Share News

sleep: నిద్రించేవాళ్లు

ABN , Publish Date - Mar 24 , 2025 | 03:31 AM

నిద్రించేవాళ్ళను చూసినప్పుడు వారి కన్నులు ప్రసరించే వెలుతురులో నేను మరింత మేల్కొంటాను- నిద్రించేవాళ్లు, నేల మీద పరిచిన శిలువల మీద పడుకున్న నీడల్లాంటి వాళ్ళు...

sleep: నిద్రించేవాళ్లు

నిద్రించేవాళ్ళను చూసినప్పుడు వారి కన్నులు ప్రసరించే వెలుతురులో నేను మరింత మేల్కొంటాను- నిద్రించేవాళ్లు, నేల మీద పరిచిన శిలువల మీద పడుకున్న నీడల్లాంటి వాళ్ళు- వారిని చూసినప్పుడు నిద్రకీ మెలకువకీ మధ్య రెప్పవేయని కనురెప్పలా కదులుతూ ఉంటాను

నిద్రించేవారి చుట్టూ నిలువెత్తు పక్షిలా తిరుగుతూ ప్రార్థనలాంటి గీతాలు పాడుతాను వారి కన్నుల మీద కదిలే కాంతి చీకట్లతో ఆడుకుంటాను వారి కలలతో కలిసి వారి ఆత్మల పలకల మీద కవిత్వాలు రాస్తాను- నిద్రించేవారు తమ చుట్టూ పేర్చుకున్న నిశ్శబ్ద సరస్సులలో నా నీడకు స్నానం చేయిస్తాను-

సత్యాన్ని వెలికి తీసే పనిలో నిద్రించేవాళ్లు, తమ మీద సముద్రాలను కప్పుకుంటారు- వారి పెదాల మీద దోబూచులాడే పసిపిల్లల్లాంటి పక్షుల్లా విచ్చుకునే పువ్వుల్ని చూసి మనసారా నవ్వుకుంటాను- నిద్రించే వాళ్ళు, తమ ఆనవాళ్లను మరిచిపోయి కొత్తగా ఉదయించబోతున్న కొత్త మనిషి స్వాగతం కోసం తమను పువ్వుల్లా పరుచుకుంటారు- గడిచిపోయిన కాలాల నెరవేరని స్వప్నాలను దీపాలుగా వెలిగించి తమకు కాపలా పెట్టుకుంటారు

వారిని చూస్తుంటే అంతరిక్షంలో అప్పుడే కళ్ళు తెరిచిన నక్షత్రాలేవో నా ఊహల్లో ఊగుతుంటాయి-

నిద్రించేవాళ్ళను చూడడమంటే ఉదయించే గోళాలకు తలను ఆన్చి మెలకువలో నిద్రపోవడమే- నిద్రించేవాళ్లు, నీటినీ మనిషినీ జో కొడుతూ తీరంలో జోగుతున్న పడవలు- ఆరిన కాంతిలో తడిసిన ఆత్మల మైమరపు మత్తులో తూగుతున్న ప్రమిదలు- నిద్రించేవాళ్లు, ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే మునీశ్వరులు కాదు దేహంలోని తూటాలకు తమ ప్రాణాలను పాటలుగా దానం చేస్తున్న అజ్ఞాత వీరులు- నిద్రించేవారు, నిద్రలో మానవ సృహ కోల్పోయి ఏవో శూన్య జలాల మీద అపూర్వ అనుభవానందంలో

తేలుతూ ఉంటారు- చెట్లతో పక్షుల సంభాషణ లాగా నిద్రించేవాళ్లు, సుఖదుఃఖాలకు అతీతమైన మంత్రం ఏదో పఠిస్తూ ఉంటారు- నిద్రపోయే వాళ్లంతా పసిపాపలే- నిద్రించేవాళ్లని చేతకాని వాళ్ళని నిందించకండి మన మెలకువను వేకువగా వెలిగించడానికి వాళ్లు కలల్లో కాలిపోతుంటారు- వారిని నేను చూసినప్పుడల్లా అప్పుడే మళ్ళీ జన్మిస్తాను నీషే చెప్పిన బాలుడిలా.

ప్రసాదమూర్తి

84998 66699

Updated Date - Mar 24 , 2025 | 03:31 AM