Family Legacy : సహజ పోషకాల కోసం... ఓ అమ్మ ప్రయత్నం
ABN , Publish Date - Mar 01 , 2025 | 06:23 AM
మా కుటుంబానికి వ్యాపారం కొత్తేమీ కాదు. మా తాత స్టీల్ గిన్నెలు, స్టౌవ్‌లు తయారీలో ఒకప్పుడు దేశంలోనే పేరు మోసిన వ్యాపారి.

సంకల్పం
వ్యాపారంలో లాభం కంటే వినియోగదారుల ఆరోగ్యమే ముఖ్యం అనుకున్నారు. దాని కోసం తనయుడితో కలిసి అంకుర సంస్థకు శ్రీకారం చుట్టారు. పోషక విలువలు గల స్వచ్ఛమైన వెగాన్ స్మూతీని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. అదికూడా... ఎలాంటి ప్రిజర్వేటివ్స్, కృత్రిమ తీపి పదార్థాలు లేకుండా..! ప్రయోగాత్మకంగా మొదలుపెట్టి... నేడు మరికొందరికి ఉపాధి మార్గంగా మార్చిన ‘టాన్స్’ కంపెనీ వ్యవస్థాపకురాలు తేజశ్రీ షా ప్రయాణం ఇది...
‘‘మా కుటుంబానికి వ్యాపారం కొత్తేమీ కాదు. మా తాత స్టీల్ గిన్నెలు, స్టౌవ్‌లు తయారీలో ఒకప్పుడు దేశంలోనే పేరు మోసిన వ్యాపారి. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ మా నాన్న స్టీల్ ఫ్యాక్టరీలు నడిపించారు. మామిడి తోటలు చూసుకొనేవారు. దేనికీ లోటు ఉండేది కాదు. కానీ విధి మా రాతను మార్చేసింది. కుటుంబ కలహాలతో మా నాన్న కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... తను పోయేలోపే నాకు స్థిరమైన జీవితం ఇవ్వాలనుకున్నారు. దాంతో చిన్న వయసులోనే నాకు పెళ్లి చేశారు. తరువాత కొద్ది కాలానికే నాన్న మరణించారు. మాకంటూ ఏ ఆధారం లేకుండాపోయింది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ మాది. మా నాన్న పోయిన సమయంలోనే గట్టిగా నిర్ణయించుకున్నాను... బాగా చదువుకోవాలని. నా కాళ్లపై నేను నిలబడాలంటే అదొక్కటే మార్గమని అర్థమైంది. నాకు మొదటి నుంచీ ఇంగ్లీష్ బాగా వచ్చు. అందుకే బీఏ- ఇంగ్లీష్ చేశాను. డిగ్రీ అవ్వగానే రాజస్థాన్ సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీలో ఎంబీయే చదివాను. అప్పటి నుంచి ఎంబీయే విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చేదాన్ని. కొద్ది రోజుల్లోనే నా సాయం కోరే విద్యార్థులు రెట్టింపు అయ్యారు. దీనికి ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో ‘విన్నింగ్ ఎడ్జ్’ పేరిట ఒక సంస్థ ప్రారంభించాను. అందులో ఇంగ్లీష్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌లో తర్ఫీదు ఇచ్చాను. విద్యార్థులను కేంబ్రిడ్జ్ ఈఎ్‌సఓఎల్ పరీక్షలకు సన్నద్ధం చేశాను. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మార్గదర్శనం చేశాను. ప్రభుత్వం తరుఫున కూడా నైపుణ్య శిక్షణ శిబిరాలు నిర్వహించాను.
ఊహించని మలుపు...
ఒకవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు నా శిక్షణ కార్యక్రమాలు కొనసాగించాను. అలా వచ్చిన డబ్బుతో మహారాష్ట్ర రత్నగిరిలో కొంత భూమి కొన్నాను. అందులో ఆల్ఫాన్సో మామిడి పండ్లు పండించాలన్నది నా ఉద్దేశం. అయితే నా జీవితం అనుకోని మలుపు తీసుకుంది. అప్పట్లో ‘ఐక్రియేట్’ (ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ టెక్నాలజీ) సదస్సుకు హాజరయ్యాను. స్టార్టప్ అంటే ఏమిటో అప్పుడే నాకు తెలిసింది. అప్పటికే నేను శిక్షణ ఇస్తుండడంతో... ఐక్రియేట్ వారు తమతో కలిసి పని చేయమని అడిగారు. కొంతకాలానికి అక్కడ ఫుల్‌టైమ్ ట్రైనర్‌ను అయ్యాను. ఎంతోమంది ఉద్యోగార్థులను ఉద్యోగాలు కల్పించేవారిగా తీర్చిదిద్దగలిగాను. అది నాకు ఎంతో సంతృప్తినిచ్చింది.
కొవిడ్‌తో కొత్త దారి...
ఇదిలావుంటే కొవిడ్ మహమ్మారి నన్ను మరోమారు అప్రమత్తం చేసింది. నాకు హృదయ సంబంధిత సమస్యలున్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది. ఎక్కువ శ్రమించకూడదు. అతిగా ఆలోచించకూడదు. మానసిక ఒత్తిడికి లోనుకాకూడదు. నా గురించి నేను శ్రద్ధ తీసుకోకపోతే ప్రమాదమని వైద్యులు చెప్పారు. అదే సమయంలో మా అబ్బాయి శాశ్వత్ బయోటెక్నాలజీ డిగ్రీ కూడా పూర్తయింది. వాడు పోషకాలున్న ఆహారం అందించే వ్యాపారం ప్రారంభించాలని పట్టుదలగా ఉన్నాడు. తను ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఫిట్‌నెస్, ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధ తీసుకొంటాడు. వాడి ఆలోచనలకు తగినట్టే ఫుడ్ బిజినెస్ మొదలుపెడదామని అనుకున్నాం.
ఎంతో పరిశోధించి...
దాని కోసం ఎంతో పరిశోధించాం. భారతీయుల ఆహారపు అలవాట్ల గురించి పరిశోధిస్తున్నప్పుడు మాకు తెలిసిందేంటంటే... మనం ఉడకబెట్టిన ఆహారం ఎక్కువగా తీసుకొంటామని. రోజులో ఒకటో అరో మాత్రమే పండ్లు తింటామని. కానీ పోషకాలు పూర్తి స్థాయిలో శరీరానికి అందాలంటే ఆ మోతాదు సరిపోదు. ఈ క్రమంలోనే ఐదు రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో ఒక స్మూతీ తయారు చేశాం. తద్వారా ఎలాంటి ప్రిజర్వేటివ్స్, కృత్రిమ తీపి పదార్థాలు లేని స్వచ్ఛమైన ఆహారం వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. మా స్టార్ట్‌పకు ‘టాన్స్’ అనే పేరు నిర్థారించాం. గ్రాంట్ కోసం ఓ యూనివర్సిటీని సంప్రతిస్తే వారు కుదరదన్నారు. దాంతో మేమే నిధులు సమకూర్చుకుని సంస్థను నెలకొల్పాం. ప్రస్తుతం ఆరు రకాల వెగాన్ స్మూతీలు విక్రయిస్తున్నాం. అమెజాన్‌తో పాటు మా వెబ్‌సైట్‌లో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. రెండేళ్ల కిందట ప్రారంభంచిన మా కంపెనీ ఇప్పుడు లాభాల బాటలో పయనిస్తోంది. అన్నిటికంటే సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చేదేంటంటే... మా సంస్థ ద్వారా మరికొందరికి, ముఖ్యంగా మహిళలకు ఉపాధి కల్పించగలగడం. రాబోయే రోజుల్లో మరిన్ని తాజా ఉత్పత్తులతో సంస్థను మరింత విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నాం.’’