Share News

Pamban Bridge: ఆధునిక ‘రామ సేతు’!

ABN , Publish Date - Apr 06 , 2025 | 02:23 AM

రామనవమి సందర్భంగా పాంబన్‌ దీవిని ప్రధాన భూభాగంతో కలిపే దేశంలోనే తొలి వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే వంతెనను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. రామసేతువుతో చారిత్రక సంబంధం ఉన్న ఈ ప్రాంతానికి ఆధునిక సాంకేతికతతో నిర్మించిన కొత్త వంతెన ప్రాధాన్యతను సంతరించుకుంది.

Pamban Bridge: ఆధునిక ‘రామ సేతు’!

ఇంజనీరింగ్‌ అద్భుతం పాంబన్‌ రైలు బ్రిడ్జి

మండపం-రామేశ్వరం మధ్య సరికొత్త వారధి

నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ

2.07 కి.మీ. పొడవు.. 535 కోట్ల వ్యయం

తొలి ‘వర్టికల్‌ లిఫ్ట్‌ సీ బ్రిడ్జి’గా ఖ్యాతి

శ్రీలంక పర్యటనలో ప్రధాని.. చరిత్రాత్మక రక్షణ

ఒప్పందం.. మోదీకి మిత్ర విభూషణ అవార్డు

(చెన్నై, ఆంధ్రజ్యోతి)

దేశమంతా రాములోరి కల్యాణానికి సిద్ధమైంది. ఇదే సమయంలో శ్రీరాముడు నడయాడిన పాంబన్‌ దీవి మరో అద్భుత ఆవిష్కరణకు వేదికవుతోంది. రావణ లంకకు వెళ్లేందుకు నాడు వానరసేన నిర్మించినట్లు విశ్వసించే రామసేతు మొదలయ్యేది పాంబన్‌ నుంచే! పాంబన్‌ దీవిని ప్రధాన భూభాగంతో అనుసంధానించేందుకు నేడు నిర్మించిన అధునాతన రైలు మార్గాన్ని శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. శ్రీలంక పర్యటన ముగించుకుని ప్రధాని ఆదివారం ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో తమిళనాడులోని మండపం చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆయన కొత్త రైలుబ్రిడ్జిని, కొత్త లిఫ్ట్‌ను, రామేశ్వరం-తాంబరం రైలును వర్చువల్‌గా ప్రారంభిస్తారు. అనంతరం రామేశ్వరంలోని రామనాథస్వామివారి ఆలయానికి వెళతారు. శ్రీరామనవమి సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శ్రీలంకకు-భారత్‌కు మధ్య ఉన్న పాక్‌ జలసంధిలో పాంబన్‌ దీవి ఉంటుంది. మన దేశం నుంచి కాస్త విసిరేసినట్లుగా ఉండే ఆ దీవిని దేశ ప్రధాన భూభాగంలోని రైలు నెట్‌వర్క్‌తో అనుసంధానించేదే పాంబన్‌ రైలు వంతెన. సముద్రంపై నిర్మితమైన ‘వర్టికల్‌ లిఫ్ట్‌’ ఉన్న వంతెన ఇది. దేశంలో ఇలాంటి వంతెనను నిర్మించడం ఇదే ప్రథమం. మండపం ప్రాంతం నుంచి పాంబన్‌ దీవికి 2.07 కి.మీ పొడవున నిర్మించిన ఈ వంతెనను ‘రామసేతు’కు వారధిగా అభివర్ణిస్తున్నారు.

