Padma Awards 2025 : తెలుగు రాష్ట్రాలకు సప్త పద్మాలు
ABN , Publish Date - Jan 26 , 2025 | 04:37 AM
తెలంగాణకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత జీర్ణ కోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డిని ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పద్మ విభూషణ్ వరించింది. తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖ నటుడు, శాసన సభ్యుడు బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. తెలంగాణకు చెందిన మాదిగ రిజర్వేషన్ ఉద్యమకారుడు

విఖ్యాత వైద్యుడు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి విభూషణ్
స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్!
మాదిగ రిజర్వేషన్ ఉద్యమ నేత మందకృష్ణ,
అవధాని మాడుగుల నాగఫణి శర్మలకు పద్మశ్రీ
విద్యావేత్తలు కృష్ణ, వాధిరాజులకూ చోటు
బుర్రకథ అప్పారావుకు మరణానంతర పురస్కారం
దశదిన కర్మరోజే పద్మశ్రీ వార్త విన్న కుటుంబం
7 పద్మ విభూషణ్, 19 భూషణ్, 113 పద్మశ్రీలు
గణతంత్ర పౌర అవార్డులను ప్రకటించిన కేంద్రం
వాసుదేవ నాయర్, ఎల్.సుబ్రహ్మణ్యం విభూషణ్‌లు
శేఖర్ కపూర్, అజిత్, శోభనలకు పద్మ భూషణ్
న్యూఢిల్లీ, జనవరి 25(ఆంధ్రజ్యోతి): తెలంగాణకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత జీర్ణ కోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డిని ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పద్మ విభూషణ్ వరించింది. తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖ నటుడు, శాసన సభ్యుడు బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. తెలంగాణకు చెందిన మాదిగ రిజర్వేషన్ ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ అవధాన విద్వాంసుడు మాడుగుల నాగఫణిశర్మ, ప్రముఖ విద్యావేత్త, రచయిత కేఎల్ కృష్ణ, కళారంగానికి చెందిన మిరియాల అప్పారావు(మరణానంతరం), విద్యారంగానికి చెందిన వాధిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖిలకు ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. ఈ ఏడాదికి ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్‌సింగ్ ఖెహర్, ఇటీవల మరణించిన ప్రముఖ మళయాళీ రచయిత వాసుదేవన్ నాయర్, ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ఎల్.సుబ్రమణ్యం, కథక్ నృతకారిణి కుముదిని లఖియా, ప్రముఖ జానపద గాయని శారాదా సిన్హా, జపాన్‌కు చెందిన వ్యాపార వేత్త, సుజుకీ మోటార్ చైర్మన్ ఒసామా సుజుకీ(మరణానంతరం)కి పద్మ విభూషణ్ పురస్కారాలు లభించాయి.
పద్మ భూషణ్ లభించిన వారిలో మహారాష్ట్ర మాజీ సీఎం, మాజీ లోక్‌సభ స్పీకర్, శివసేన నేత మనోహర్ జోషి, సీనియర్ జర్నలిస్టు కె.సూర్యప్రకాశ్, ప్రముఖ సినీనటులు అనంతనాగ్, అజిత్ కుమార్, దర్శకుడు శేఖర్ కపూర్, నటి, భరతనాట్య ప్రముఖురాలు శోభన, ప్రముఖ గాయకుడు పంకజ్ ఉదాస్, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ, ప్రముఖ హాకీ కోచ్ పీఆర్ శ్రీజేష్, ఇటీవల మరణించిన ప్రముఖ ఆర్థిక వేత్త వివేక్ దెబ్రాయ్, ఆధ్యాత్మికవేత్త సాధ్వి రితంబర, నల్లి స్కిల్స్ అధినేత నల్లి కుప్పుస్వామి శెట్టి తదితరులు ఉన్నారు. పద్మశ్రీ పురస్కారాలు పొందిన ప్రముఖులలో గాయకుడు అర్జిత్ సింగ్, సుప్రీంకోర్టు న్యాయవాది సీఎస్ వైద్య్యనాథన్, ప్రముఖ రాజస్థానీ రచయిత షిన్ కాప్ నిజాం తదితరులు ఉన్నారు. తమిళనాడుకు చెందిన దినమలర్ పత్రిక యజమాని లక్ష్మిపతి రామసుబ్బయ్యర్‌కు పద్మశ్రీ ఇచ్చారు. తమిళనాడు నుంచి ఇటీవలే రిటైర్ అయిన ప్రముఖ క్రికెట్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను పద్మశ్రీ వరించింది. అత్యంత విజయవంతమైన స్టార్ల్‌పలు ఫ్లిప్‌కార్ట్, ఓలా, బుక్‌మైషో, స్విగ్గీలను తొలిదశలోనే గుర్తించి వాటి పురోగతికి అండగా నిలిచిన వెంచర్ క్యాపిటలిస్ట్ ప్రశాంత్ ప్రకాశ్(కర్ణాటక)ను పద్మశ్రీతో గౌరవించారు. జాతీయ గీతానికి కొత్త ట్యూన్ కట్టిన సంగీతకారుడు రికీ గ్యాన్ కేజ్(కర్ణాటక) పద్మశ్రీ అందుకున్న వారిలో ఉన్నారు.
