Share News

టైటిల్‌ వెనుక.. చిచ్చర పిడుగులు

ABN , Publish Date - Feb 03 , 2025 | 05:42 AM

Behind the title.. retained the World Cup title undefeated

టైటిల్‌ వెనుక.. చిచ్చర పిడుగులు

టోర్నీ ఆసాంతం జైత్రయాత్ర కొనసాగించిన భారత యువకెరటాలు.. అజేయంగా వరల్డ్‌కప్‌ టైటిల్‌ను నిలబెట్టుకొన్నారు. గ్రూప్‌ దశ నుంచి అదరగొట్టిన మన అమ్మాయిలు.. భారీ స్కోర్లు చేయడమే కాదు బౌలింగ్‌లోనూ అదరగొట్టారు. తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆల్‌రౌండ్‌ షోతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించగా.. కమిలిని కూడా చక్కగా రాణించింది. అయితే, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ, పరుణిక సిసోడియా లాంటి బౌలర్లు ఈ టోర్నీ ద్వారా వెలుగు చూడడం శుభపరిణామం.

కమలిని: తమిళనాడుకు చెందిన ఎడమ చేతి వాటం బ్యాటర్‌ కమలిని ఓపెనర్‌గా త్రిషకు చక్కని సహకారం అందించింది. బ్యాట్‌తోనూ దీటుగా రాణించింది. ఏడు మ్యాచ్‌ల్లో 47.66 సగటుతో 143 పరుగులు చేసింది. సూపర్‌ సిక్స్‌లో స్కాట్లాండ్‌పై 51, సెమీ్‌సలో ఇంగ్లండ్‌పై 56 పరుగులతో సత్తాచాటింది.


వైష్ణవి శర్మ: గ్వాలియర్‌కు చెందిన లెఫ్టామ్‌ స్పిన్నర్‌ వైష్ణవి. టోర్నీలోనే అత్యధికంగా 17 వికెట్లు పడగొట్టింది. మలేసియాతో మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సహా 5/5తో ప్రకంపనలు సృష్టించింది. సెమీ్‌సలో 3/23తో ఇంగ్లండ్‌ వెన్నువిరిచిన వైష్ణవి.. ఫైనల్లో సౌతాఫ్రికాపై 2/23తో నిలకడగా రాణించింది.

ఆయుషి శుక్లా: తన స్పిన్‌తో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టింది ఆయుషి. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టింది.

సనిక చల్కే: ముంబైకి చెందిన సనిక వైస్‌ కెప్టెన్‌, మిడిలార్డర్‌ బ్యాటర్‌. ఓపెనర్లు శుభారంభం అందిస్తే.. అదే జోరును కొనసాగిస్తూ జట్టుకు భారీ స్కోర్లు అందించడానికి తీవ్రంగా కృషి చేసింది.

పరుణిక సిసోడియా: మన స్పిన్‌ విభాగంలో మరో తురుపుముక్క పరుణిక. వైష్ణవి, ఆయుషి తరహాలోనే రాణిస్తూ 10 వికెట్లు కూల్చింది. సెమీ్‌సలో 3/21తో అదరగొట్టిన సిసోడియా.. ఫైనల్లో 2/6తో వావ్‌ అనిపించింది.


309 పరుగులు 7 వికెట్లు

భద్రాచలానికి చెందిన త్రిష టోర్నీలో ఆడిందనే దానికంటే.. ఏలిందనే చెప్పుకోవాలి. డాషింగ్‌ ఓపెనర్‌గా త్రిష పరుగుల వరద పారించింది. ప్రతి మ్యాచ్‌లోనూ ప్రత్యర్థి బౌలర్లపై మెరుపుదాడి చేస్తూ జట్టుకు పటిష్టపునాది వేసింది. స్కాట్లాండ్‌పై అజేయంగా 110 పరుగులు చేసిన త్రిష.. టోర్నీ చరిత్రలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 77.25 సగటుతో 309 పరుగులు చేసింది. ఈ క్రమంలో టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. లెగ్‌ స్పిన్నర్‌గానూ రాణించిన ఆమె ఏడు వికెట్లు పడగొట్టింది. 3/6 త్రిష అత్యుత్తమ ప్రదర్శన.


Ind Vs Eng T20: ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా టీ20.. అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు

Read Latest and Sports News

Updated Date - Feb 03 , 2025 | 05:42 AM