Share News

Food Safety: హోటళ్లలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడులు

ABN , Publish Date - Mar 22 , 2025 | 04:25 AM

నగరంలో, రంగారెడ్డి జిల్లాలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు శుక్రవారం పలు ప్రాంతాల్లో హోటళ్లు, ఆహార పదార్థాల విక్రయ, తయారీ దుకాణాల్లో తనిఖీలు జరిపారు.

Food Safety: హోటళ్లలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడులు

  • పలు లోపాల గుర్తింపు

  • కుళ్లిన మాంసం ఫంక్షన్లకు సరఫరా.. నిందితుడి అరెస్ట్‌, 2 క్వింటాళ్ల మాంసం స్వాధీనం

  • మేడ్చల్‌లో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ సీజ్‌

హైదరాబాద్‌ సిటీ/ చార్మినార్‌, మేడ్చల్‌ టౌన్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి) : నగరంలో, రంగారెడ్డి జిల్లాలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు శుక్రవారం పలు ప్రాంతాల్లో హోటళ్లు, ఆహార పదార్థాల విక్రయ, తయారీ దుకాణాల్లో తనిఖీలు జరిపారు. పలుచోట్ల ఆహార పదార్థాల నిల్వ, తయారీలో లోపాలను గుర్తించారు. నిర్వాహకులకు నోటీసులు అందజేశారు. హిమాయత్‌నగర్‌లోని హోటల్‌ తులిప్స్‌, తుర్కయాంజల్‌లో వంట చేసే ప్రదేశం, సరుకులు నిల్వ చేసే ప్రాంగణంలో అపరిశుభ్ర వాతావరణాన్ని గుర్తించారు. స్టోర్‌ రూంలో 96 కిలోల పాడైపోయిన మాంసం, రూ.2,500 విలువ చేసే ఐస్‌క్రీమ్‌లు, పుట్టగొడుగుల నిల్వలున్నట్లు చెప్పారు. గచ్చిబౌలిలోని వరలక్ష్మి టిఫిన్స్‌లో గోడలు, వంటగది అపరిశుభ్రంగా ఉన్నాయని గుర్తించారు. పనివారికి మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు అందుబాటులో లేవని గుర్తించారు. మాదాపూర్‌ కావూరిహిల్స్‌లోని క్షత్రియ ఫుడ్స్‌లో ఫ్లోరింగ్‌ విరిగిన పలకలతో మురికిగా ఉందని, చిమ్నీలు నూనె కారడంతో జిడ్డుగా మారాయని కనుగొన్నారు. ఫ్రిజ్‌లో ప్లాస్టిక్‌ కవర్లలో లేబుల్‌ లేకుండా నిల్వ చేసిన మాంసం కనుగొన్నారు. కొండాపూర్‌ గచ్చిబౌలి రోడ్డులోని సుబ్బయ్య హోటల్‌లో తనిఖీ చేసి అపరిశుభ్ర కిచెన్‌, ప్రమాణాలు పాటించకుండా కూరగాయలు, ఆహార పదార్థాలు నిల్వ చేయడం గుర్తించారు.


మలక్‌పేటలోని శ్రీ బాలాజీ ఎగ్జిక్యూటివ్‌ బాయ్స్‌ హాస్టల్‌, జీన్‌ భవాని ట్రేడర్స్‌, హిమాయత్‌ సాగర్‌లోని స్టాంజా లివింగ్‌ కార్టజెనా హౌస్‌, ముక్తియార్‌ గంజ్‌లో విష్ణు ట్రేడింగ్‌ కంపెనీలో జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు. కాగా డబీర్‌పురాకు చెందిన మహ్మద్‌ మసీబుద్దీన్‌(24) హోల్‌సేల్‌ మార్కెట్లలో తక్కువ ధరకే కుళ్లిన కాళ్లు, తలలు కొనుగోలు చేసి, ఫ్రీజర్‌లో నిల్వ చేస్తున్నాడు. ఫంక్షన్లకు ఆ కుళ్లిన మాంసాన్ని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. సౌత్‌ఈ్‌స్ట జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది, డబీర్‌పురా పోలీసులు, వెటర్నరీ అధికారులు కలిసి మాతాకి కిడికీ ప్రాంతంలో ఉన్న అతడి గోదాంపై దాడులు నిర్వహించారు. ఫ్రీజర్‌లో నిల్వ చేసిన రూ. 1.50 లక్షల విలువైన 2 క్వింటాళ్ల కుళ్లిన మాంసం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితోపాటు మాంసాన్ని డబీర్‌పురా పోలీసులకు అప్పగించారు. మేడ్చల్‌ పారిశ్రామికవాడలోని హైదరాబాద్‌ ఫుడ్‌ ప్రొడక్ట్‌(సూర్య మసాల అండ్‌ స్పైసె్‌స)లో ఫుడ్‌ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో రూ.3.3 లక్షల విలువ చేసే దాదాపు 46.75 క్వింటాళ్ల అల్లం, వెల్లుల్లి పేస్టును సీజ్‌ చేశారు. ఆహార పదార్థాలను కల్తీ చేసి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఫుడ్‌సేఫ్టీ బృందం హెడ్‌, జోనల్‌ అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ వి. జ్యోతిర్మయి హెచ్చరించారు.

Updated Date - Mar 22 , 2025 | 04:25 AM