Baby Corn Recipe: బుట్టే కా కీస్
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:43 AM
బేబీకార్న్, శనగపిండి, వివిధ మసాలాలతో తయారు చేసిన ఈ వంటకం ఆరోగ్యకరమైన మరియు రుచికరమైనది. చివర్లో నిమ్మకాయ రసం, కొత్తిమీర, చాట్ మసాలా తో పరిపూర్ణంగా సర్వ్ చేయవచ్చు

కావాల్సిన పదార్థాలు
బేబీకార్న్- 8, శనగపిండి- రెండు చెంచాలు, నెయ్యి- మూడు చెంచాలు, ఆవాలు- పావు చెంచా, జీలకర్ర- పావు చెంచా, పచ్చి మిర్చి- రెండు, అల్లం తరుగు- ఒక చెంచా, ఇంగువ- చిటికెడు, పసుపు- పావు చెంచా, ధనియాల పొడి- పావు చెంచా, చిక్కని పాలు- ఒక కప్పు, కారం- అర చెంచా, పంచదార- ఒక చెంచా, ఉప్పు- ముప్పావు చెంచా, నిమ్మరసం- ఒక చెంచా, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు, చాట్ మసాలా- అర చెంచా, కొబ్బరి తురుం- రెండు చెంచాలు
తయారీ విధానం
బేబీకార్న్‌ను మిక్సీలో వేసి కచాపచాగా గ్రైండింగ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి శనగపిండి వేసి దోరగా వేయించి పళ్లెంలోకి తీయాలి. పాన్‌లో రెండు చెంచాల నెయ్యి వేసి కరిగించాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు, ఇంగువ, పసుపు, ఽధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఇవన్నీ వేగాక, మిక్సీ పట్టిన బేబీకార్న్ వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం పొడి పొడిగా మారిన తరవాత వేయించిన శనగపిండి వేసి కలపాలి. తరవాత పాలు పోసి కలపాలి. ఈ మిశ్రమం దగ్గరకు వచ్చిన తరవాత కారం, పంచదార, ఉప్పు, ఒక చెంచా నెయ్యి వేసి కలిపి మూత పెట్టి అయిదు నిమిషాలు ఉంచాలి. తరవాత నిమ్మ కాయ రసం, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ మీద నుంచి దించాలి. దీని మీద చాట్ మసాలా, కొబ్బరి తురుం, కొత్తిమీర తరుగు చల్లి సర్వ్ చేయాలి.
జాగ్రత్తలు
వంటకం పూర్తయ్యే వరకూ స్టవ్‌ను చిన్న మంట మీదనే ఉంచాలి.
శనగపిండికి బదులు గోధుమ పిండిని వాడుకోవచ్చు. పాలకు బదులు నీళ్లు పోసుకోవచ్చు.