jik.gif

బ్రిటిష్‌ కాలంలో తొలి వంతెన

మండపం ప్రాంతం నుంచి పాంబన్‌ దీవికి మీటర్‌గేజ్‌ రైలు వంతెనను బ్రిటిష్‌ కాలంలో 1914లో నిర్మించి ప్రారంభించారు. నాడు ఈవంతెన నిర్మాణానికి రూ. 20 లక్షలు ఖర్చయింది. సముద్రంలో ఓడలు, నౌకలు వెళ్లే సమయంలో ఈ వంతెన మధ్యలో రెండుగా విడిపోయి పైకి లేచేలా (డబుల్‌ లీఫ్‌ బేస్కూల్‌ బ్రిడ్జి) రూపొందించారు. ఇక్కడ వంతెన మధ్య నుంచి ఓడలు వెళ్లేలా మార్గం లేకపోతే అవి మన దేశ చివరి భూభాగమైన ధనుష్కోటి అవతలి నుంచి తిరిగి రావాల్సిన పరిస్థితి. అంటే ఒక్కో ఓడ సుమారు 150 కి.మీ అదనంగా చుట్టి రావాల్సి ఉంటుంది. అందుకే పాంబన్‌ వంతెన మధ్యభాగం కింది నుంచి ఓడలు కూడా వెళ్లేలా నాటి పాలకులు ప్రణాళికలు రూపొందించారు. 1962లో ధనుష్కోటి ప్రాంతంలో సంభవించిన తుఫాను సమయంలో పాంబన్‌-ధనుష్కోటి ప్యాసింజర్‌ రైలుతో సహా ఆ రైలు మార్గం కూడా ధ్వంసమైంది. తర్వాత మరమ్మతులు చేసి.. 2007లో దీనిని బ్రాడ్‌ గేజ్‌గా విస్తరించారు. 2013 జనవరి 13న నావికాదళానికి చెందిన ‘బార్జ్‌’ వంతెనను ఢీకొట్టింది.వంతెనపై ఉన్న స్పాన్లలోని ఒక దానిలో పగుళ్లు కనిపించడంతో 2022 డిసెంబరు నుంచి రైళ్ల రాకపోకలు నిలిపివేశారు.


535కోట్లతో కొత్త బ్రిడ్జి

పాంబన్‌ పాత వంతెన దెబ్బతినడంతో దాని పక్కనే కొత్త వంతెన నిర్మాణానికి 2019 మార్చి 1న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. వంతెన నిర్మాణానికి కోసం మొదట రూ. 250 కోట్లు కేటాయించింది. కానీ వంతెన పూర్తయ్యేనాటికి వ్యయం రూ. 535 కోట్లకు పెరిగింది. ఓడల రాకపోకల కోసం పాత వంతెన రెండుగా విడిపోయేది. అయితే కొత్తగా నిర్మించిన రైల్వే వంతెన మార్గం అలా విడిపోకుండా మధ్యలో భాగం లిఫ్టుల ద్వారా నిలువుగా పైకి లేచేలా (వర్టికల్‌ లిఫ్ట్‌) రూపొందించారు.మోటార్ల సాయంతో రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా లిఫ్ట్‌ను ఎత్తుతారు. 660 టన్నుల బరువైన 72.5 మీటర్ల వంతెన భాగాన్ని ఇప్పుడు కేవలం 5.20నిమిషాల్లో పూర్తిస్థాయిలో పైకి లేపవచ్చు. ఈ వంతెన కింద నుంచి 22 మీటర్లు ఎత్తయిన ఓడలు కూడా వెళ్లగలవు. ఇందులో వర్టికల్‌ బ్రిడ్జి సాంకేతికతను స్పెయిన్‌ నుంచి తీసుకురాగా, మిగిలినవి దేశీయంగా సిద్ధం చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన రైల్వే సీనియర్‌ ఇంజనీర్‌ నడుపూరు చక్రధర్‌ ఈ వంతెన నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించడం విశేషం.


ఒక్క బోల్టు వాడకుండా

వర్టికల్‌ లిఫ్ట్‌కు ఒక్క బోల్టు కూడా వాడకుండా వెల్డింగ్‌తోనే సిద్ధం చేశారు.

వంతెనలో 99 దిమ్మెలున్నాయి. ఇవి పటిష్టంగా ఉండేలా, సముద్రం అడుగున గట్టి నేల తగిలే వరకు 25-35 మీటర్ల లోతున పునాదులు వేశారు. వంతెన నిర్మాణానికి మొత్తం 62వేల టన్నుల స్టీల్‌, 3.38 లక్షల బస్తాల సిమెంట్‌, 25వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వాడారు.

వర్టికల్‌ లిఫ్ట్‌ స్పాన్‌ను తీరం నుంచి 600 మీటర్ల దూరంలోని ప్రతిపాదిత చోటుకు తీసుకెళ్లేందుకు 5 నెలలు పట్టింది.

సముద్రపు అలలకు కొత్త వంతెన తుప్పు పట్టకుండా జింక్‌, 200 మైక్రాన్ల ఆప్రోక్సీ సీలెంట్‌, 125 మైక్రాన్ల పాలీ సిలోక్సేన్‌తో కూడిన త్రిబుల్‌ కోటింగ్‌ పూత పూశారు.


ఇవి కూడా చదవండి..

Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్

NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి

PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..

For National News And Telugu News

Updated Date - Apr 06 , 2025 | 02:23 AM