Share News

Hyderabad: రాష్ట్రంలో హెన్‌కిన్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌

ABN , Publish Date - Mar 29 , 2025 | 05:13 AM

అమెరికాకు చెందిన బీర్ల తయారీ సంస్థ హెన్‌కిన్‌ ఎన్‌వి.. రూ.2 వేల కోట్ల నుంచి రూ.2,500 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో గ్లోబల్‌ కేపబిలిటీ కేంద్రాన్ని (జీసీసీ) నెలకొల్పేందుకు సిద్ధమైంది.

Hyderabad: రాష్ట్రంలో హెన్‌కిన్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌

  • రూ.2,500 కోట్ల పెట్టుబడులకు సిద్ధం

  • తక్షణం వెయ్యి ఉద్యోగాలు

  • వచ్చే మూడేళ్లలో మూడు వేల మందికి ఉపాధి

  • ముఖ్యమంత్రి రేవంత్‌తో సంస్థ ప్రతినిధులు భేటీ

హైదరాబాద్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): అమెరికాకు చెందిన బీర్ల తయారీ సంస్థ హెన్‌కిన్‌ ఎన్‌వి.. రూ.2 వేల కోట్ల నుంచి రూ.2,500 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో గ్లోబల్‌ కేపబిలిటీ కేంద్రాన్ని (జీసీసీ) నెలకొల్పేందుకు సిద్ధమైంది. ఈమేరకు.. సంస్థ ముఖ్య ప్రతినిధులు జాకోవానడర్‌ లిన్‌డెన్‌, వివేక్‌ గుప్తా, గరిమా సింగ్‌ తదితరులు సీఎంరేవంత్‌ రెడ్డితో భేటీ అయ్యారు. జీసీసీ ఏర్పాటుతో తక్షణం 1000 మందికి.. వచ్చే మూడేళ్లలో 3000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించవచ్చని వెల్లడించారు. వారి ప్రతిపాదనపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. అమెరికాలో హెన్‌కిన్‌ పేరుతో వ్యాపారం చేస్తున్న ఈ సంస్థ.. భారతదేశంలో యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌ (యూబీఎల్‌) పేరిట తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌ సంస్థ ఆర్ధిక ఇబ్బందులు సహా పలు సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. హెన్‌కిన్‌ సంస్థ 2021లో డెట్‌ రికవరీ ట్రైబ్యునల్‌ నుంచి ఆ కంపెనీలో మాల్యాకు చెందిన 15 శాతం వాటాలను కొనుగోలు చేసి, మొత్తం 61.5 శాతం వాటాతో దాన్ని తన నియంత్రణలోకి తీసుకుంది. నాటి నుంచి యూబీఎల్‌ పేరుతోనే భారత్‌లో తన వ్యాపారాలను సాగిస్తోంది.


తెలంగాణలో ఈ సంస్థ ఇప్పటికే రూ.650 కోట్ల పెట్టుబడులు పెట్టి.. బీర్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా ఉన్న 32కుపైగా ఉత్పత్తి కేంద్రాల్లో రెండు పెద్ద కేంద్రాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. వాటి ద్వారా 900 మందికిపైగా ప్రత్యక్షంగా, 5000 మందికిపైగా పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. రాష్ట్రంలో ఏడాదికి రూ.5 వేల కోట్లకు పైగా ఎక్సైజ్‌ డ్యూటీ చెల్లిస్తోంది. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎ్‌సఆర్‌)లో భాగంగా గడిచిన 5-6ఏళ్లలో రూ.5.5 కోట్లను ఖర్చు చేసింది. ఈ నేపథ్యంలోనే.. ఇటీవల నిర్వహించిన హెన్‌కిన్‌ బోర్డు సమావేశంలో జీసీసీని తెలంగాణలో స్థాపించాలనే నిర్ణయం తీసుకున్నారు. చక్కటి మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉండడంతో.. గోల్డ్‌మెన్‌ శాష్‌, ఫెడెక్స్‌, లండన్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ సహా పలు సంస్థలు హైదరాబాద్‌లో జీసీసీలను స్థాపించాయి. మెక్‌డోనాల్డ్స్‌, మారియట్‌ కూడా ఇక్కడ జీసీసీల ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. ఆ కోవలోనే హెన్‌కిన్‌ కూడా ఇక్కడ జీసీసీ ఏర్పాటుకు ఆసక్తి చూపుతోంది.

Updated Date - Mar 29 , 2025 | 05:13 AM