ఉప్పల్‌లో ఇషాన్ తుఫాన్
ABN , Publish Date - Mar 24 , 2025 | 05:24 AM
నిరుటి రన్నరప్ హైదరాబాద్ ఈసారి ఐపీఎల్‌లో అద్భుతమైన బోణీ కొట్టింది. క్రీజులోకి వచ్చిన బ్యాటర్లంతా హడలెత్తించిన వేళ 44 పరుగులతో రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది...

సూపర్ సెంచరీతో కదం తొక్కిన కిషన్
ఇషాన్ కిషన్ (47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 106 నాటౌట్)
హైదరాబాద్ 286/6 రాజస్థాన్ 242/6
సన్‌రైజర్స్ పరుగుల సునామీ
44 రన్స్‌తో రాయల్స్ ఓటమి
హెడ్ ధనాధన్ ఇన్నింగ్స్
గత సీజన్‌లో మూడుసార్లు 250కిపైగా స్కోర్లు..టాపార్డర్ బ్యాటర్లంతా సూపర్ ఫామ్‌తో ఫుల్ జోష్..ఇంకేం ఈ సీజన్ తమ తొలి పోరులో, పైగా సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ‘300’ కొట్టేస్తుందనే అంచనా..అందుకు తగ్గట్టుగానే రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లంతా పూనకం వచ్చినట్టు ఆడారు..
ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపారు..అలవోకగా ఫోర్లు, సిక్సర్లు బాది పరుగుల సునామీ సృష్టించారు..దాంతో ఐపీఎల్‌లో తన పేరిటేనున్న రికార్డు స్కోరుకు దగ్గరగా రైజర్స్ దూసుకొచ్చింది..
అయితే ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు కోల్పోకుండా ఉంటే ఆ రికార్డు అందుకొనేదే! ముంబై ఇండియన్స్ నుంచి సన్‌రైజర్స్‌కు మారాక తొలి మ్యాచ్ బరిలో దిగిన ఇషాన్ కిషన్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఫ్యాన్స్‌ను సమ్మోహితులను చేశాడు.
హైదరాబాద్: నిరుటి రన్నరప్ హైదరాబాద్ ఈసారి ఐపీఎల్‌లో అద్భుతమైన బోణీ కొట్టింది. క్రీజులోకి వచ్చిన బ్యాటర్లంతా హడలెత్తించిన వేళ 44 పరుగులతో రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో మొదట హైదరాబాద్ 20 ఓవర్లలో 286/6 స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ (47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 106 నాటౌట్) సూపర్ సెంచరీతో భళా అనిపించాడు. ట్రావిస్ హెడ్ (31 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 67), క్లాసెన్ (14 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 34), నితీశ్ కుమార్ (15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 30) మెరిశారు. తుషార్ మూడు, మహీశ్ తీక్షణ రెండు వికెట్లు పడగొట్టారు. భారీ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 242/6 స్కోరుకే పరిమితమై ఓడింది. ధ్రువ్ జురెల్ (35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 70), సంజూ శాంసన్ (37 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. హెట్‌మయెర్ (23 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 42), శుభమ్ దూబే (11 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 34 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. హర్షల్ పటేల్, సిమర్జీత్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇషాన్ కిషన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
