Dhanshree Verma Early Life: విడిపోయిన బంధం... బరువైన పాటయింది
ABN , Publish Date - Mar 29 , 2025 | 05:13 AM
ధనశ్రీ వర్మ అనేది డ్యాన్సర్‌గా, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్‌గా గుర్తింపు పొందిన అమ్మాయి. క్రికెటర్ చాహల్‌తో పెళ్లి తరువాత ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించింది.

ట్రెండింగ్
ధనశ్రీ మొదటి నుంచీ స్వతంత్ర భావాలున్న అమ్మాయి. నలుగురిలో ఒకరిలా కాకుండా... తనకంటూ ఒక ప్రత్యేకత కావాలని కోరుకుంది. క్రికెటర్ చాహల్‌తో పరిచయానికి ముందే ఆమెకంటూ ఒక గుర్తింపు ఉంది. అద్భుతమైన డ్యాన్సర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో నిత్యం లక్షలమంది అభినందనలు అందుకొంటోంది. క్రికెటర్ చాహల్‌తో పెళ్లి తరువాత, అతడితో కలిసి ఆమె చేసిన డ్యాన్స్ వీడియోలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ఆమెది సంపన్న కుటుంబం. ధనశ్రీ తండ్రి కపిల్‌వర్మ పారిశ్రామికవేత్త. తల్లి వర్ష గృహిణి. దుబాయ్‌లో పుట్టిన ధనశ్రీ ముంబయిలో పెరిగింది. ఆమె... చిన్న నాటి నుంచి డాక్టర్ కావాలనుకుంది.
అనుకోని మలుపు...
తను కోరుకున్నట్టే ధనశ్రీ మెడిసిన్‌లో సీటు సాధించింది. బీడీఎల్ పూర్తి చేసింది. అయితే మొదటి నుంచి డ్యాన్స్‌తో పాటు నటనపైన ఉన్న మక్కువ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. చదువుకొనే రోజుల్లోనే ధనశ్రీ డ్యాన్స్, లిప్ సింకింగ్ వీడియోలు చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేసేది. ప్రముఖ డ్యాన్సర్లతో కలిసి చేసిన వీడియోలకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. తన పేరుతో పెట్టుకున్న ‘ధనశ్రీవర్మ’ చానల్‌ను తక్కువ సమయంలోనే లక్షలమంది సబ్‌స్ర్కైబ్ చేశారు. 2020లో క్రికెటర్ చాహల్‌తో పెళ్లి తరువాత ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది క్రికెట్ అభిమానులకు దగ్గరైంది.
హిట్ జంట...
పెళ్లి తరువాత చాహల్‌తో కలిసి అడుగులు కదిపింది ధనశ్రీ. ఇరువురూ కలిసి సూపర్‌హిట్ పాటలకు డ్యాన్సులు చేసి, వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ జంట నాట్యానికి కోట్ల మంది ఫిదా అయ్యారు. ఇంటర్‌నెట్‌లో చాహల్, ధనశ్రీలది హిట్ పెయిర్. దేశం దాటి విదేశాల్లో కూడా అభిమానులను సంపాదించుకున్నారు. కొరియోగ్రఫీలో కూడా మంచి పట్టున్న ధనశ్రీ... తనలా మరింతమంది డ్యాన్సర్లను తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఒక నాట్యాలయాన్ని ప్రారంభించింది. ‘ఝలర్ ధిక్ లాజా’ తదితర డ్యాన్స్ రియాలిటీ షోస్‌లో పాల్గొని మురిపించింది. ఇప్పుడామె వార్షిక ఆదాయం 25 కోట్ల రూపాయల పైనే.
మూన్నాళ్ల ముచ్చట...
