Marco Rubio Elon Musk showdown: అమెరికా విదేశాంగ శాఖ మంత్రితో మస్క్ రచ్చ.. చివర్లో ట్రంప్ ట్విస్ట్
ABN , Publish Date - Mar 08 , 2025 | 01:58 PM
ఉద్యోగుల తొలగింపును సంబంధించి అమెరికా మంత్రి వర్గ సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి, ఎలాన్ మస్క్ వాదోపవాదాలకు దిగారు. అయితే, రూబియోకు మద్దతు ప్రకటిస్తూ డొనాల్డ్ ట్రంప్ సమావేశానికి చివర్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చారట.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంత్రి వర్గంలో అప్పుడే లుకలుకలో మొదలయ్యాయా? ఎలాన్ మస్క్‌కు ఎదురు గాలులు మొదలయ్యాయా? అంటే అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా. తాజాగా మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు ఎలాన్ మస్క్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో మధ్య జరిగిన వాగ్వాదం ఇందుకు ఉదాహరణగా చెబుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం, ట్రంప్ ముందే మస్క్, రూబియో తీవ్ర స్థాయిలో వాదులాడుకున్నారట. చివర్లో ట్రంప్ అసలైన ట్విస్ట్ ఇచ్చారట (Rubio Vs Elon musk in Trump Cabinet Meeting).
డోజ్ శాఖకు సారథ్యం వహిస్తున్న ఎలాన్ మస్క్ ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆయా శాఖల మంత్రులకు ఇది అస్సలు రుచించట్లేదట. మస్క్ తాఖీదులను పట్టించుకోవద్దని ఇప్పటికే ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తన సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గతంలో తాను సారథ్యం వహించిన యూఎస్ఏఐడీని మస్క్ మూసేయిండంపై గుర్రుగా ఉన్న రూబియా తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో తన ఆక్రోశాన్నంతా వెళ్లగక్కారట.
Trump: సుంకాల తగ్గింపునకు భారత్ ఒప్పుకొంది
మీ శాఖలో ఎవ్వరినీ తొలగించలేదు ఎందుకని మస్క్ తొలుత రూబియోను ప్రశ్నించారట. దీనికి ఘాటుగా బదులిచ్చిన రూబియో ఇప్పటికే 1500 మంది తమంతట తాముగా పక్కకు తప్పుకున్న విషయాన్ని పేర్కొన్నారట. ఈ సంఖ్యపై మస్క్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో రూబియో సెటైర్లు పేల్చారట. ప్రస్తుతం తొలగించిన వారిని మళ్లీ నియమించి ఆ తరువాత తొలగిస్తే సంఖ్య పెరుగుతుందా అని అన్నారట. దీంతో, మీరు సరిగా పనిచేయట్లదేని మస్క్ మండిపడ్డారు. ఈ వాగ్వాదాన్ని చాలా సేపటి నుంచి మౌనంగా వీక్షిస్తున్న ట్రంప్ కల్పించుకుని మార్కోకు మద్దతుగా నిలిచారు. అతడు అద్భుతంగా పని చేస్తున్నాడని మస్క్ ముందే కితాబునిచ్చారు. ఇలా వాగ్వాదానికి ట్రంప్ ఊహించని ట్విస్ట్ ఇవ్వడంతో మస్క్ స్పీడుకు బ్రేకులు వేసే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు ఉన్నారన్న వ్యాఖ్యలు వెలువడ్డాయి.
Tariffs on Canada: మెక్సికో తరువాత కెనడాకు ఊరట.. ట్రంప్ సుంకాల విధింపు వాయిదా
ఈ వివాదంపై వచ్చిన మీడియా కథనాలపై ట్రంప్ ఆ తరువాత స్పందిస్తూ తమ మధ్య విభేదాలేవీ లేవని స్పష్టం చేశారు. ‘‘వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. నేను అక్కడే ఉన్నాను. ఎలాన్, మార్కో ఇద్దరు గొప్పగా పనిచేస్తున్నారు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక ఈ ఉదంతంతోనైనా మస్క్ స్పీడుకు బ్రేకులు పడతాయా లేక మరింత వివాదం మరింత ముదురుతుందా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Read Latest and International News