Adilabad: బ్యాంకులోనే రైతు బలవన్మరణం
ABN , Publish Date - Jan 19 , 2025 | 03:45 AM
రుణం తీర్చే అంశంలో బ్యాంకు సిబ్బంది వేధింపులు తాళలేక తీవ్ర మనోవేదనకు గురైన ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనకు అప్పు ఇచ్చిన బ్యాంకులోనే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఐదు ఎకరాలు తాకట్టు పెట్టి రూ.మూడున్నర లక్షల రుణం
దిగుబడి లేక ఓ వాయిదా జాప్యం
చెల్లించాలంటూ వేధింపులు
మేనేజర్‌తో మాట్లాడి వచ్చాక
పురుగు మందు తాగిన రైతు
కాసేపటికి కుప్పకూలి మృతి
బ్యాంకు ఎదుట బాధిత రైతు కుటుంబం, ప్రజల ఆందోళన
రుణమాఫీకి బ్యాంకు అంగీకారం మృతుడి కుమారుడికి ఉద్యోగం
ఆదిలాబాద్ ఐసీఐసీఐ బ్యాంకులో ఘటన
ఆదిలాబాద్, జనవరి 18(ఆంధ్రజ్యోతి): రుణం తీర్చే అంశంలో బ్యాంకు సిబ్బంది వేధింపులు తాళలేక తీవ్ర మనోవేదనకు గురైన ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనకు అప్పు ఇచ్చిన బ్యాంకులోనే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్‌లో శనివారం జరిగిన ఈ ఘటనలో జాదవ్ దేవ్‌రావ్(50) అనే రైతు బలవన్మరణం పొందాడు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... ఆదిలాబాద్ జిల్లా బేల మండలం రేణిగూడకు చెందిన జాదవ్ దేవ్‌రావ్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే దేవ్‌రావ్.. ఆదిలాబాద్ టీచర్స్ కాలనీలోని ఐసీఐసీఐ బ్యాంకులో తన ఐదు ఎకరాల భూమిని తాకట్టు పెట్టి నాలుగేళ్ల క్రితం రూ.3.50లక్షల రుణం తీసుకున్నాడు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తున్నాడు. ఇటీవల పంట దిగుబడులు సరిగా లేక ఓ వాయిదా చెల్లింపులో జాప్యం జరిగి రూ.25 వేల మేర బకాయి పడ్డాడు.
దీంతో రేణిగూడకు వెళ్లిన బ్యాంకు సిబ్బంది.. బకాయిలు చెల్లించాలని దేవ్‌రావ్‌ను వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆదిలాబాద్‌లోని ఐసీఐసీఐ బ్యాంకుకు శనివారం వచ్చిన దేవ్‌రావ్.. బ్రాంచీ మేనేజ్‌ర్‌ను కలిశాడు. ఆ తర్వాత ఆవేశంగా బయటకు వెళ్లిపోయి క్రిమిసంహారక మందు డబ్బాతో కాసేపటికి బ్యాంకుకు తిరిగొచ్చాడు. అనంతరం బ్యాంకులోనే ఆ మందు తాగి అస్వస్థతకు గురై అక్కడే కూర్చున్నాడు. బ్యాంకు సెక్యూరిటీ సిబ్బంది దేవ్‌రావ్‌ను గమనించినా.. ఆస్పత్రికి తరలించే లోపే అక్కడే కుప్పకూలిపోయి ప్రాణం విడిచాడు. ఇదంతా బ్యాంకు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. రైతు ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి వివరాలు సేకరించారు. అలాగే, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, మాజీ మంత్రి జోగు రామన్న కూడా బ్యాంకు వద్దకు చేరుకుని జరిగిన ఘటనపై ఆరా తీశారు.
ఇక, దేవ్‌రావ్ ఆత్మహత్య సంగతి తెలిసి బ్యాంకు వద్దకు వచ్చిన అతని కుటుంబసభ్యులు, గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే పాయల శంకర్, మాజీ మంత్రి జోగు రామన్న, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రూపేశ్‌రెడ్డి.. బ్యాంకు అధికారులతో నాలుగైదు గంటల పాటు చర్చలు జరిపారు. అయితే, దేవ్‌రావ్ తీసుకున్న రూ.3.50 లక్షల రుణమాఫీకి, దేవ్‌రావ్ కుమారుడికి ఆరు నెలల శిక్షణ ఇచ్చి బ్యాంకులో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు అంగీకరించారు. దీనికి దేవ్‌రావ్ కుటుంబం కూడా అంగీకరించడంతో ఆందోళన సద్దుమణిగింది.