Share News

త్రిష కొత్త చరిత్ర

ABN , Publish Date - Jan 29 , 2025 | 02:47 AM

తెలుగమ్మాయి గొంగడి త్రిష (59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో 110 నాటౌట్‌, 3/6) సెంచరీ విజృంభణతో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటడంతో.. అండర్‌-19 మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో సూపర్‌ సిక్స్‌ను భారత జట్టు...

త్రిష కొత్త చరిత్ర

త్రి‘షో’

తెలుగమ్మాయి రికార్డు శతకం

  • యువ భారత్‌ ఘన విజయం

  • 150 పరుగులతో స్కాట్లాండ్‌ చిత్తు

  • సెమీ్‌సలో ఇంగ్లండ్‌తో భారత్‌ ఢీ

  • అండర్‌-19 టీ20 వరల్డ్‌కప్‌

కౌలాలంపూర్‌: తెలుగమ్మాయి గొంగడి త్రిష (59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో 110 నాటౌట్‌, 3/6) సెంచరీ విజృంభణతో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటడంతో.. అండర్‌-19 మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో సూపర్‌ సిక్స్‌ను భారత జట్టు ఘన విజయంతో ముగించింది. ఈపాటికే సెమీస్‌ చేరిన డిఫెండింగ్‌ చాంప్‌ భారత్‌.. గ్రూప్‌-1లో మంగళవారం ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో 150 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌ను చిత్తు చేసింది. తద్వారా టోర్నీలో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. టాస్‌ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో స్కాట్లాండ్‌ 14 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలింది. పిప్పా కెల్లీ (12), ఎల్మా (12) టాప్‌ స్కోరర్లు. ఆయుషి శుక్లా 4.. త్రిష, వైష్ణవి శర్మ చెరో 3 వికెట్లు తీశారు. ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన త్రిష ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచింది. శుక్రవారం జరిగే తొలి సెమీ్‌సలో ఇంగ్లండ్‌తో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది.


బాదుడే.. బాదుడు: భద్రాద్రి కొత్తగూడెం అమ్మాయి త్రిష ఆరంభం నుంచే ఎడాపెడా షాట్లతో స్కాట్లాండ్‌ బౌలర్లను ఓ ఆటాడుకొంది. మరో ఓపెనర్‌ కమిలిని (51) కూడా త్రిషకు చక్కని సహకారం అందించడంతో స్కోరు బోర్డు కళ్లెంలేని గుర్రంలా పరుగెత్తింది. నాలుగో ఓవర్‌లో మూడు బౌండ్రీలు బాదిన త్రిష.. మ్యాచ్‌ ఆసాంతం అదే జోరును కొనసాగించింది. మరో ఎండ్‌లో ఉన్న కమిలిని కూడా ఎక్కువగా ఫోర్లతోనే స్కోరు బోర్డు నడిపింది. ఏడో ఓవర్‌లో మెక్‌కోల్‌ బౌలింగ్‌లో త్రిష ఏకంగా సిక్స్‌తో ఔరా అనిపించింది. టాప్‌ గేర్‌లో సాగిన త్రిష.. మరో మూడు బౌండ్రీలతో అర్ధ శతకం పూర్తి చేసుకొంది. దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 104/0తో భారీ స్కోరు దిశగా సాగింది. పార్కర్‌ వేసిన 13వ ఓవర్‌లో త్రిష ఏకంగా మూడు సిక్స్‌లు బాదడం మ్యాచ్‌కే హైలైట్‌. ఇక, బౌండ్రీతో ఫిఫ్టీ పూర్తి చేసుకొన్న కమిలిని ఆ తర్వాతి బంతికే అవుటైంది. దీంతో తొలి వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సనిక చల్కే (29 నాటౌట్‌) కూడా త్రిషకు అండగా నిలిచింది. 18వ ఓవర్‌లో త్రిష శతకం పూర్తి చేసుకోగా.. చల్కే బౌండ్రీలతో టీమ్‌ స్కోరును 200 మార్క్‌ దాటించింది.


ఈ ప్రపంచక్‌పలో సూపర్‌ఫామ్‌తో దూసుకెళ్తున్న 19 ఏళ్ల గొంగడి త్రిష మరోమారు సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. 53 బంతుల్లోనే శతకం అందుకున్న త్రిష.. టోర్నీ చరిత్రలోనే సెంచరీ నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా అరుదైన చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో ఓవరాల్‌గా ఈ టోర్నీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఇంగ్లండ్‌ బ్యాటర్‌ గ్రేస్‌ స్ర్కివెన్స్‌ (93) రికార్డును త్రిష అధిగమించింది. అంతేకాదు.. ప్రస్తుత టోర్నీలో 230 రన్స్‌తో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా టాప్‌లో కొనసాగుతోంది.

సంక్షిప్త స్కోర్లు

భారత్‌: 20 ఓవర్లలో 208/1 (త్రిష 110 నాటౌట్‌, కమిలిని 51; మెకైరా 1/25).

స్కాట్లాండ్‌: 14 ఓవర్లలో 58 (కెల్లీ 12, ఎమ్మా 12; ఆయుషి 4/8, త్రిష 3/6).

భారత్‌: 20 ఓవర్లలో 208/1 (త్రిష 110 నాటౌట్‌, కమిలిని 51; మెకైరా 1/25).

స్కాట్లాండ్‌: 14 ఓవర్లలో 58 (కెల్లీ 12, ఎమ్మా 12; ఆయుషి 4/8, త్రిష 3/6).


Also Read: నీ ఇంట్లో నుంచి అవార్డు ఇస్తున్నావా సంజయ్..!

Also Read:ఆర్చర్ జ్యోతి సురేఖకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలి

Also Read: అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు

For Telangana News And Telugu News

Updated Date - Jan 29 , 2025 | 02:48 AM