Share News

Donald Trump: మనం తగ్గొద్దు!’

ABN , Publish Date - Mar 09 , 2025 | 02:49 AM

ట్రంప్‌ బెదిరింపులకు లొంగిపోవాల్సిన అవసరం లేదని ఫార్మా రంగ నిపుణుడు రావి ఉదయ్‌ భాస్కర్‌ పేర్కొన్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఫార్మా, వైద్య సంబంధిత ఉపకరణాలపై మనం సుంకాలు తగ్గించాల్సిన అవసరంలేదని అభిప్రాయపడ్డారు.

Donald Trump: మనం తగ్గొద్దు!’

ట్రంప్‌ బెదిరింపులకు లొంగొద్దు.. అమెరికా ‘ఆరోగ్యం’ మన చేతుల్లోనే

30శాతం జెనరిక్‌ మందులు భారత్‌వే

పట్టున్న రంగంలో గట్టిగా ఉండాలి

ఫార్మాక్సిల్‌ మాజీ డీజీ ఉదయ్‌ భాస్కర్‌

‘ఆంధ్రజ్యోతి’తో ముఖాముఖి

(సెంట్రల్‌ డెస్క్‌): మెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్‌ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. ‘ప్రతీకార సుంకాలు’ అంటూ చెలరేగుతున్నారు. ‘భారత్‌నూ వదిలేదు’ అని హెచ్చరిస్తున్నారు. ఇది ఫార్మారంగంపై కీలక ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. అయితే... ట్రంప్‌ బెదిరింపులకు లొంగిపోవాల్సిన అవసరం లేదని ఫార్మా రంగ నిపుణుడు రావి ఉదయ్‌ భాస్కర్‌ పేర్కొన్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఫార్మా, వైద్య సంబంధిత ఉపకరణాలపై మనం సుంకాలు తగ్గించాల్సిన అవసరంలేదని అభిప్రాయపడ్డారు. నాలుగు దశాబ్దాలకుపైగా ఫార్మా రంగంతో అనుబంధం ఉన్న ఆయన... ఫార్మాసూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఫార్మాక్సిల్‌) డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆల్‌ ఇండియా డ్రగ్స్‌ కంట్రోల్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ (ఏఐడీసీఓసీ) గౌరవ డైరెక్టర్‌ జనరల్‌గా, ఏఐడీసీఓసీ ట్రైనింగ్‌ అకాడమీ డైరెక్టర్‌ జనరల్‌గా సేవలు అందిస్తున్నారు. అమెరికా ప్రతీకార పన్నుల ప్రకటన నేపథ్యంలో మన వైఖరి ఎలా ఉండాలి? మన అడుగులు ఏ దిశగా పడాలి? అనే అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’తో ఉదయ్‌ భాస్కర్‌ తన అభిప్రాయాలు పంచుకున్నారు.


ప్రతీకార సుంకాలకు సంబంధించి మన దేశం ట్రంప్‌ బెదిరింపులకు లొంగుతోందా?

జవాబు: దురదృష్టవశాత్తు అవుననే చెప్పాలి. ఫార్మా ఎగుమతుల్లో 126 బిలియన్‌ డాలర్లతో జర్మనీ మొదటి స్థానంలో ఉంది. మనం 27 బిలియన్‌ డాలర్లతో 11వ స్థానంలో ఉన్నాం. అమెరికాను పక్కన పెడితే మొదటి ఐదు స్థానాల్లో ఉన్నవన్నీ ఐరోపా దేశాలే. అవేవీ ట్రంప్‌ బెదిరింపులకు తలొగ్గలేదు. మనమే ఒక అడుగు ముందుకేసి తలొగ్గుతున్నాం. మన ప్రభుత్వం అమెరికా దిగుమతులపై సుంకాలను పూర్తిగా ఎత్తివేసేలా అడుగులు వేస్తోంది.

ఫార్మాలో అమెరికాకు మన అవసరం ఏమిటి?

