Changing Lives Through Skill Development: శిక్షణ ఇస్తే వాళ్లూ మెరికలే
ABN , Publish Date - Mar 26 , 2025 | 02:23 AM
ఆదివాసీ పిల్లల జీవితాలు మార్చడానికి లక్ష్మీపద్మజ గారు ‘బొల్లినేని మెడ్‌స్కిల్స్’ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా వారిని నైపుణ్య శిక్షణ ఇస్తూ, మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఉచిత శిక్షణతో సామాజిక మార్పు కల్పిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విస్తరించింది.

సంకల్పం
ఆదివాసీ పిల్లల దుర్భర పరిస్థితులను చూసి ఆమె చలించిపోయారు. సరైన దిశానిర్దేశం ఉంటే వారూ మెరికల్లా తయారవుతారని భావించారు. అందుకు ఒక సంస్థను నెలకొల్పి... దాని ద్వారా వేలమంది అణగారిన వర్గాలవారికి ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ‘బొల్లినేని మెడ్‌స్కిల్స్’ వ్యవస్థాపకుల్లో ఒకరు, సంస్థ అకడమిక్ డైరెక్టర్... లక్ష్మీపద్మజతో ‘నవ్య’ మాటామంతి.
‘‘సరిగ్గా పదేళ్ల కిందట... అప్పుడు మేం హైదరాబాద్‌లో ఉండేవాళ్లం. మా అమ్మాయి ఇంటర్ పూర్తయింది. ఎంసెట్ రాస్తే శ్రీకాకుళం మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. మాకు ఒక్కతే అమ్మాయి. తనను ఒంటరిగా పంపడం ఇష్టంలేక మేం కూడా శ్రీకాకుళం వచ్చాం. ఇక్కడకు వచ్చాక ఆదివాసీలు, అణగారిన వర్గాలవారి జీవన స్థితిగతులు ప్రత్యక్షంగా చూశాం. ముఖ్యంగా బంగరు భవిష్యత్తు ఉన్న విద్యార్థుల జీవితాలు ఆరంభంలోనే మసిబారిపోతున్నాయి.
ఇది నన్ను కలచివేసింది. దీనికి కారణాలు అన్వేషిస్తున్న క్రమంలో ప్రధానంగా నేను గమనించింది ఏంటంటే... వాళ్లల్లో నైపుణ్యానికి కొదవలేదు. కానీ కెరీర్‌కు సంబంధించి సరైన మార్గనిర్దేశం లేక వెనకబడిపోతున్నారు. ఎవరో ఏదో కోర్సు చేస్తున్నారంటే ఆ ప్రాంతంలో మిగిలినవారు కూడా మరో ఆలోచన లేకుండా అటే పరుగెత్తేవారు. అలా కాకుండా వారిలోని నైపుణ్యాన్ని బయటకు తీసి, సరైన దారిలో నడిపించగలితే మంచి ఫలితాలు వస్తాయనిపించింది. దీని కోసం ఒక సంస్థను నెలకొల్పాలని నేను, మావారు నాగేశ్వరరావు అనుకున్నాం. మా ఆలోచనను ‘కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్’ ఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కర్‌రావు గారితో పంచుకున్నాం. ఆయన మార్గదర్శకత్వంలో ‘బొల్లినేని మెడ్‌స్కిల్స్’ను 2016లో నెలకొల్పాం. హెల్త్‌కేర్ కోర్సులు అందించే ఉద్దేశంతో ఏర్పాటైన సంస్థ ఇది. దీని ద్వారా ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల పిల్లలకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం. బతుకు బండి నడవడానికి ఉద్యోగం చేసుకొంటూనే చదువుకొనేలా ఇక్కడ కోర్సులు డిజైన్ చేశాం.
ఉద్యోగాలు వదిలేసి...
మా స్వస్థలం కృష్ణాజిల్లా చినఓగిరాల. అయితే నా చిన్నప్పుడే మా కుటుంబం బళ్లారి జిల్లా కంప్లీకి వెళ్లిపోయింది. అమ్మ ధనలక్ష్మి, నాన్న వీరచందర్‌రావు... ఇద్దరూ వ్యవసాయం చేసేవారు. నాకు ఇద్దరు అన్నలు. నా పాఠశాల విద్యాభ్యాసం అంతా సండూరు రెసిడెన్షియల్ హాస్టల్‌లోనే సాగింది. ధార్వాడ్‌లో బీఎస్సీ బీజెడ్‌సీ చదివాను. గోల్డ్ మెడల్ సాధించాను. మా గ్రామంలో మొట్టమొదటి గ్రాడ్యుయేట్‌ను నేనే. సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో, కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్లాను. మా అమ్మ ధనలక్ష్మి మద్దతు లేకపోతే అది సాధ్యమయ్యేది కాదు.
ఐఎఫ్‌స్ మెయిన్స్ వరకు వెళ్లాను. కానీ ఇంటర్వ్యూలో పోయింది. కోచింగ్ తీసుకొంటూనే ఢిల్లీ వర్సిటీలో ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్ కోర్సు చదివాను. పీజీ అయ్యాక నాకు పెళ్లి చేశారు. నేను, మావారు మంచి ఉద్యోగాల్లో ఉన్నాం. కానీ ఎందుకో అందులో మాకు సంతృప్తిగా అనిపించలేదు. నేర్చుకున్నది తిరిగి ఈ సమాజానికి ఇవ్వాలనే తపన నాది. ఆయన ఆలోచనలు కూడా కలవడంతో ‘మెడ్‌స్కిల్స్’ సంస్థ పురుడు పోసుకుంది. ప్రస్తుతం దానికి నేను అకడమిక్ డైరెక్టర్‌గా ఉన్నాను. మార్కెటింగ్ లాంటివి మావారు చూస్తారు.
