Supreme Court Collegium: జస్టిస్ యశ్వంత్‌వర్మ తిరిగి అలహాబాద్ హైకోర్టుకు.. సుప్రీం కొలీజియం సిఫారసు
ABN , Publish Date - Mar 24 , 2025 | 05:40 PM
జస్టిస్ యశ్వంత్ వర్మను న్యాయపరమైన విధులకు దూరంగా ఉంచుతూ ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ సోమవారం ఉదయం నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది.

న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Yashwant Varma) నివాసంలో భారీ ఎత్తున నోట్లకట్టలు బయటపడిన వ్యవహారంలో సుప్రీంకోర్టు కొలీజియం (Supreme Court Collegium) సోమవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మను తిరిగి అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court)కు పంపాలని అధికారికంగా సిఫారసు చేసింది. ఈ మేరకు సీజేఐ సంజయ్ ఖన్నా, న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, సూర్య కాంత్, ఓసీ ఓకాతో కూడిన కొలీజియం అధికారిక ప్రకటన జారీ చేసింది. ''మార్చి 20, 24 తేదీల్లో సమావేశమైన కొలీజియం హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టు జ్యురిస్‌డిక్షన్‌ను పంపాలని సిఫారసు చేస్తోంది'' అని ఆ అధికారిక ప్రకటన పేర్కొంది.
Justice Yashwant Varma: సగం కాలిన నోట్లను మేం చూశాం
దీనికి మందు, జస్టిస్ యశ్వంత్ వర్మను న్యాయపరమైన విధులకు దూరంగా ఉంచుతూ ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ సోమవారం ఉదయం నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది.
ఈనెల 14న తుగ్లక్ రోడ్డులోని జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం చెలరేగడంతో పెద్దఎత్తున నోట్ల కట్టలు బయటపడటం సంచలనమైంది. అగ్నిప్రమాదం జరిగి సమయంలో వర్మ, ఆయన భార్య భోపాల్‌లో ఉన్నారు. అగ్నిప్రమాదం సందర్బంగా స్టోర్‌రూమ్‌లో కాలిన నోట్ల కట్టలు కనిపించిన వీడియోను ఢిల్లీ పోలీసు కమిషనర్ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకు సమర్పించారు. ఆయన ఈ వీడియోతో సహా తన నివేదికను సీజేఐ సంజీవ్ ఖన్నాను అందజేశారు. సుప్రీంకోర్టు తన వెబ్‌సైట్‌లో ఈ సమాచారం ఉంచింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు మూడు రాష్ట్రాల న్యాయమూర్తులతో కమిటీని సీజేఐ నియమించారు. కాగా, తనకు కానీ, తన కుటుంబ సభ్యులకు కానీ ఈ నోట్ల కట్టలతో ఎలాంటి సంబంధం లేదని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరిగిన కుట్ర ఇదని జస్టిస్ వర్మ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. తన ఆర్థిక లావాదేవీలన్నీ బ్యాంకులు, యూపీఐ, కార్డులతోనే జరిపానని, తన స్టోర్‌రూమ్‌ను కేవలం చెత్తను ఉంచేందుకే వాడతామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..