కేఎల్ కృష్ణ ఆర్థికవేత్త
ప్రొఫెసర్ కొసరాజు లీలా కృష్ణ ప్రముఖ ఆర్థికవేత్త. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో విశేష సేవలు అందించారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఉంగటూరులో జన్మించారు.
పదో తరగతి చదవి అవధానిగా ఎదిగి
అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కడవకల్లు గ్రామానికి చెందిన మాడుగుల నాగఫణి శర్మ కేవలం పదో తరగతి చదివారు. ఆ తర్వాత ఆధ్యాత్మికత దిశగా వెళ్లి అవధానిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆయన తల్లిదండ్రులు మాడుగుల నాగభూషణ శర్మ, సుశీలమ్మ. 1959లో నాగఫణి శర్మ జన్మించారు. ఈయనకు ఐదుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్క చెల్లెల్లు ఉన్నారు. మొత్తం 9 మందిలో నాగఫణి శర్మ రెండో సంతానం. కడవకల్లు, పుట్లూరు, లేపాక్షి, కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈయన చదువు కొనసాగింది.
సంస్కృత భాషకు చేసిన సేవలు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో పద్మశ్రీ గ్రహీత వాధిరాజు రాఘవేంద్రచార్య పంచముఖి సుదీర్ఘకాలం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ డెవల్‌పమెంట్ సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం మంత్రాలయ సంస్కృత విద్యాలయ విశ్వవిద్యాలయం చాన్స్‌లర్‌గా పని చేస్తున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో పదేళ్లుగా చాన్స్‌లర్‌గా పని చేశారు. వాధిరాజ్ తాను ఈ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోలేదని చెప్పారు.
పద్మ గ్రహీతలకు కిషన్‌రెడ్డి అభినందనలు
తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారిని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అభినందించారు. ఆయా రంగాల్లో వారు చేసిన సేవలకు సరైన గుర్తింపు లభించిందని ఆయన అన్నారు. వైద్య పరిశోధనలో నాగేశ్వర్‌రెడ్డి, మాదిగ సమాజానికి గుర్తింపు పోరాటంలో మందకృష్ణ అలుపెరగని కృషి చేశారని కొనియాడారు. సినీ, రాజకీయ, సామాజిక సేవ రంగాల్లో బాలకృష్ణ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారని ప్రశంసించారు.
బుర్రకథ గురువు అప్పారావు
కోనసీమ జిల్లా రావులపాలెంలో నివాసం ఉంటున్న బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావు ఈ నెలలోనే కనుమ పండుగ రోజు మరణించారు. శనివారం నాడే దశదిన కర్మ నిర్వహించారు. ఇదే సమయంలో పద్మశ్రీకి అప్పారావు ఎంపికయ్యారంటూ సమాచారం రావడంతో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరయ్యారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కరప మండలం నడకుదురు గ్రామంలో 1949లో అప్పారావు జన్మించారు. 1969లో బుర్రకఽథ రంగంలో అడుగుపెట్టి జూనియర్ నాజర్, రావిశెట్టి వీరేశం గురువుల వద్ద బుర్రకథ కళను అభ్యసించారు. రాగాల అప్పారావుగా కూడా పేరొందారు. రేడియోలో, దూరదర్శన్‌లో ప్రదర్శనలు ఇచ్చారు.