Bandi Sanjay: కేసీఆర్ సన్నిహిత నేతకుబీదర్‌లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్!
ABN , Publish Date - Mar 24 , 2025 | 03:42 AM
కేసీఆర్ సన్నిహితుడైన ఓ బీఆర్‌ఎస్ నాయకుడికి బీదర్‌లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ మనుషులు బీదర్‌లో దొంగనోట్లు ముద్రించారన్నారు.

ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పంచింది ఆ నోట్లే
కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు
హామీల అమలు చేతగాక డీలిమిటేషన్‌పై విపక్షాల దుష్ప్రచారం: కిషన్‌రెడ్డి
కరీంనగర్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కేసీఆర్ సన్నిహితుడైన ఓ బీఆర్‌ఎస్ నాయకుడికి బీదర్‌లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ మనుషులు బీదర్‌లో దొంగనోట్లు ముద్రించారన్నారు. ఆ ప్రింటింగ్ ప్రెస్‌ను మూసివేసేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసులు వెళితే ఒత్తిడి తెచ్చి, అక్కడికి వెళ్లకుండా చేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పంచిన నోట్లన్నీ దొంగ నోట్లేనని ఆరోపించారు. ఆదివారం కరీంనగర్‌లోని తెలంగాణ ఉపాధ్యాయ ప్రాంతీయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనతో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. ప్రజలు కాంగ్రె్‌సకు అధికారం అప్పగించినా ఇబ్బందులు తప్పడం లేదని చెప్పారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్, డీఎంకే, ఆప్, సీపీఎం పార్టీలు ఒకే చోట చేరి నియోజకవర్గాల పునర్విభజన పేరుతో డ్రామాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. స్టాలిన్ ప్రభుత్వం వెయ్యి కోట్ల లిక్కర్ స్కాం చేసిందని ఆరోపించారు. కేరళలోను లిక్కర్ స్కాం బయటపడిందన్నారు. ఆప్, బీఆర్‌ఎస్ నేతలు మద్యం కుంభకోణంలోనే జైలుకు వెళ్లారని తెలిపారు. కుంభకోణం దొంగలతా చెన్నైలో సమావేశమై పునర్విభజన పేరుతో మోదీ ప్రభుత్వంపై విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారన్నారు. దేశ జీడీపీకి పార్లమెంట్‌లో ప్రాతినిధ్యానికి సంబంధం ఏంటని సంజయ్ ప్రశ్నించారు. ఇక ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలని అడుగుతుంటే డబ్బుల్లేవని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, 18 శాతం కమీషన్లు ఇస్తే కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖను అర్బన్ నక్సల్స్ చేతిలో పెట్టి తుపాకీ రాజ్యం తేవాలని కాంగ్రెస్ భావిస్తోందని విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను కాంగ్రెస్ మోసం చేస్తోందని, తపస్ పక్షాన వారి సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పోరాటాల వల్ల ఉద్యోగాలు పోతే బీజేపీ టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటామని తెలిపారు.
కేటీఆర్ వ్యాఖ్యలు అవమానకరం
ఈ భూమిపై ధర్మం ఉన్నంత వరకు అయోధ్య ఉంటుందని, అయోధ్య లేదని కేటీఆర్ వ్యాఖ్యానించడం అవమానకరమని బండి సంజయ్ అన్నారు. ‘హిందూ ఆచారాలను అవమానించినంత మాత్రాన ప్రాచుర్యం పొందలేరని గుర్తుంచుకో.. ట్విటర్ టిల్లూ’ అంటూ ఆదివారం ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్ కరీంనగర్‌కు వచ్చినప్పుడల్లా హిందువులను హేళన చేస్తారని మండిపడ్డారు.