జవాబు: చాలా ఉంది. అమెరికాకు అవసరమైన జనరిక్‌ మందుల్లో 30 శాతం మందులను మనమే ఎగుమతి చేస్తున్నాం. మరే దేశమూ ఇవ్వలేనంత చౌకగా, నాణ్యతతో మనం అందిస్తున్నాం. ఇంత తక్కువకు అమెరికా స్వయంగా ఉత్పత్తి చేయలేదు. మన దేశ ఫార్మా ఎగుమతులపై అధిక సుంకాలు విధిస్తే... అమెరికా ఆరోగ్య రంగం మరింత ఖరీదవుతుంది. ట్రంప్‌ తన ప్రజలను బలిపెట్టి ప్రతీకారానికి దిగుతాడని నేను అనుకోవడం లేదు. ఆయన ఫక్తు వ్యాపారవేత్త. ఆయన బెదిరింపులను ఈ కోణంలోనే చూడాలి.

చైనా కూడా బెదిరింపులకు దిగితే పరిస్థితి ఏమిటి?

జవాబు: రసాయనాలు, యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రెడియెంట్స్‌ (ఏపీఐ)ల కోసం ప్రపంచమంతా చైనాపైనే ఆధారపడి ఉంది. 80వ దశకం వరకూ ఏపీఐ తయారీ రంగంలో మనం బలంగానే ఉన్నాం. ఆ తరువాత మనం లాభాలు ఎక్కువగా ఉన్న ఫార్మలేషన్‌ వైపు మళ్లాం. ఐరోపా కూడా అంతే. వాటిని చైనా అందిపుచ్చుకుంది. తనను కాదనుకుని ప్రపంచంలో ఏ దేశమూ చేయగలిగింది ఏమీ లేదన్న స్థాయికి చైనా ఎదిగింది. రసాయనాలు, యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రెడియెంట్స్‌ (ఏపీఐ)ను చైనా ఆపివేస్తే... ప్రపంచ ఫార్మారంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది.


చైనా ప్రభావాన్ని తగ్గించుకోవడమెలా?

జవాబు: కెమికల్‌ పార్క్‌లను ఏర్పాటు చేయాలి. కాలుష్యం గురించి ఆందోళన అక్కర్లేదు. ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. అలాగే ఏపీఐపైనా దృష్టి సారించాలి. ఇదంతా చేయడానికి మనకు 10 నుంచి 15 ఏళ్లు పట్టవచ్చు. అప్పటికైనా... ఓ మేరకు స్వయం సమృద్ధిని సాధించగలుగుతాం. వాటికితోడు మనం ఇప్పుడు రిసెర్స్‌, ఇన్నోవేషన్‌పై పెట్టుబడులు పెట్టాలి. ఫార్మా రంగం తనకు వస్తున్న లాభాలను ఇతర రంగాలకు మళ్లిస్తోంది. అలాకాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్టి కోణంలో ఆలోచించాలి. ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో ప్రోత్సాహకాలు అందాలి.

ట్రంప్‌ వచ్చాక ‘యూఎస్‌ ఎయిడ్‌’ నిలిపివేశారు. దీని ప్రభావం మన ఫార్మాపై ఏమేరకు ఉండొచ్చు?

