ నీడల్లోకి నడిచే పాదాలుండవు. నీ ఒంటరితనం మరింత చిక్కబడుతుంది. నీ ఉదయాలకు సాయంత్రాలకు రంగులద్దే చిత్రకారుడు లేక దృశ్యాల చుట్టూ చీకటి....

వాక్యాల్లేని ప్రపంచంలో...

నీతో కలిసి నీ నీడల్లోకి నడిచే పాదాలుండవు. నీ ఒంటరితనం మరింత చిక్కబడుతుంది. నీ ఉదయాలకు సాయంత్రాలకు రంగులద్దే చిత్రకారుడు లేక దృశ్యాల చుట్టూ చీకటి. వాక్యం తోడులేని వెన్నెల రాత్రులు పండవు. పిట్టల పాటల్ని శిశిరాలు ఎత్తుకుపోతాయి. ఒక్క ఎలిజీ కూడా తోడులేక నీ శోభాయాత్ర వెలవెలబోతుంది. నిన్ను ప్రకృతితో కలిపే దారం తెగిపోయి నీ ప్రేమ ప్రకటనలో ప్రాణం లోపిస్తుంది. నీ మాటల్లోకి నదులు ప్రవహించవు. పువ్వుల భాషలో నీతో సంభాషించే వాళ్లుండరు. చలికి వణికే ఎడారుల లిపి నీకు అర్థం కాదు. కమ్ముకున్న పొగమంచులో గొంతును ఎలా పెగుల్చుకోవాలో తెలియదు. ఒక ఉద్వేగాన్ని పండించడంలో కవికి ఉన్నంత నేర్పు నీకుండదు. నీ కలలకు అనువాదాలు దొరకవు.


నీ జెండా కర్ర మీద పిట్టలు వాలవు. లోయల గొంతు నీకు వినిపించదు. అడవి తుడుం మోత నీ గదిలో మోగదు. ఒక్కో అవయవమూ రాలి నువ్వు శిథిలమవుతూ రాజు భుజం మీదే మిగిలిపోతావు. చెట్టుకొమ్మకు ప్రశ్నలా వేలాడ్డం నీవల్ల కాదు. నీతో కలిసి నీకోసం ఏడ్చే వాళ్లుండరు. పొదల్లో నక్కిన తోడేలుగుట్టు ఆఖరు వరకూ పిల్లాడికి తెలీదు. నీ ఊపిరి మీద కాలేసి తొక్కుతుంటే నీ తరుపున అడిగే గొంతుండదు. అండాసెల్‌లలోకి జీవనదులు ప్రవహించకపోతే, రెక్కలపై వేలాడుతున్న సంకెళ్ళలోంచి అక్షరాలై కురవకపోతే కాలం తప్పొప్పులు చరిత్ర రక్తం లోకి ఇంకవు. రాజ్యం జన్యువుల్లో వచ్చే ఉత్పరివర్తనాల గురించి ఎప్పటికప్పుడు నిన్ను హెచ్చరించే వారుండరు. బుల్డోజర్ కింద నలిగే కన్నీళ్ళు పిడికిళ్లు కాలేవు. చివరికి నువ్వు మరణించిన సంగతి నీకే తెలీదు.

సాంబమూర్తి లండ

96427 32008

ఇవి కూడా చదవండి..

Ex MP Kesineni Nani : డీలిమిటేషన్‌పై స్పందించిన మాజీ ఎంపీ

CM Chandrababu: పోలవరానికి సీఎం చంద్రబాబు

Vidadala Rajini: ఆయనకు నాపై చాలా కోపం.. ఎందుకో తెలియదు

Viral News: శవయాత్రలో ఆశ్చర్యకర ఘటన..

KTR: కేటీఆర్ కాన్వాయ్‌లో అపశ్రుతి

IPL Uppal Stadium: ఐపీఎల్ మ్యాచ్.. బ్లాక్ టికెట్ల దందా.. రంగంలోకి పోలీసులు

For Andhrapradesh News And Telugu News

Updated Date - Mar 24 , 2025 | 03:34 AM