Share News

Viral News: తాగుబోతు భర్తను తలెత్తుకోలేకుండా చేసిన భార్య.. మామూలు షాక్ ఇవ్వలేదుగా..

ABN , Publish Date - Feb 13 , 2025 | 04:30 PM

బిహార్ రాష్ట్రం జముయి జిల్లాకు చెందిన నకుల్ శర్మతో ఇంద్రకుమారి అనే మహిళకు 2022లో వివాహం జరిగింది. అయితే పెళ్లైన మరుసటి రోజు నుంచే అతని నిజస్వరూపం ఆ యువతికి తెలిసింది. తన భర్త పచ్చి తాగుబోతని, మద్యానికి బానిసయ్యాడని గ్రహించింది.

Viral News: తాగుబోతు భర్తను తలెత్తుకోలేకుండా చేసిన భార్య.. మామూలు షాక్ ఇవ్వలేదుగా..

పట్నా: తాగుబోతు భర్తతో విసిగిపోయిన ఓ మహిళ తీసుకున్న నిర్ణయం నెట్టింట వైరల్‌గా మారింది. ప్రతి రోజూ కొడుతూ, తిడుతూ ఇబ్బందులు పెట్టే భర్తతో ఉండేందుకు ఇంద్రకుమారి అనే వివాహిత నిరాకరించింది. అనంతరం ఆమె తీసుకున్న నిర్ణయం ఇరువర్గాల కుటుంబసభ్యులతోపాటు బిహార్ వాసులను సైతం షాక్‌కు గురి చేసింది. తాగుబోతుతో ఉండేందుకు ఇష్టపడని ఆ మహిళ మరో పెళ్లికి సిద్ధమైంది. ఈ వివాహానికి పిలిచిన వారు, పిలవని వారు సైతం హాజరయ్యారు. వారి పెళ్లి వేడుకను ఎగబడి మరీ చూశారు. కాగా, సదరు మహిళ చేసిన పని ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.


బిహార్ రాష్ట్రం జముయి జిల్లాకు చెందిన నకుల్ శర్మతో ఇంద్రకుమారి అనే మహిళకు 2022లో వివాహం జరిగింది. అయితే పెళ్లైన మరుసటి రోజు నుంచే అతని నిజస్వరూపం ఆ యువతికి తెలిసింది. తన భర్త పచ్చి తాగుబోతని, మద్యానికి బానిసయ్యాడని గ్రహించింది. నిత్యం మద్యం మత్తులో మునిగే నకుల్ శర్మ.. భార్యపై నిత్యం వేధింపులకు పాల్పడేవాడు. తాగి వచ్చి ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. కొడుతూ, తిడుతూ చిత్రహింసలకు గురి చేసేవాడు. అయితే అతని బాధలు భరించలేని ఇంద్రకుమారి అతని నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. మరోవైపు నకుల్ శర్మ ఓ బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నాడు. దాన్ని వసూలు చేసేందుకు రికవరీ ఏజెంట్ పవన్ కుమార్ యాదవ్‌ అతని ఇంటికి రావడం మెుదలుపెట్టాడు. ఈ క్రమంలో ఇంద్రకుమారి, పవన్ మధ్య పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. తన భర్త పచ్చి తాగుబోతని, నిత్యం వేధిస్తున్నాడని పవన్‌కు ఆమె చెప్పింది. అతనితో కలిసి ఉండేది లేదని తేల్చి చెప్పింది. దీంతో పవన్, ఇంద్రకుమారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.


ఫిబ్రవరి 4న, వారిద్దరూ ఎవ్వరికీ చెప్పకుండా విమానంలో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం అసన్సోల్‌కు చేరుకున్నారు. అక్కడ ఇంద్ర కుమారి అత్త ఉండడంతో విషయం చెప్పి కొన్ని రోజులు అక్కడే ఉన్నారు. అనంతరం మళ్లీ జముయి జిల్లాకు తిరిగి వచ్చారు. ఫిబ్రవరి 11న ఓ ఆలయంలో వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఇరుకుటుంబాల పెద్దలకు చెప్పగా పవన్ కుటుంబసభ్యులు అంగీకరించారు. కానీ, ఇంద్రకుమారి తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకోలేదు. అయినప్పటికీ వారిద్దరూ వివాహం చేసుకునేందుకే నిర్ణయించుకున్నారు. ఈ విషయం కాస్త చుట్టుపక్కల గ్రామాలకు పాకడంతో సంచలనంగా మారింది. దీంతో ఫిబ్రవరి 11న వారి పెళ్లి చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఘటనపై ఇంద్రకుమారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై వారు కేసు నమోదు చేయగా.. తన ఇష్ట ప్రకారమే పెళ్లి జరిగినట్లు సదరు యువతి పోలీసులకు తెలిపింది. కాగా, వీరి వివాహానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

Updated Date - Feb 13 , 2025 | 04:30 PM