Novak Djokovic : అయ్యో.. జొకో
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:26 AM
ఎన్నాళ్లనుంచో ఊరిస్తున్న 25 గ్రాండ్‌స్లామ్‌ల అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. మరో రెండు మ్యాచ్‌లు గెలిస్తే చరిత్ర సృష్టిస్తాడు. ఈసారి టోర్నమెంట్లో అద్భుతంగా ఆడాడు. ఈ క్రమంలో కొన్ని నాలుగు సెట్ల పోరాటాలూ చేశాడు. టైటిల్ హాట్ ఫేవరెట్, యువ సంచలనం

తిరగబెట్టిన గాయం
సెమీ్‌సనుంచి అర్ధంతర నిష్క్రమణ
ఫైనల్లో జ్వెరేవ్
సిన్నర్‌తో అమీతుమీ
ఆస్ట్రేలియన్ ఓపెన్
ఎన్నాళ్లనుంచో ఊరిస్తున్న 25 గ్రాండ్‌స్లామ్‌ల అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. మరో రెండు మ్యాచ్‌లు గెలిస్తే చరిత్ర సృష్టిస్తాడు. ఈసారి టోర్నమెంట్లో అద్భుతంగా ఆడాడు. ఈ క్రమంలో కొన్ని నాలుగు సెట్ల పోరాటాలూ చేశాడు. టైటిల్ హాట్ ఫేవరెట్, యువ సంచలనం కార్లోస్ అల్కారజ్‌ను చిత్తు చేయడంతో అతడిపై అంచనాలు రెట్టింపయ్యాయి. కానీ గాయం దెబ్బ కొట్టింది. సెమీఫైనల్ మధ్యలోవైదొలగాల్సిన పరిస్థితి కల్పించింది. దాంతో దిగ్గజ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ టెన్ని్‌సలో అరుదైన అధ్యాయాన్ని తన పేరిట లిఖించుకొనేఅవకాశం కోసం మరికొంత సమయం వేచి చూడక తప్పదు.
మెల్‌బోర్న్: అల్కారజ్‌తో క్వార్టర్‌ఫైనల్లో అయిన గాయం జొకోవిచ్‌కు చేటు చేసింది. ఆ గాయం వల్లే క్వార్టర్స్ తర్వాత జొకో ప్రాక్టీస్ చేయలేదు. దాంతో అతడు సెమీఫైనల్ ఆడతాడా..లేదా..అనే అనుమానాలూ రేకెత్తాయి. చివరకు అదే నిజమైంది. రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరేవ్ (జర్మనీ)తో శుక్రవారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీ్‌సలో 6-7 (7)తో తొలి సెట్ కోల్పోయిన దశలో ఎడమ కాలి గాయంతో ఏడో సీడ్ జొకోవిచ్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. దాంతో ఫైనల్‌కు చేరిన జ్వెరేవ్ డిఫెండింగ్ చాంపియన్ జానిక్ సిన్నర్‌తో టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడు. మరో సెమీఫైనల్లో టాప్ సీడ్ సిన్నర్ (ఇటలీ) 7-6 (2), 6-2, 6-2తో 21వ సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా)పై గెలుపొందాడు.
గాయం తీవ్రమై..
అల్కారజ్‌తో మంగళవారం జరిగిన నాలుగు సెట్ల క్వార్టర్‌ఫైనల్ సందర్భంగా 37 ఏళ్ల జొకో ఎడమ కాలికి గాయమైంది. తొలి సెట్ అనంతరం మెడికల్ టైమౌట్ తీసుకున్న నొవాక్ కాలికి పట్టీ వేసుకొని ఆటలో కొనసాగాడు. రెండో సెట్లో నొప్పితో బాగా ఇబ్బందిపడ్డాడు. ఇక.. జ్వెరేవ్‌తో సెమీస్ తొలి సెట్ 81 నిమిషాలపాటు పోటాపోటీగా సాగింది. ఫలితంగా సెట్ టైబ్రేకర్‌కు దారితీయగా.. అందులోనూ జొకో, జ్వెరేవ్ ఒక్కో పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. ఎట్టకేలకు జ్వెరేవ్ సెట్‌ను దక్కించుకున్నాడు. ఈ సమయంలో నొప్పి భరించలేని స్థాయికి చేరడంతో మ్యాచ్ నుంచి విరమించుకుంటున్నట్టు రెఫరీకి జొకో తెలిపాడు. సెమీఫైనల్ నుంచి వైదొలగకుంటే కెరీర్‌లో 100వ టైటిల్‌ను ఈ గ్రాండ్‌స్లామ్‌లోనే సాధించే అవకాశం ఉండేది. టెన్నిస్ చరిత్రలో ఇప్పటి వరకు రోజర్ ఫెడరర్ (102) మాత్రమే సెంచరీ టైటిళ్ల ఫీట్ సాధించాడు.
సిన్నర్..తడబాటుకు లోనై..: రెండో సెమీఫైనల్లో సిన్నర్‌కు తొలిసెట్‌లో షెల్టన్ గట్టి పోటీ ఇచ్చాడు. 6-5తో షెల్టన్ సెట్ పాయింట్‌పై నిలిచిన వేళ..ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్ చేసిన సిన్నర్ సెట్‌ను టైబ్రేక్‌కు మళ్లించాడు. ఆ సెట్‌ను నెగ్గిన జానిక్ తదుపరి రెండు సెట్లను ఏకపక్షం చేసి మ్యాచ్ గెలుపొందాడు.