Share News

KC Venugopal: బీసీ బిల్లు చట్టమయ్యేలా చూడండి

ABN , Publish Date - Mar 21 , 2025 | 04:39 AM

తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి చట్ట రూపం దాల్చేలా కృషి చేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కాంగ్రెస్‌ రాష్ట్ర ఎంపీలు కోరారు.

KC Venugopal: బీసీ బిల్లు చట్టమయ్యేలా చూడండి

  • రాహుల్‌ గాంధీ నేతృత్వం వహించాలి

  • వేణుగోపాల్‌కు కాంగ్రెస్‌ ఎంపీల విన్నపం

న్యూఢిల్లీ, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి చట్ట రూపం దాల్చేలా కృషి చేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కాంగ్రెస్‌ రాష్ట్ర ఎంపీలు కోరారు. ఇందుకోసం లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ నేతృత్వం వహించాలని, ఈ దిశగా చొరవ తీసుకోవాలని ఆయనకు విన్నవించారు. పార్లమెంట్‌లోని కేసీ వేణుగోపాల్‌ కార్యాలయంలో ఆయనను ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఆర్‌. రఘురామ్‌ రెడ్డి, సురేష్‌ షెట్కర్‌, బలరాం నాయక్‌, కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ కలిశారు. ఆ తర్వాత ఎంపీలు మల్లు రవి, కిరణ్‌కుమార్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో తాము, పార్టీ ఎమ్మెల్యేలు అందరం రాహుల్‌ గాంధీని కలవాలనుకుంటున్నామని చెప్పామని, పార్లమెంట్‌లో ఇండియా కూటమి ఎంపీల మద్దతు కూటగట్టడంలో సహకరించాలని విన్నవించగా.. కేసీ సానుకూలంగా స్పం దించారన్నారు. ఈ అంశంపై రాహుల్‌ గాంధీతో చర్చిస్తానని, ఆ తర్వాత ఆయనతో ఎప్పుడు భేటీ కావాలో నిర్ణయిద్దామని కేసీ చెప్పినట్టు తెలిపారు. మరోవైపు.. తెలంగాణలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగానికి అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కాంగ్రెస్‌ ఎంపీలు కోరారు. కేంద్ర మంత్రిని ఆయన కార్యాలయంలో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు.


డప్పు కొట్టి, స్వీట్లు పంచి...

అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్‌ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు ఆమోదం తెలపడంపై కాంగ్రెస్‌ ఎంపీలు ఢిల్లీలో సంబరాలు నిర్వహించారు. తెలంగాణ భవన్‌లో ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ నేతృత్వంలో ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మల్లు రవితో పాటు కాంగ్రెస్‌ శ్రేణులు డప్పు కొడుతూ, స్వీట్లు పంచుతూ హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Mar 21 , 2025 | 04:39 AM