అంతా చెలరేగారు: సంజూ శాంసన్ గాయంతో ‘ఇంపాక్ట్ ఆటగాడి’ పాత్రకే పరిమితం కావడంతో రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ చేపట్టాడు. అయితే ఫ్లాట్ ఉప్పల్ పిచ్‌పై..టా్‌స గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుని పరాగ్ తొలి తప్పిదం చేశాడు. ఇక ప్రతి హైదరాబాద్ బ్యాటర్ రాయల్స్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. ముఖ్యంగా సన్‌రైజర్స్ తరపున మొదటి మ్యాచ్ బరిలో దిగిన ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ (24) సహజ శైలిలో విజృంభించగా, నితీశ్, క్లాసెన్ కూడా బ్యాట్లు ఝళిపించడంతో పరుగులు వెల్లువెత్తాయి. ఈక్రమంలో తొలుత..అభిషేక్, హెడ్ బాదుడుకు మొదటి మూడు ఓవర్లలోనే రైజర్స్ 45 పరుగులు కొల్లగొట్టింది. నాలుగో ఓవరల్లో అభిషేక్‌ను తీక్షణ అవుట్ చేసినా రాయల్స్‌కు ఊరట దక్కలేదు. ఉరుముకు, మెరుపు తోడైనట్టు హెడ్‌కు, కిషన్ జత కలవడంతో హైదరాబాద్ స్కోరు రాకెట్ వేగంతో దూసుకు పోయింది. పవర్ ప్లేలో 94/1తో నిలవగా, ఆపై హెడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కళ్లు చెదిరే షాట్లతో అలరించిన కిషన్ కూడా అర్ధ శతకాన్ని పూరించాడు. పదో ఓవర్లో హెడ్‌ను తుషార్ దేశ్‌పాండే పెవిలియన్ చేర్చాడు. దాంతో 39 బంతుల్లో 85 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. హెడ్, కిషన్ ఇద్దరూ కలిసి 20 ఫోర్లు, తొమ్మిది సిక్స్‌లు కొట్టడం చూస్తే..రాయల్స్ బౌలర్లను వారు ఎలా ఉతికేశారో తెలుస్తుంది. మెరుపు బ్యాటింగ్‌తో అలరించిన నితీశ్ 15వ ఓవర్లో నిష్క్రమించగా..అతడి స్థానంలో వచ్చిన క్లాసెన్ తగ్గేదేలే అనేలా షాట్లు సంధించాడు. క్లాసెన్ దూకుడుకు 19వ ఓవర్లో సందీప్ శర్మ చెక్ పెట్టగా, ఇదే ఓవర్లో రెండు సిక్స్‌లతోపాటు మరో రెండు పరుగులతో ఇషాన్ ఐపీఎల్‌లో తొలి సెంచరీ సాధించాడు. ఆఖరి ఓవర్లో 2 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ 13 పరుగులే చేసింది.
సంజూ, జురెల్ పోరాడినా..: రికార్డు ఛేదనలో రాజస్థాన్ టపటపా 3 వికెట్లు కోల్పోయినా.. శాంసన్, జురెల్ శతక భాగస్వామ్యంతో పోరాడారు. వీరిద్దరి నిష్క్రమణ అనంతరం హెట్‌మయెర్, శుభమ్ దూబే దూకుడైన బ్యాటింగ్‌తో ఆశలు రేపారు. కానీ రన్‌రేట్ అప్పటికే భారీగా పెరిగిపోవడంతో రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు. జైస్వాల్ (1), కెప్టెన్ రియాన్ పరాగ్ (4), నితీశ్ రాణా (11) విఫలం కావడంతో రాజస్థాన్ 50/3తో ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఈ తరుణంలో శాంసన్, జురెల్ హైదరాబాద్ బౌలర్లపై ఎదురు దాడికి దిగి 9.5 ఓవర్లలో 111 పరుగులు జత చేశారు. కానీ 14వ ఓవర్లో శాంసన్‌ను హర్షల్, 15వ ఓవర్లో జురెల్‌ను జంపా అవుట్ చేయడంతో రాజస్థాన్ పరిస్థితి మారిపోయింది. అయితే హెట్‌మయెర్, శుభమ్ దూబే పట్టువదల్లేదు. సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగి ఆరో వికెట్‌కు 34 బంతుల్లో 80 రన్స్ జోడించినా..ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగారు.
స్కోరుబోర్డు
సన్‌రైజర్స్: అభిషేక్ (సి) జైస్వాల్ (బి) తీక్షణ 24, హెడ్ (సి) హెట్‌మయెర్ (బి) తుషార్ 67, ఇషాన్ కిషన్ (నాటౌట్) 106, నితీశ్‌కుమార్ (సి) జైస్వాల్ (బి) తీక్షణ 30, క్లాసెన్ (సి) పరాగ్ (బి) సందీప్ 34, అనికేత్ వర్మ (సి) ఆర్చర్ (బి) తుషార్ 7, అభినవ్ మనోహర్ (సి) పరాగ్ (బి) తుషార్ 0, కమిన్స్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 20 ఓవర్లలో 286/6; వికెట్ల పతనం: 1-45, 2-130, 3-202, 4-258, 5-279, 6-279; బౌలింగ్: ఫజల్లా ఫరూఖి 3-0-49-0, మహీష్ తీక్షణ 4-0-52-2, ఆర్చర్ 4-0-76-0, సందీప్ శర్మ 4-0-51-1, నితీశ్ రాణా 1-0-9-0, తుషార్ దేశ్‌పాండే 4-0-44-3.
