Saif Ali Khan : తీవ్ర రక్తస్రావం అవుతుంటే.. కారు లేక.. ఆటోలో తీసుకెళ్లిన సైఫ్ కుమారుడు..
ABN , Publish Date - Jan 16 , 2025 | 03:04 PM
సైఫ్ అలీఖాన్ బాలీవుడ్ స్టార్ నటుడే కాదు. రాజకుటుంబానికి చెందిన వాడు. వేలకోట్లకు అధిపతి. కానీ, గురువారం అర్ధరాత్రి దుండగుడి దాడిలో గాయపడిన సైఫ్‌కు ఆస్పత్రికి వెళ్లేందుకు కారు సిద్ధంగా లేదు. దీంతో గాయాలతో రక్తమోడుతున్న తండ్రిని కుమారుడు ఇబ్రహీం ఆటోలో తీసుకెళ్లాడు..

సైఫ్ అలీఖాన్ బాలీవుడ్ స్టార్ నటుడే కాదు. రాజకుటుంబానికి చెందిన వాడు. వేలకోట్లకు అధిపతి. ప్రపంచం నలుమూలలా విలాసవంతమైన ఇళ్లు, లెక్కలేనన్ని లగ్జరీ కార్లు అతడి సొంతం. కానీ, గురువారం అర్ధరాత్రి దుండగుడి దాడిలో గాయపడిన సైఫ్‌కు ఆస్పత్రికి వెళ్లేందుకు ఒక్క కారు కూడా సిద్ధంగా లేదు. దీంతో గాయాలతో రక్తమోడుతున్న తండ్రిని కుమారుడు ఇబ్రహీం ఆటోలో తీసుకెళ్లాడని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంటి నిండా స్టార్లున్నా అత్యవసర సమయంలో ఒక్క కారూ అందుబాటులో లేకపోవడం అందరినీ విస్మయపరుస్తోంది. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు సైఫ్ అలీఖాన్. ఎలాంటి ప్రాణాపాయం లేదని ఇప్పటికే వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
గుర్తుతెలియని తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో సైఫ్‌కు ఆరుచోట్ల గాయలవగా.. వెన్నెముక దగ్గర తీవ్ర గాయాలయ్యాయి. అయితే, తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న సైఫ్‌ను ఆస్పత్రికి తరలించేందుకు సమయానికి కారు సిద్ధం కాలేదంట. బాంద్రా నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న లీలావతి ఆస్పత్రికి చేర్చడం కుటుంబ సభ్యులకి సవాలుగా మారింది. దీంతో, సమయం వృథా చేస్తే ప్రమాదమని గ్రహించిన పెద్ద కుమారుడు ఇబ్రహీం ఆటోలో లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
దాడి తర్వాత గాయపడిన సైఫ్‌ను ఆటోలో తీసుకెళ్లారు అనేందుకు సాక్ష్యంగా ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. అందులో ఆటో పక్కన నిలబడి సైఫ్ భార్య, నటి కరీనా కపూర్ ఇంట్లో సిబ్బందితో మాట్లాడుతున్నట్టుగా కనిపించడంతో అందరూ ఇది నిజమని నమ్ముతున్నారు. 54 ఏళ్ల సైఫ్ ఇంట్లో చొరబడిన దుండగుడి కారణంగా కత్తిపోట్లకు గురై ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆపరేషన్ తర్వాత సైఫ్ ప్రాణాపాయం నుంచి బయట పడినట్లు అతడి టీం ప్రకటించింది. మిగతా కుటుంబసభ్యులూ క్షేమంగా ఉన్నట్లు తెలిపింది.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఇంట్లోనే అనూహ్య దాడి జరగడంతో సినీ, రాజకీయ ప్రముఖులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో సెలబ్రిటీలు నివసించే విలాసవంతమైన ప్రాంతంగా పేరుగాంచిన బాంద్రాలోనే రక్షణ లేకపోతే ఇంకెక్కడ ఉంటుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. గతేడాది ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీని బాంద్రాలోనే కొందరు దారుణంగా కాల్చి చంపారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల ఘటన తర్వాత బుల్లెట్ ప్రూఫ్ హౌస్‌లోనే ఉంటున్నారు. తాజాగా పటౌడీ కుటుంబానికి చెందిన స్టార్ నటుడు సైఫ్‌పై దాడి చేయడంతో.. మహారాష్ట్రలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. సెలబ్రిటీలు, రాజకీయ నేతలపై వరస దాడులు జరగడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.