కాంగ్రెస్‌ది అభయ హస్తం కాదు.. కుటిల హస్తం
ABN , Publish Date - Mar 22 , 2025 | 03:40 AM
కాంగ్రెస్ పార్టీది అభయ హస్తం కాదని, కుటిల, కపట, భస్మాసుర హస్తమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రైజింగ్ తెలంగాణ అని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా.. నలుగురు క్యాబినెట్ మంత్రులే రైజింగ్‌లో ఉన్నారని, తెలంగాణ ప్రజలు ఫాలింగ్‌లో ఉన్నారని చెప్పారు.

ఇచ్చిన హామీలకు బడ్జెట్‌లో నిధులెక్కడ?
మంత్రులు రైజింగ్‌లో ఉంటే.. ప్రజలు ఫాలింగ్‌లో ఉన్నారు: ఏలేటి
సమాధానమిచ్చిన జూపల్లి, దుద్దిళ్ల
హైదరాబాద్, మార్చి21 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీది అభయ హస్తం కాదని, కుటిల, కపట, భస్మాసుర హస్తమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రైజింగ్ తెలంగాణ అని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా.. నలుగురు క్యాబినెట్ మంత్రులే రైజింగ్‌లో ఉన్నారని, తెలంగాణ ప్రజలు ఫాలింగ్‌లో ఉన్నారని చెప్పారు. బడ్జెట్‌పై శుక్రవారం శాసన సభలో ఏలేటి మాట్లాడారు. హామీలకు పాతర వేసి తెలంగాణకు మొండి చేయి చూపేలా బడ్జెట్ ఉందన్నారు. అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టుతున్నారని, రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్నారు. ఆరు గ్యారెంటీలకు, ఇందిరమ్మ ఇళ్లకు, ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలకు బడ్జెట్‌లో సరిపడా కేటాయింపులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రూ.1,63,000 కోట్ల అప్పులు ఎందుకు చేశారో ప్రభుత్వం ప్రజలకు వివరించాలని కోరారు. 20 శాతం కమిషన్ ఇస్తే తప్ప బకాయిలు ఇవ్వడం లేదని గుత్తేదారులు నినాదాలు చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉండటం బాధాకరం అన్నారు. భూభారతి బిల్లు ఆమోదం పొంది 4 నెలలు గడిచినా ఇంత వరకు విధివిధానాలను ఎందుకు అమలు చేయడం లేదని ఏలేటి ప్రశ్నించారు. రూ.2.50 లక్షల కోట్ల విలువ చేసే 25 వేల ఎకరాల భూములు చేతులు మారాయని ప్రకటించిన ప్రభుత్వం విచారణ ఎందుకు చేపట్టడం లేదన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉందంటూనే లక్షల కోట్లతో మూసీ పునరుజ్జీవనాన్ని ఎందుకు తెరమీదకు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
పెట్టుబడులను ఆకర్షించేందుకే మూసీ
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకే మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు చేపడుతున్నామని మంత్రి జూపల్లి ఏలేటి ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. మూసీ పునరుజ్జీవనంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ సిద్ధమవుతుందని చెప్పారు.
ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం
ఏలేటి వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని, రాసిపెట్టుకోవాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలే అయినా.. ఇప్పటికే కొన్ని హామీలను అమలు చేశామన్నారు. సభకు వస్తున్న తనను పోలీసులు అడ్డుకున్నారని ఏలేటి స్పీకర్‌కు చేసిన ఫిర్యాదు మంత్రి స్పందించారు. అసెంబ్లీ ఆవరణకు బయట ఆ సంఘటన జరిగిందని సభ్యుడు చెప్పినట్లు అసెంబ్లీ ఆవరణలో జరగలేదన్నారు. సభ్యుల గౌరవాన్ని కాపాడటంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.