Share News

Harish Rao: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో.. హరీశ్‌కు ఊరట

ABN , Publish Date - Mar 21 , 2025 | 04:52 AM

తన ఫోన్‌ను ట్యాప్‌ చేశారంటూ రియల్టర్‌, కాంగ్రెస్‌ నేత చక్రధర్‌గౌడ్‌ ఫిర్యాదుతో నమోదైన కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు భారీ ఊరట లభించింది.

Harish Rao: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో.. హరీశ్‌కు ఊరట

  • రాధాకిషన్‌రావుకు కూడా.. కేసులో విషయం లేదు.. ఫిర్యాదులో

  • జాప్యం జరిగిందన్న హైకోర్టు

  • చక్రధర్‌గౌడ్‌ పెట్టిన కేసు కొట్టివేత

హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): తన ఫోన్‌ను ట్యాప్‌ చేశారంటూ రియల్టర్‌, కాంగ్రెస్‌ నేత చక్రధర్‌గౌడ్‌ ఫిర్యాదుతో నమోదైన కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు భారీ ఊరట లభించింది. ఆయనతోపాటు.. టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ(డీసీపీ) రాధాకిషన్‌రావుపై ఉన్న కేసును కొట్టివేస్తూ.. హైకోర్టు గురువారం తీర్పునిచ్చింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లకు కావాల్సిన ముడిసరుకు (విషయం) ఫిర్యాదులో లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఫిర్యాదు చేయడంలోనూ ఆలస్యం జరిగిందని ఆక్షేపించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ‘ఫార్మర్స్‌ ఫస్ట్‌ ఫౌండేషన్‌’ పేరుతో సిద్దిపేట నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థిగా పోటీ చేశాననే కక్షతో హరీశ్‌రావు తనను చిత్ర హింసలకు గురిచేశారని, చంపుతానని బెదిరించడమే కాకుండా.. తనతోపాటు, తన కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్‌ చేయించారని పేర్కొంటూ.. రియల్టర్‌, కాంగ్రెస్‌ నేత చక్రఽధర్‌ గౌడ్‌ గత ఏడాది డిసెంబరు 1న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. ఇది తప్పుడు కేసు అని, దీన్ని కొట్టివేయాలని కోరుతూ హరీశ్‌రావు, రాధాకిషన్‌రావు వేర్వేరుగా హైకోర్టులో క్వాష్‌ పిటిషన్లను దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. హరీశ్‌రావు తరఫున సీనియర్‌ న్యాయవాది దామ శేషాద్రి నాయుడు, న్యాయవాది ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి వాదనలను వినిపించారు. ‘‘చక్రధర్‌గౌడ్‌ ఒక క్రిమినల్‌. అతడిపై లైంగికదాడి సహా 11 కేసులున్నాయి.


రైతులకు పంచిపెట్టేందుకు ఆయనకు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయ? ఇది రాజకీయ కక్షతో సీఎం రేవంత్‌రెడ్డి పెట్టించిన కేసు. తప్పుడు ఆరోపణలతో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయండి’’ అని ధర్మాసనాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వర్‌రావు వాదనలను వినిపించారు. చక్రధర్‌ గౌడ్‌ ఫోన్‌ట్యాపింగ్‌ అయినట్లు ఆధారాలున్నాయని, అతడి సీడీఆర్‌లు సైతం అందుబాటులో ఉన్నాయని.. హరీశ్‌రావు మంత్రిగా తన హోదాను దుర్వినియోగం చేశారని.. వ్యక్తిగత గోప్యత హక్కును కాలరాశారని పేర్కొన్నారు. హరీశ్‌రావు చెప్పినట్లు రాధాకిషన్‌రావు ఫిర్యాదుదారుడిని చిత్రహింసలకు గురిచేశారని పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలను విన్న ధర్మాసనం.. ఈ కేసులో పెట్టిన సెక్షన్లను బలపరిచేలా ఫిర్యాదు లేదని వ్యాఖ్యానించింది. ‘‘ఫిర్యాదుదారు ఇచ్చిన సీఆర్‌పీసీ 161 స్టేట్‌మెంట్‌లో దోపిడీ, ప్రభుత్వ సేవకుల విశ్వాస ఘాతుకం, గాయపర్చడం ద్వారా భయపెట్టడం, సమాచార సాంకేతికతకు సంబంధించిన ఆరోపణలు లేవు.


ఐటీయాక్ట్‌ సెక్షన్‌ 66 పెట్టడానికి ఫిర్యాదులో ఆ మేరకు ఆరోపణలే లేవు. తొలుత డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో, పోలీసులు ఆ తర్వాత తన ఫిర్యాదును స్వీకరించడం లేదం టూ హైకోర్టులో వేసిన అఫిడవిట్‌లోనూ ఈ సెక్షన్లకు సంబంధించిన ఆరోపణలు కనిపించడం లేదు. కేవలం ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. వివిధ క్రిమినల్‌ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఫిర్యాదుదారు తనను హరీశ్‌రావు, రాధాకిషన్‌రావు తనను వేధిస్తున్నారని ఎక్కడా మెజిస్ట్రేట్‌లకు ఫిర్యాదు చేయలేదు. హరీశ్‌రావు మంత్రిగా ఉన్న నేపథ్యంలో పోలీసులు ఫిర్యాదును స్వీకరించలేదని చక్రధర్‌గౌడ్‌ పేర్కొంటున్నా.. 2023 డిసెంబరులో అధికారం మారింది. అధికారమార్పిడి జరిగి, కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎందుకు ఫిర్యాదు చేయలేకపోయారనేదానికి కారణాలు లేవు. 2024 జూన్‌ 19న ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు. విపరీతమైన ఆలస్యానికి కారణాలు కూడా లేవు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఫిర్యాదుదారు ఫిర్యాదులను, మెటీరియల్‌ను పరిశీలించామని.. పోలీసులు పెట్టిన సెక్షన్లకు కావాల్సిన ముడిసరుకు లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో హరీశ్‌రావు, రాధాకిషన్‌రావుపై కేసు కొట్టివేస్తూ.. తుది తీర్పు ఇచ్చింది.

Updated Date - Mar 21 , 2025 | 04:52 AM