Share News

Mosquitoes: వీర్యంతో దోమలకు చెక్.. ఇది సక్సెస్ అయితే మామూలుగా ఉండదు..

ABN , Publish Date - Jan 08 , 2025 | 04:58 PM

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దోమకాటుకు గురై లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు విజృంభించి ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి. ప్రతి రోజూ రాత్రి ఇళ్లల్లో గుడ్ నైట్, ఆల్‌ఔట్ వంటివి దోమల నివారణ మందులు పెట్టనిదే నిద్రపోరంటే అతిశయోక్తి కాదు.

Mosquitoes: వీర్యంతో దోమలకు చెక్.. ఇది సక్సెస్ అయితే మామూలుగా ఉండదు..
Mosquitoes

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దోమకాటుకు గురై లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు విజృంభించి ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి. ప్రతి రోజూ రాత్రి ఇళ్లల్లో గుడ్ నైట్, ఆల్‌ఔట్ వంటివి దోమల నివారణ మందులు పెట్టనిదే నిద్రపోరంటే అతిశయోక్తి కాదు. అయితే దోమల బెడద నిర్మూలించేందుకు ఆస్ట్రేలియా సైంటిస్టులు కొత్త ప్రయోగంతో ముందుకు వచ్చారు. ఇది సక్సెస్ అయితే దోమకాటు మరణాలు ఉండవంటూ శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెబుతున్నారు.


సంభోగం తర్వాత వీర్యంతో ఆడ దోమలను చంపే పద్ధతిని ఆస్ట్రేలియాకు చెందిన మాక్వేరీ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. దీనికి సంబంధించి మగ దోమల్లో జన్యుపరమైన మార్పులు చేసి వాటి వీర్యాన్ని విషంగా మార్చనున్నారు. దోమల నివారణకు రసాయన పురుగుమందులు వాడడంతో ఇతర జీవులు, మనుషులకు సైతం హానికరంగా మారుతోంది. అయితే తాము అభివృద్ధి చేస్తున్న నూతన పద్ధతిలో కేవలం హానికరమైన ఆడదోమలను మాత్రమే చంపేందుకు అవకాశం ఉంటుందని మాక్వేరీ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త సామ్ బీచ్ చెబుతున్నారు. దీంతో మలేరియా, డెంగ్యూ జ్వరం వంటి వ్యాధుల వ్యాప్తి గణనీయంగా తగ్గుతుందని ఆయన చెప్పారు.


ఈ విధానాన్ని ఇప్పటికే ఈగలపై ప్రయోగించినట్లు మరో శాస్త్రవేత్త మజీజ్ మసెల్కో వెల్లడించారు. విషపూరిత వీర్యాన్ని కలిగి ఉన్న మగ ఈగలు.. ఆడ ఈగలతో సంభోగం చేసిన తర్వాత ఆడ ఈగల జీవిత కాలం గణనీయంగా తగ్గిపోయినట్లు పరిశోధనలో గుర్తించినట్లు ఆయన చెప్పారు. ఇదే పద్ధతిని దోమలపైనా అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అయితే మనుషులు, ఇతర జీవరాశులకు ఈ ప్రయోగం హానికరం కాదని నిర్ధారించుకున్న తర్వాతే పూర్తిస్థాయిలో దీన్ని అమలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రయోగం దోమల్లోనూ విజయవంతం అయితే మలేరియా, డెంగ్యూ మరణాలు ఇకపై ఉండవని మాక్వేరీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Updated Date - Jan 08 , 2025 | 04:58 PM