ధనశ్రీ, చాహల్... ఇద్దరి వృత్తిగత, వ్యక్తిగత జీవితాలు అద్భుతంగా సాగుతున్నాయని అనుకొంటున్న తరుణంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎప్పటి నుంచో వస్తున్న ఊహాగానాలకు బలం చేకూరుస్తూ... విడిపోతున్నట్టు ఇద్దరూ ప్రకటించారు. సామాజిక మాధ్యమాల్లో, క్రికెట్ మైదానంలో ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట... మూడు ముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చట అయింది. పెళ్లయిన రెండేళ్లకే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని, అవి తారస్థాయికి వెళ్లడంతో... ఇక కలిసి ఉండలేమనే నిర్ణయానికి వచ్చారనేది సన్నిహితుల మాట. 2022 జూన్ నుంచి ఇద్దరూ వేరు కాపురాలు పెట్టారు. పరస్పర అంగీకారంతో ఈ నెల 20న ముంబయి ఫ్యామిలీ కోర్టు ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది. భరణం కింద ధనశ్రీకి రూ.4.75 కోట్లు చెల్లించేందుకు చాహల్ అంగీకరించినట్టు సమాచారం.
ఆమెను అగౌరవపరిచేలా...
విడాకులన్నది చాహల్, ధనశ్రీల వ్యక్తిగత నిర్ణయం. కానీ కోర్డు నుంచి విడాకులు పొందాక సామాజిక మాధ్యమాల్లో ధనశ్రీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు. కొందరైతే... ‘మీ అకౌంట్‌లో ఎంత క్రెడిట్ అయింది’ అంటూ ప్రశ్నించారు. ‘అతడి డబ్బుతో మీరు ఎలా జీవిస్తారు? మీకు ఆత్మాభిమానం లేదా’ అని మరొకరు... ఇలా లెక్కకు మించి ఆమె వ్యక్తిత్వంపై దాడి చేశారు. కానీ ధనశ్రీ వేటికీ స్పందించలేదు. ఎప్పటిలా కెరీర్‌పై దృష్టి పెట్టి, తన పని తాను చేసుకుపోతోంది.
‘గృహహింస’ పాట...
ఇదిలావుంటే... విడాకులు తీసుకున్న రోజే ధనశ్రీ ప్రత్యేక పాటను విడుదల చేశారు. ‘దేఖా జీ దేఖా మైనే’ అంటూ సాగే ఈ వీడియో సాంగ్‌లో ఆమె గృహహింస బాధితురాలిగా, భర్త చేతిలో మోసపోయిన భార్యగా నటించారు. ‘టీ సిరీస్’ దీన్ని విడుదల చేసింది. జ్యోతి నూరన్ ఈ గీతాన్ని ఆలపించారు. ఈ వీడియోలో బాలీవుడ్ నటుడు ఇష్వాక్ సింగ్, ధనశ్రీ భార్యాభర్తలుగా కనిపించారు. తనను ఎంతో ఇష్టపడే భార్యను భర్త మోసం చేస్తాడు. వేరే అమ్మాయితో కలిసి తిరుగుతుంటాడు. ప్రశ్నించిన భార్యను అతడు శారీరకంగా హింసిస్తాడు. చివరకు ఆమె వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పడంతో పాట ముగుస్తుంది. బంధాలు, భావోద్వేగాలు, మనస్పర్ధలు, ప్రేమలోని సంక్లిష్టతల మధ్య నలిగిపోతున్న ఓ మహిళగా ధనశ్రీ నటించింది. కోర్టు విడాకులు మంజూరు చేసిన రోజే ఈ పాట విడుదల కావడంతో దీనిపై విపరీతంగా చర్చ నడుస్తోంది. యూట్యూబ్‌లో ఇప్పటికి దాదాపు అరవై లక్షల మంది ఈ పాటను వీక్షించారు. విడాకులకు కారణాలు అటు చాహల్ కానీ, ఇటు ధనశ్రీ కానీ బహిరంగంగా చెప్పలేదు. ఇదే విషయాన్ని వీడియో సాంగ్ విడుదల సందర్భంగా ధనశ్రీని అడిగితే... ‘ముందు మీరు పాట వినండి’ అంటూ బదులిచ్చారు. కానీ విడాకులపై నోరు విప్పలేదు.