Rahul Gandhi: రిజర్వేషన్లపై 50% పరిమితి ఎత్తేస్తాం
ABN , Publish Date - Apr 08 , 2025 | 05:01 AM
రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేసే ప్లాన్ వెల్లడించారు. పట్నాలో జరిగిన ‘సంవిధాన్ సురక్ష సమ్మేళన్’లో ఆయన వెనుకబడిన వర్గాలకు కులగణన నిర్వహిస్తామని చెప్పారు

పట్నాలో సంవిధాన్ సురక్ష సమ్మేళన్‌లో రాహుల్
పట్నా, ఏప్రిల్ 7: రిజర్వేషన్లపై 50% పరిమితి అనేది బూటకపు పరిమితి అని, దానిని ఎత్తివేస్తామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సోమవారం బిహార్‌లోని పట్నాలో నిర్వహించిన ‘సంవిధాన్ సురక్ష సమ్మేళన్’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల ప్రజలను దేశంలో రెండో తరగతి పౌరులుగా చూస్తున్నారని అన్నారు. వెనుకబడిన వర్గాలకు ప్రయోజనం కలిగించేందుకు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కులగణన నిర్వహిస్తుందని రాహుల్ పేర్కొన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం(కులగణన సర్వే) నిర్వహించిందని తెలిపారు. సంవిధాన్ సురక్ష సమ్మేళన్‌లో పాల్గొనడానికి ముందు రాహుల్ బెగుసరాయి జిల్లాలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘పారిపోకండి, ఉద్యోగాలు ఇవ్వండి(పలాయన్ రోకో, నౌకరీ దో)’ పాదయాత్రలో పాల్గొన్నారు. బిహార్‌లో నిర్వహిస్తున్న వైట్ టీ షర్ట్ ఉద్యమంలో పాల్గొనాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ ఏడాది నవంబరులో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
నేడు, రేపు ఏఐసీసీ సమావేశాలు
జాతీయ రాజకీయాలకు సంబంధించిన కీలక అంశాలు, సవాళ్లపై చర్చించేందుకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) మంగళ, బుధవారాల్లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సమావేశం కానుంది. జిల్లా అధ్యక్షులకు మరిన్ని అధికారాలు ఇవ్వడం, జవాబుదారీతనాన్ని నిర్ధారించడం సహా పార్టీ సంస్థాగత పునరుజ్జీవనానికి సంబంధించిన అనేక కీలక తీర్మానాలను ఈ సమావేశాల్లో చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహాలనూ ఈ సమావేశాలలో ఖరారు చేయనున్నారు. ఈ ఏడాది బిహార్, వచ్చే ఏడాది కేరళ, అసోం, బెంగాల్, తమిళనాడు ఎన్నికలు జరుగునున్నాయి. ఏఐసీసీ సమావేశాల్లో తొలిరోజు సర్దార్ పటేల్ స్మారకం వద్ద సీడబ్ల్యూసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరుకానున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Indigo flight: గాలిలో ఉండగానే మహిళ మృతి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mary Kom: 20 ఏళ్ల బంధానికి ముగింపు.. విడాకులు తీసుకోబోతున్న మేరీ కోమ్
Waqf Act in Supreme Court: వక్ఫ్ చట్టంపై సుప్రీం విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం
For National News And Telugu News