Share News

Jadcherla: ఎన్‌ఎంఐఎంఎ్‌స వర్సిటీలో విద్యార్థినులకు అస్వస్థత

ABN , Publish Date - Feb 21 , 2025 | 04:28 AM

నార్సిమోంజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (ఎన్‌ఎంఐఎంఎ్‌స) వర్సిటీలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 18 మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడ్డారు.

Jadcherla: ఎన్‌ఎంఐఎంఎ్‌స వర్సిటీలో విద్యార్థినులకు అస్వస్థత

  • చికెన్‌, గుడ్లు తిన్న 18 మందికి వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి

  • నేలపై పడుకోబెట్టి, కుర్చీలకు సెలైన్‌ బాటిళ్లతో గుట్టుగా వైద్యం

  • స్థానిక ఎమ్మెల్యే ఆగ్రహం.. ఆస్పత్రికి తరలింపు

  • నిలకడగా బాధితుల ఆరోగ్య పరిస్థితి

జడ్చర్ల, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): నార్సిమోంజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (ఎన్‌ఎంఐఎంఎ్‌స) వర్సిటీలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 18 మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడ్డారు. అయితే మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి టీజీఐఐసీ ప్రాంగణంలో ఉన్న వర్సిటీలోనే విద్యార్థినులకు చికిత్స అందించడం గమనార్హం. యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా వర్సిటీలో విధులు నిర్వహించే వైద్యుడితోనే చికిత్స చేయించారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను నేలపై పడకోబెట్టి, కుర్చీలకు సెలైన్‌ బాటిళ్లు తగిలించి చికిత్స అందించారు. వర్సిటీలో చికెన్‌, గుడ్లు తినడంతోనే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని తోటి విద్యార్థులు తెలిపారు.


సమాచారం అందుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వెంటనే వర్సిటీకి వెళ్లారు. అక్కడ విద్యార్థినులకు చికిత్స చేస్తున్న తీరును చూసి.. వర్సిటీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థినులను రక్షించే పద్ధతి ఇదేనా? అని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో వర్సిటీ అధికారులు అస్వస్థతకు గురైన వారందరినీ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Updated Date - Feb 21 , 2025 | 04:28 AM