Medicinal Herb: అల్లం... అద్భుత ఔషధం
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:08 AM
అల్లానికి ఆయిర్వేదంలో ఒక ప్రత్యేక స్థానముంది. దుంపలలో ఎక్కువ రసం ఉన్నది అల్లమే కాబట్టి దీనిని సంస్కృతంలో అర్థ్రకం అని పిలుస్తారు. దీని నుంచే హిందీలో అదరక్ అనే పదం పుట్టింది.

అల్లం... అద్భుత ఔషధం
అల్లానికి ఆయిర్వేదంలో ఒక ప్రత్యేక స్థానముంది. దుంపలలో ఎక్కువ రసం ఉన్నది అల్లమే కాబట్టి దీనిని సంస్కృతంలో అర్థ్రకం అని పిలుస్తారు. దీని నుంచే హిందీలో అదరక్ అనే పదం పుట్టింది. అల్లం మొక్కను చూస్తే అనేక కొమ్మలు కనిపిస్తాయి. దాని నుంచి వచ్చిన దుంప కాబట్టి అల్లాన్ని శృంగవేర అని పిలుస్తారు. ఇదే విధంగా గ్రీకు భాషలో జింజి అంటే కొమ్ము అని అర్థం. దీని దుంపలు కొమ్ముల ఆకారంలో ఉంటాయి కాబట్టి.. దీనికి జింజిబేర అని పేరు వచ్చింది. ఆ పదం నుంచి జింజర్ అనే పదం పుట్టింది. అల్లాన్ని భారతీయులు మాత్రమే కాకుండా చైనీయులు, కొరియన్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. చైనీయులు అల్లాన్ని తురిమి దానిలో కరివేపాకు కలిపి బూందీలా వేయిస్తారు. దీనిని చావో అంటారు. ఇక కొరియన్లు బార్లీ పిండిని పులియబెట్టి దానిలో అల్లం వేసి తింటారు.
లాభాలెన్నో!
అల్లంలో ఫాస్పరస్.. క్యాల్షియంతో పాటుగా ప్రొటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇందులో జింజిరోన్, షోయగోల్ అనే రసాయనాల వలన జ్వరాన్ని.. నొప్పులను తగ్గించే శక్తి ఉంటుంది. అల్లంలో ఉన్న పీచు పేగులను దృఢపరుస్తుంది. ఇది పేగులను వేగంగా కదిలించి, విరేచనం అయ్యేలా చేస్తుంది. అల్లం.. బెల్లం కలిపి నూరి, చిన్నచిన్న బిళ్లలు కట్టి ఆరనిచ్చి సీసాలో పోసుకొని, ఒక్కక్క బిళ్ళ చొప్పున రెండు లేక మూడుసార్లు చప్పరిస్తే అరచేతిలో చెమటపట్టటం, పొట్టు రాలటు తగ్గుతాయి. సొరియాసిస్ వ్యాధిలో ఇది మంచి ఉపాయం! దగ్గు, జలుబు, ఉబ్బసం, ఇతర ఎలర్జీ వ్యాధుల్లో అల్లం మంచిది. కీళ్లవాతం, సయాటికా, నడుంనొప్పి, మెడనొప్పి, ఇలా అనేక దీర్ణవ్యాధులతో బాధపడేవారు- ఆహార పదార్థాల్లో కారానికి బదులుగా అల్లం వాడుకొంటే మంచిది. నిమ్మరసంలో అల్లం ముక్కల్ని నానబెట్టిన అల్లం మురబ్బా జీర్ణ శక్తిని పెంచుతుంది.
రకరకాలుగా...
అల్లం లేతగా.. తాజాగా ఉన్నప్పుడే రుచికరంగా ఉంటుంది. ఎండిన అల్లాన్ని శొంఠి అంటారు. అల్లమూ, శొంఠీ రెండూ వాతాన్ని, కఫాన్నీ తగ్గించే ప్రసిద్ధ ద్రవ్యాలు. శొంఠి కన్నా అల్లం వేడి చేసే స్వభావం ఉన్న ద్రవ్యం. మిరపకారంతో పోలిస్తే వేడి చేసే విషయంలో అల్లమే నయం. అయితే అల్లాన్ని పరిమితంగా.. ఒక ఔషధంగా వాడుకోవాలి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం అల్లంకూడా బలాన్నిచ్చే టానిక్ లాంటిది. ఇది వ్యాధినిరోధక శక్తినిస్తుంది. రక్తదోషాల్ని పోగొడుతుంది. ఇది జఠరాగ్నిని పెంచుతుంది. అల్లాన్ని దంచి, ఒక వస్త్రంలో వేసి, గిన్నెలో గట్టిగా పిండితే రసం వస్తుంది. కొద్ది సేపటికి నీరు తేరుకుని అడుగున తెట్టు మిగుల్తుంది. తేరిన రసాన్ని మాత్రమే తీసుకొని అడుగున మిగిలింది వదిలేయాలి. ఇదే అల్లం రసం. ఈ రసంలో బెల్లం కలిపి తాగితే వెంటనే జీర్ణశక్తి పెరుగుతుంది. ఇందులో తగినన్ని పాలు పోసి ఉడికించి తేనె కలిపి, టీలాగా తాగే అలవాటు చాలా దేశాల వారికి ఉంది.
-గంగరాజు అరుణాదేవి
ఇవి కూడా చదవండి:
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Viral News: కారు డ్రైవర్‌తో లొల్లి..రోడ్డు మధ్యలో నిలబడి ట్రాఫిక్ అడ్డుకున్న బైకర్
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Read More Business News and Latest Telugu News