వర్సిటీలకు అనుబంధంగా...
మా సంస్థ ద్వారా దాదాపు 52 హెల్త్‌కేర్ కోర్సులకు శిక్షణ ఇస్తున్నాం. తదనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. నాలుగు నెలల నుంచి నాలుగున్నర ఏళ్ల వరకు పారామెడికల్ డిప్లమో, పీజీ కోర్సులు, హెల్త్‌కేర్ రంగానికి సంబంధించిన నైపుణ్య శిక్షణ తరగతులు ఇందులో ఉన్నాయి. ఎన్‌టీఆర్, కాళోజీ నారాయణ, ఆంధ్రా, అంబేడ్కర్ తదితర విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా కోర్సులు అందిస్తున్నాం. అలాగే టాటా, టెక్ మహీంద్రా, జీఈ హెల్త్‌కేర్, ఏపీ పారామెడికల్ కౌన్సిల్‌తో కూడా కలిసి పని చేస్తున్నాం. శ్రీకాకుళంలో ప్రారంభమైన ‘మెడ్‌స్కిల్స్’ ఇప్పుడు దేశ వ్యాప్తంగా పదకొండు ప్రాంతాల్లో విస్తరించింది.
విదేశాల్లో స్థిరపడ్డారు...
ఇప్పటివరకు పన్నెండు వేల మందికి పైగా శిక్షణ తీసుకున్నారు. వారిలో తొంభై శాతం మంది హెల్త్‌కేర్ రంగంలో స్థిరపడ్డారు. నాలుగు వేల మంది ఆదివాసీ యువతకు శిక్షణ ఇచ్చాం. సంపాదిస్తూ చదువుకోవాలనేది మా కోర్సుల ప్రధాన ఉద్దేశం. ఆర్థికంగా వెనకబడినవారికి నైపుణ్య శిక్షణ ఉచితంగానే అందిస్తున్నాం. ఇటీవలే మా విద్యార్థులు ఇద్దరు లండన్ వెళ్లారు. నెలకు మూడు లక్షల జీతం పొందుతున్నారు. ఇంకొక అమ్మాయి సింగపూర్‌లో పని చేస్తోంది.
ఇలా చాలామంది ఉన్నారు. కొబ్బరికాయలు కొట్టే ఒక వ్యక్తి వచ్చి... ‘మా అమ్మాయి మంచి ఉద్యోగంలో స్థిరపడిందండి’ అని చెబుతుంటే నా గుండె ఆనందంతో ఉప్పొంగుతుంది. ఇదే మేం కోరుకున్న మార్పు. ఇంతకుమించిన సంతృప్తి, సంతోషం ఏముంటుంది!
మహిళా సాధికారతకు...
ప్రస్తుతం అన్ని కేంద్రాలలో కలిపి రెండు వేల మందికి పైగా విద్యార్థులున్నారు. వాళ్లల్లో మహిళలు 73 శాతం, గిరిజనులు యాభై శాతానికి పైగా ఉంటారు. మహిళలను సాధికారత దిశగా అడుగులు వేయించేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. అలాగే అనీమియా, పీసీఓడీ, నెలసరి సమయంలో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం. పెళ్లయిన మహిళలకు వారి సౌకర్యాన్నిబట్టి శిక్షణ ఇచ్చి, ఇంటి వద్ద నుంచే పని చేసే వెసులుబాటు కల్పిస్తున్నాం. పదేళ్ల కిందట ఇక్కడ మా కార్యకలాపాలు ప్రారంభించేనాటికి... గిరిజనుల అమ్మాయిలు ఉద్యోగాల కోసం వేరే ఊళ్లకు వెళ్లేందుకు వెనుకాడేవారు. కానీ ఇప్పుడు నిస్సంకోచంగా వెళ్లగలుగుతున్నారు. మేం గమనించిన అతి పెద్ద మార్పు ఇది.’’
ఉన్నతంగా తీర్చిదిద్దాలి...
ఎంత పని ఒత్తిడి ఉన్నా... నేను కూడా పాఠాలు చెబుతుంటాను. ఇక్కడకు రాకముందు ‘ఫిట్జీ’లో బోధించేదాన్ని. అలాగే కౌన్సెలింగ్, కెరీర్ గైడెన్స్ ఇస్తాను. వేరే కళాశాలలకు కూడా వెళుతుంటాను. ఇక మా అమ్మాయి ‘యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా’లో పీజీ చేస్తోంది. సైన్స్‌కు సంబంధించి మూడు పుస్తకాలు కూడా రాశాను. బయాలజీ, కెమిస్ర్టీ టెస్ట్ పేపర్స్ చేశాను. పలు పబ్లిషింగ్ హౌస్‌ల కోసం కంటెంట్ ఇచ్చాను. ఎన్సీఈఆర్టీ తదితర పరీక్షలకు ప్రశ్నపత్రాలు తయారు చేశాను. కొన్ని సంస్థలు గౌరవ సత్కారాలు, పురస్కారాలూ ఇచ్చాయి. ఈ సంస్థను మరింత విస్తరించి, మరింతమంది పేదలు, మహిళలకు ఉన్నతమైన కెరీర్ అందించాలనేది నా లక్ష్యం.