రాజస్థాన్ రాయల్స్: యశస్వీ జైస్వాల్ (సి) అభినవ్ (బి) సిమర్‌జీత్ 1, సంజూ శాంసన్ (సి) క్లాసెన్ (బి) హర్షల్ 66, రియాన్ పరాగ్ (సి) కమిన్స్ (బి) సిమర్‌జీత్ 4, నితీశ్ రాణా (సి) కమిన్స్ (బి) షమి 11, ధ్రువ్ జురెల్ (సి) ఇషాన్ (బి) జంపా 70, హెట్‌మయెర్ (సి) అభినవ్ (బి) హర్షల్ 42, శుభమ్ దూబే (నాటౌట్) 34, ఆర్చర్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 20 ఓవర్లలో 242/6; వికెట్ల పతనం: 1-20, 2-24, 3-50, 4-161, 5-161, 6-241; బౌలింగ్: షమి 3-0-33-1, సిమర్‌జీత్ సింగ్ 3-0-46-2, కమిన్స్ 4-0-60-0, అభిషేక్ శర్మ 2-0-17-0, ఆడమ్ జంపా 4-0-48-1, హర్షల్ పటేల్ 4-0-34-2.
ఆ రెండు ఓవర్లే మార్చేశాయి
రాజస్థాన్ ఛేదనలో జంపా వేసిన 11వ ఓవర్, కమిన్స్ సంధించిన 12వ ఓవరే ఇన్నిం గ్స్ స్వరూపాన్ని మార్చాయి. ఈ రెండు ఓవర్లలో రాజస్థాన్ ఏడు పరుగులే చేయగలిగింది.
డాట్ బాల్స్‌కూడా..
హైదరాబాద్ విజయంలో డాట్ బాల్స్ కూడా కీలకంగా నిలిచాయి. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో రాజస్థాన్ 25 డాట్ బాల్సే వేయగలిగింది. అయితే కమిన్స్ సేన 40 డాట్ బాల్స్ వేయడం విశేషం.
1
ఐపీఎల్ చర్రితలో అత్యధిక పరుగులు (0/76) ఇచ్చుకున్న బౌలర్‌గా జోఫ్రా ఆర్చర్. గత రికార్డు మోహిత్ శర్మ (2/73) పేరిట ఉంది.
528
ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి నమోదైన పరుగులు ఇవి. లీగ్ చరిత్రలో ఇది రెండో అత్యధికం.
2
సన్‌రైజర్స్ చేసిన 286/6 ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు. 287/3తో ‘టాప్’ స్కోరుకూడా హైదరాబాద్ పేరిటే ఉండడం విశేషం.
ఐపీఎల్‌లో టాప్-5 స్కోర్లు
జట్టు స్కోరు ప్రత్యర్థి వేదిక తేదీ
సన్‌రైజర్స్ 287/3 బెంగళూరు బెంగళూరు 2024 ఏప్రిల్ 15
సన్‌రైజర్స్ 286/6 రాజస్థాన్ హైదరాబాద్ 2025 మార్చి 23
సన్‌రైజర్స్ 277/3 ముంబై హైదరాబాద్ 2024 మార్చి 27
కోల్‌కతా 272/7 ఢిల్లీ విశాఖపట్నం 2024 ఏప్రిల్ 3
సన్‌రైజర్స్ 266/7 ఢిల్లీ ఢిల్లీ 2024 ఏప్రిల్ 20
ఇవీ చదవండి:
రోహిత్ చెత్త రికార్డు.. 18వ సారి..
సెంచరీకి అతడే కారణం.. ఒక్క మాటతో..: ఇషాన్
సొంత రికార్డును బ్రేక్ చేసిన ఎస్ఆర్‌హెచ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి