Rajasthan : రూ.10 కోసం.. రిటైర్డ్ ఐఏఎస్‌ను దారుణంగా కొట్టిన కండక్టర్
ABN , Publish Date - Jan 13 , 2025 | 10:19 AM
విచక్షణా జ్ఞానం మరిచిపోయి పది రూపాయల కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని దారుణంగా కొట్టాడు ఓ బస్ కండక్టర్. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈ దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది.
పది రూపాయల కోసం రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) అధికారితో బస్ కండక్టర్ వాగ్వాదానికి దిగాడు. సరైన బస్‌స్టాప్‌లో దిగడం మరిచిపోయిన విశ్రాంత ఐఏఎస్ అదనపు ఛార్జీలు చెల్లించడానికి నిరాకరించాడని బస్ కండక్టర్ విచక్షణా జ్ఞానం మరిచిపోయి దారుణంగా కొట్టాడు. కదులుతున్న బస్సులోనే వృద్ధుడని కూడా చూడకుండా ఇష్టారీతిన చేయి చేసుకున్నాడు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈ దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణీకుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో బస్ కండక్టర్ గొడవపడుతున్నప్పుడు వీడియో తీసి పోస్ట్ చేయడంతో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అసలేం జరిగిందంటే..
పదిరూపాయల కోసం 75 ఏళ్ల రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) అధికారి ఆర్‌ఎల్ మీనాపై తీవ్రంగా దాడి చేశాడు బస్ కండక్టర్. ఈ దిగ్భ్రాంతికర ఘటన శుక్రవారం జైపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆర్‌ఎల్ మీనా ఆగ్రా రోడ్డులోని కనోటా బస్టాప్ వద్ద దిగాల్సి ఉంది. కానీ, కండక్టర్ డ్రైవర్‌కు ఈ విషయం చెప్పలేదు. అందువల్ల అనుకున్న గమ్యస్థానంలో దిగలేకపోయిన ఆర్ ఎల్ మీనా తర్వాతి స్టాప్‌లో దిగాలని భావించారు. తదుపరి బస్టాప్ రాగానే దిగేందుకు ప్రయత్నిస్తుండగా బస్ కండక్టర్ ఆయన్ని అడ్డుకున్నాడు. రూ.10ల అదనపు ఛార్జీ చెల్లించితీరాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని కోరాడు. అయితే, మీ తప్పిదానికి నేను బాధ్యుడిని కాదంటూ అదనపు ఛార్జీ చెల్లించేందుకు ఆర్ ఎల్ మీనా నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.
రూ.10ల అదనపు ఛార్జీ చెల్లించలేదని సీనియర్ సిటిజన్, విశ్రాంత ఐఏఎస్ అని కూడా చూడకుండా కదులుతున్న బస్సులోనే ఆర్ ఎల్ మీనాను వెనక్కి నెట్టేశాడు బస్ కండక్టర్. విచక్షణ కోల్పోయి బస్ కండక్టర్ తనపై దాడి చేయడంతో ఆగ్రహానికి గురయ్యారు ఆర్ ఎల్ మీనా. కండక్టర్‌ను చెంపదెబ్బ కొట్టాడు. దీని తర్వాత మరింత రెచ్చిపోయాడు కండక్టర్. కండక్టర్ మీనాను సీటులోంచి బయటకు లాగి పదే పదే చెప్పుతో కొట్టడం, తన్నడం మొదలుపెట్టాడు. కాలితో తన్నుతూ మీనాను బస్సు వెనుక సీటుపైకి లాక్కెళ్లాడు. తోటి ప్రయాణీకులు కలగజేసుకుని తీవ్రమవుతున్న తగాదాని ఆపారు. ఈ ఘటనను బస్సులోని ఓ ప్రయాణీకుడు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశాడు.
ఈ ఘటన తర్వాత, విశ్రాంత ఐఏఎస్ ఆర్‌ఎల్ మీనా బస్ కండక్టర్ పై కనోటా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీనియర్ సిటిజన్ ప్రయాణీకుడిపై దాడి, అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అనంతరం విచారణలో దాడి చేసిన కండక్టర్ ఘన్‌శ్యామ్ శర్మగా గుర్తించారు. సోషల్ మీడియాలోనూ ఈ వీడియో విపరీతంగా వైరల్ అవడంతో, జైపూర్ సిటీ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (JCTSL) వెంటనే స్పందించింది. సీనియర్ సిటిజన్‌తో దురుసుగా ప్రవర్తించడమే గాక దాడి చేసి గాయపరచడంతో కండక్టర్ ఘన్‌శ్యామ్ శర్మను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.