Farmers: సన్నాలకు రైతులు సై
ABN , Publish Date - Apr 02 , 2025 | 02:22 AM
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బోనస్ పథకం కారణంగా రైతులు సన్నరకాల వరి సాగును పెంచుతున్నారు. దీనివల్ల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగి, రైతులకు అధిక లాభాలు అందుతున్నాయి.

ఈ ఖరీ్‌ఫలో 50 లక్షల ఎకరాలు దాటే అవకాశం
సన్నాల సాగుకు రైతుల ఆసక్తి
బోనస్‌తో పెరిగిన సన్న ధాన్యం ధరలు
సన్నబియ్యం పంపిణీతో మరింత ధీమా
హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): అన్నదాతలు సన్నాల సాగుకు సై అంటున్నారు. ఇంతకాలం దొడ్డురకాలకు, సన్నరకాలకు ఒకే కనీస మద్దతు ధర ఉండటంతో గిట్టుబాటు కాదని భావించిన రైతులు... బోనస్ పథకం అమలులోకి రావటంతో సన్నాల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ పథకం కూడా ప్రారంభం కావటంతో రైతులకు మరింత ధీమా వచ్చింది. వచ్చే వానాకాలంలో వరి సాగులో 80 శాతం వరకు సన్నాలే సాగవుతాయని, సన్నరకాల సాగు విస్తీర్ణం 50 లక్షల ఎకరాలు దాటే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. 2023-24 వానాకాలంలో 25 లక్షల ఎకరాలు, యాసంగిలో 14 లక్షల ఎకరాల్లో సన్నరకాలు సాగయ్యాయి. 2024-25 సంవత్సరానికి వచ్చేసరికి ఈ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వానాకాలంలో 40.55 లక్షల ఎకరాలు, యాసంగిలో 22.68 లక్షల ఎకరాల్లో సన్నరకాలు సాగు చేశారు. 2024-25 వానాకాలంలో మొత్తం వరి సాగు విస్తీర్ణం 65.50 లక్షల ఎకరాలు కాగా... ఇందులో 62 శాతం విస్తీర్ణంలో సన్నాలు సాగయ్యాయి. ఇక యాసంగిలో వరి సాగు విస్తీర్ణం 56.69 లక్షల ఎకరాలు కాగా 40 శాతం విస్తీర్ణంలో సన్నాలు సాగు చేశారు. వచ్చే వానాకాలంలో (2025-26) వరి సాగు విస్తీర్ణం 67 లక్షల ఎకరాలు ఉంటుందని... ఇందులో సన్నాల విస్తీర్ణం 50 లక్షల ఎకరాలు దాటుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బోనస్ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. సన్నరకాలకు కనీస మద్దతు ధరపై క్వింటాలుకు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2,300 ఉండగా దానికి రూ.500 కలపడంతో రూ.2,800కు చేరింది. దీంతో బహిరంగ మార్కెట్లో ధరలు కూడా ఒక్కసారిగా పెరిగాయి. గత వానాకాలం సీజన్‌లో జైశ్రీరాం లాంటి డిమాండ్ ఉన్న ధాన్యాన్ని రైతులు క్వింటాలుకు రూ.3 వేల చొప్పున విక్రయించారు. వానాకాలంలో గిట్టుబాటు కావటం, బోనస్ పథకం కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించటంతో రైతులు యాసంగిలో కూడా సన్నాల విస్తీర్ణం పెంచారు. 2023- 24 యాసంగితో పోలిస్తే 2024- 25 యాసంగిలో సన్నాల సాగు విస్తీర్ణం సుమారు 9 లక్షల ఎకరాలు పెరిగింది. ఈ క్రమంలో వచ్చే ఖరీ్‌ఫలో సన్నాల విస్తీర్ణం మరింత పెరిగే అవకాశాలున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..
ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..
For More AP News and Telugu News