Share News

ఏసీబీ కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్లిపోయిన కేటీఆర్.. ఎందుకంటే..

ABN , Publish Date - Jan 06 , 2025 | 11:14 AM

ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు మాజీ మంత్రి కేటీఆర్ తన లీగల్ టీమ్‌తో ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. అయితే కార్యాలయం ముందు కేటీఆర్ వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు. కేటీఆర్ వెంట న్యాయవాదులు వెళ్ళకూడదంటూ అడ్డుకున్నారు. దీనిపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఏసీబీ అధికారికి లేఖ ఇచ్చి వెళ్లిపోయారు.

ఏసీబీ కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్లిపోయిన కేటీఆర్.. ఎందుకంటే..
BRS Leader, Ex Minister KTR

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట, మాజీ మంత్రి కేటీఆర్ (BRS Leader, KTR) ఫార్ములా-ఈ కారు రేసు కేసు (Formula-E car race Case)కు సంబంధించి విచారణ నిమిత్తం సోమవారం ఉదయం ఏసీబీ కార్యాలయానికి (ACB office) వచ్చారు. అయితే విచారణకు తన న్యాయవాదిని అనుమతించక పోవడంతో తిరిగి వెళ్లిపోయారు. వెళ్లే ముందు ఏసీబీ ఏఎస్పీ అధికారి ఖాన్‌కు లిఖితపూర్వకంగా లేఖను అందజేశారు. ‘మీకు కావాల్సిన సమాచారం నేను ఆదజేస్తానని’ ఆ లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. కాగా ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు మాజీ మంత్రి కేటీఆర్ తన లీగల్ టీమ్‌తో ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. అయితే కార్యాలయం ముందు కేటీఆర్ వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు. కేటీఆర్ వెంట న్యాయవాదులు వెళ్ళకూడదంటూ అడ్డుకున్నారు. దీనిపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏసీబీ కార్యాలయం బయట మీడియాతో ఆయన మాట్లాడుతూ... ఫార్ములా ఈ కేసులో ఏమీ లేదని.. దీని వల్ల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సాధించేది ఏమీ లేదని అన్నారు. ‘‘ ఈరోజు మామయ్య రెండో సంవత్సరీకం. నన్ను ఇక్కడ విచారణకు కూర్చోబెట్టి నా ఇంట్లో దాడులు చేసేందుకు ప్రణాళికలు చేశారు. కోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉన్నందున విచారణకు రావాల్సిన అవసరం లేదు. కానీ నేను చట్టానికి గౌరవించే పౌరుడిగా ఏసీబీ విచారణకు వచ్చాను. కోర్టులో విచారణ తర్వాత వస్తానని చెప్పి తప్పించుకోవచ్చు. కానీ తప్పించుకోను. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు. నిజాయితీగా ఉన్నాను కాబట్టే ధైర్యంగా వచ్చాను’’ అని కేటీఆర్ అన్నారు.


‘‘లాయర్‌‌తో విచారణకు వస్తే ఎందుకు భయపడుతున్నారు. పట్నం నరేందర్ రెడ్డి విషయంలో కుట్ర చేశారు. రేవంత్ డైరెక్షన్‌లో ఆయన ఇవ్వని స్టేట్‌మెంట్‌ను ఇచ్చినట్లుగా నా పేరును చెప్పి ఇరికించే ప్రయత్నం చేశారు. కాబట్టి నేను కూడా చెప్పని స్టేట్‌మెంట్‌ను చెప్పినట్టుగా చేస్తారని భావించే న్యాయపరమైన మద్దతు ఉండాలనే లాయర్‌ను వెంటబెట్టుకుని వచ్చాను. లాయర్‌ ఉంటే భయమెందుకు. అర్ధగంటగా రోడ్డుపై నిలబెట్టారు. నేను రేవంత్‌ను నమ్మను. లాయర్‌తోనే విచారణకు వస్తా. లేనిపక్షంలో లిఖిత పూర్వకంగా ఇస్తాను. పట్నం నరేందర్ రెడ్డి విషయంలో జరిగిందే నాకు జరుగుతుంది అనే నమ్మకం నాకు ఉంది. అందుకే లాయర్‌ సమక్షంలో విచారణ జరగాలని కోరుతున్నా. కొద్ది రోజులు అల్లు అర్జున్ డ్రామా.. ఆపై కేటీఆర్‌పై కేసు డ్రామా. ఏదో డ్రామా పెట్టి డైవర్షన్ చేసి టైంపాస్ చేయడమే వీరి ఉద్దేశం’’ అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా ఫార్ములా-ఈ కారు రేసు కేసు (Formula-E car race Case)కు సంబంధించి అవినీతి నిరోధక శాఖ (ACB) సోమవారం మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారణకు పిలిచింది. సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు (Notice) జారీ చేశారు. న్యాయ నిపుణుల సూచన మేరకు ఈ కేసులో విచారణకు హాజరవుతానని కేటీఆర్‌ కూడా శనివారం బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుల సమావేశంలో తెలిపారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం కేటీఆర్ నందినగర్ తన నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి బయలుదేరారు. అంతకుముందు బంజారాహిల్స్, నంది నగర్ కేటీఆర్ నివాసంలో ఆయనతో మాజీమంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సమావేశమయ్యారు. కేటీఆర్ ఏసీబీ విచారణకు వస్తున్న నేపథ్యంలో కార్యాలయం పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీబీ కార్యాలయం నాలుగవైపులా భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఏసీబీ కార్యాలయం ముందు ఆందోళన చేసే అవకాశం ఉండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 500 మంది పోలీసులతో నాలుగు వైపుల బందోబస్తు.. టాస్క్ ఫోర్స్‌తో పాటు స్పెషల్ పార్టీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.


మరోవైపు తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలంటూ కేటీఆర్‌ హైకోర్టును ఆశ్ర యించారు. ఈ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని పేర్కొంది. అయితే విచారణ కొనసాగించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌ను విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీసులిచ్చింది. దీంతో సోమవారం జరగనున్న పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇదే కేసులో ఈ నెల 7న విచారణకు రావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేటీఆర్‌కు సమన్లు జారీ చేసింది. కాగా ఈ కేసులో సహనిందితులుగా ఉన్న బీఎల్‌ఎన్‌ రెడ్డి, అరవిందకుమార్‌లనూ ఈ నెల 2, 3వ తేదిల్లోనే విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేయగా.. వారిద్దరు కొంత సమయం కావాలని రాతపూర్వకంగా కోరారు. దీంతో వారికి ఈడీ అధికారులు వారం రోజుల వ్యవధి ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫార్ములా-ఈ కారు రేసు కేసు.. ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్..

పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మంత్రి లోకేష్

బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు

సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటన

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 06 , 2025 | 11:26 AM