Health Tips: కొద్దిదూరం నడవగానే అలసిపోతున్నారా.. మీకు ఈ సమస్యలున్నట్లే
ABN , Publish Date - Mar 24 , 2025 | 10:27 AM
మనలో చాలా మంది కాస్త దూరం నడవగానే అలసిపోతుంటారు. ఇలాంటి లక్షణం కనిపిస్తే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే అంటున్నారు నిపుణులు.

మనలో చాలా మంది పైకి ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తారు. కానీ ఓ పదడుగుల దూరం నడవగానే.. అమ్మో.. అబ్బో అంటూ ఆయాసపడుతుంటారు. కొద్ది పాటి దూరం నడిచినా సరే ఎంతో అలసిపోతారు. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే అంటున్నారు వైద్యులు. కొద్ది దూరం నడవగానే అలసిపోవడం అనేది శరీరంలో దాగి ఉన్న సమస్యలకు సంకేతం అంటున్నారు. మరి ఈ అలసటకు కారణాలు ఏంటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే..
రక్తహీనత(అనీమియా)
కొద్ది పాటి దూరం నడిచినా.. త్వరగా అలసిపోవడానికి ప్రధాన కారణం రక్త హీనత. మన రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే శరీర కణాలకు ఆక్సిజన్ సరిగా అందదు. దీనివల్ల త్వరగా అలసిపోతాము. రక్తహీనతకు ప్రధాన కారణం.. శరీరంలో ఇనుము లోపించడం. నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) ప్రకారం.. భారతదేశంలో 50 శాతం మంది మహిళలు రక్త హీనత సమస్యతో బాధపడుతున్నారు.
గుండె సంబంధిత సమస్యలు
గుండె సంబంధిత సమస్యలు ఉన్న వాళ్లు కూడా నడుస్తున్నప్పుడు త్వరగా అలసిపోతారు. ఇందుకు కారణం.. గుండె సరిగా రక్తాన్ని పంప్ చేయలేకపోతే, కండరాలకు శక్తి అందదు. ఫలితంగా త్వరగా అలసిపోతారు. గుండె బలహీనత, ఆర్టరీలలో అడ్డంకులు ఈ సమస్యకు కారణం అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ హెచ్చరిస్తుంది. ఇది తీవ్ర అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు అని చెబుతున్నారు.
ఊపిరితిత్తుల సమస్యలు
ఆస్తమా, సీఓపీడీ వంటి వ్యాధుల వల్ల ఊపిరి సరిగా ఆడక, ఆక్సిజన్ తక్కువై త్వరగ అలసిపోయినట్లు అనిపిస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. నేటి కాలంలో ఊపిరితిత్తుల సమస్యలు ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నాయి.
డయాబెటిస్
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా లేకపోతే.. శరీరం శక్తిని సరిగా ఉపయోగించలేదు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకారం.. డయాబెటిస్ ఉన్నవారిలో అలసట సర్వ సాధారణ లక్షణం అంటున్నారు.
డీహైడ్రేషన్
నీరు తాగడం తక్కువైతే, రక్త ప్రవాహం మందగించి, అలసట కలుగుతుంది. ఒక వ్యక్తికి రోజుకు 2-3 లీటర్ల నీరు అవసరం అని మాయో క్లినిక్ చెబుతుంది
సలహా
పైన చెప్పిన లక్షణాలు తరచుగా కనిపిస్తే.. ఆలస్యం చేయకుండా వెంటనే రక్త పరీక్షలు, ఈసీజీ వంటివి చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం చేయడంతో పాటుగా వైద్య సలహా తీసుకోవడం ముఖ్యం.
ఇవి కూడా చదవండి:
మంచి శకునాల్లో మొదటిది ఏంటంటే..
చికెన్ తిన్న వెంటనే తినకూడని పదార్థాలు ఏంటో తెలుసా..