జవాబు: నిజం చెప్పాలంటే... ప్రతీకార సుంకాలకంటే, యూఎస్‌ ఎయిడ్‌ నిలిపివేతవల్లే మన ఫార్మాపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఆఫ్రికన్‌ దేశాలకు, తూర్పు ఆసియా, లాటిన్‌ అమెరికాలోని కొన్ని దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, వివిధ స్వచ్ఛంద సంస్థలు మందులను అందిస్తున్నాయి. వ్యాక్సిన్లు, ఎయిడ్స్‌, టీబీ మందులు వంటివి కీలకమైనవి. పేద ప్రజల ప్రాణ రక్షణకు అత్యంత చౌకగా నాణ్యమైన మందులను అందిస్తున్న ఏకైక దేశం భారతదేశం. అమెరికా సాయం ఆగిపోతున్న నేపథ్యంలో కచ్చితంగా ఆ ప్రభావం మన కంపెనీలపై ఉంటుంది. ఇది కేవలం ఆర్థిక, వాణిజ్యపరమైన సమస్య కాదు. ప్రపంచంలోని కోట్లాది మంది నిరుపేదల ప్రాణాలతో అమెరికా ఆడుకుంటోంది. లక్షల సంఖ్యలో ఉన్న ఎయిడ్స్‌ బాధితులు మందులు అందక మరణం అంచుకు చేరుకుంటారు.


ప్రపంచవ్యాప్తంగా విశాల వాణిజ్య దృక్పథాలకు వీడ్కోలు పలుకుతున్న ధోరణలు కనిపిస్తున్నాయా?

జవాబు: లోకలైజేషన్‌తో వస్తున్న ఇబ్బందులివి. ప్రతి దేశమూ తనదైన శైలిలో ఆయా రంగాల్లో రాణించాలని అనుకుంటోంది. ఆత్మనిర్భర్‌ నినాదం ఆకర్షణీయమైనది. అయితే నూరు శాతం సాధ్యం కాదన్న కఠిన వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. నేటి వాణిజ్య ప్రపంచంలో సంకుచిత ధోరణులతో సాధించగలిగేది ఏమీ లేదన్నది తెలియకేం కాదు.

తెలుగు రాష్ట్రాల్లో ఫార్మా ఎగుమతుల విలువ ఎంత?

జవాబు: పెద్ద, చిన్న కంపెనీలు అన్నీ కలుపుకొంటే సుమారు వెయ్యి వరకూ ఉన్నాయి. డీజీసీఐఎస్‌ లెక్కల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఫార్మా ఎగుమతుల్లో మన రెండు రాష్ట్రాల వాటా 26.82 శాతం. తెలంగాణ 18.92 శాతం... 5,268.59 మిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ 7.90 శాతం... 2,199.26 మిలియన్‌ డాలర్లతో 4వ స్థానంలో ఉంది. మన దేశం నుంచి అవుతున్న మొత్తం ఎగుమతుల విలువ 27,846.38 మిలియన్‌ డాలర్లు. ఉద్యోగుల సంఖ్య సుమారుగా రెండు లక్షల వరకూ ఉండవచ్చని అంచనా!


ఆంక్షల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎంత?

జవాబు: మన రెండు రాష్ట్రాల నుంచి జరిగే ఎగుమతుల్లో 80 శాతం వాటా పెద్ద కంపెనీలదే. అమెరికాతోపాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఈ ఔషధాలు వెళ్తున్నాయి. ఈ కంపెనీలపై అమెరికా ఆంక్షల ప్రభావం పెద్దగా ఉంటుందని నేను అనుకోవడం లేదు. మరెక్కడా లేని విధంగా దేశవ్యాప్తంగా 650కుపైగా యూఎ్‌సఎ్‌ఫడీఏ అనుమతి పొందిన ఉత్పత్తి కేంద్రాలు మన దేశంలో ఉన్నాయి. అక్కడ తయారయ్యే మందులు ప్రపంచంలోని ఏ దేశానికైనా వెళ్లగలిగే నాణ్యతను కలిగి ఉన్నాయి.


ఇవి కూడా చదవండి

PM Modi: ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడను నేనే.. మహిళా దినోత్సవంలో మోదీ

PM Modi: మోడీ అకౌంట్ ఈమె చేతుల్లోనే.. ఎవరీ వైశాలి..

Israeli tourist: భారత్ పరువు తీశారు కదరా.. కర్ణాటకలో ఇజ్రాయెల్ మహిళపై సామూహిక అత్యాచారం..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 09 , 2025 | 07:15 AM