డుమ్మాలకు చెక్
ABN , Publish Date - Mar 29 , 2025 | 01:04 AM
వైద్య ఆరోగ్య శాఖలో విధులకు డుమ్మా కొట్టే వారికి చెక్ పడనుంది. సీహెచ్‌సీ, పీహెచ్‌సీ, సబ్‌సెంటర్లలో విధులు నిర్వర్తించే సిబ్బంది గైర్హాజరవడం, సమాయానికి ముందే వెళ్తుండడంతో రోగులకు సరియైున వైద్యసేవలు అందడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో డుమ్మాలు కొట్టే వారికి చెక్ పెట్టేందుకు అబాస్ (ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టం) అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.

- వైద్య ఆరోగ్య శాఖలో ‘అబాస్’
- వైద్యాధికారి నుంచి అటెండర్ వరకు వివరాల సేకరణ
- విధులు నిర్వర్తించే లొకేషన్ నుంచే అటెండెన్స్
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
- జిల్లావ్యాప్తంగా సుమారు మూడువేల మంది ఉద్యోగులు
జగిత్యాల, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖలో విధులకు డుమ్మా కొట్టే వారికి చెక్ పడనుంది. సీహెచ్‌సీ, పీహెచ్‌సీ, సబ్‌సెంటర్లలో విధులు నిర్వర్తించే సిబ్బంది గైర్హాజరవడం, సమాయానికి ముందే వెళ్తుండడంతో రోగులకు సరియైున వైద్యసేవలు అందడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో డుమ్మాలు కొట్టే వారికి చెక్ పెట్టేందుకు అబాస్ (ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టం) అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. అందులో భాగంగా వైద్యారోగ్య సిబ్బంది నుంచి ఆధార్ నంబర్లు, లొకేషన్లను స్వీకరిస్తున్నారు.
- ప్రత్యేక యాప్‌లో వివరాలు అప్‌లోడ్...
జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ), ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ), సబ్ సెంటర్, బస్తీ దవాఖాన, పల్లె దవాఖాన, అర్బన్ హెల్త్ సెంటర్లలో డాక్టర్ నుంచి అటెండర్ వరకు వారి వివరాలను సేకరిస్తున్నారు. ప్రత్యేక యాప్‌లో సిబ్బంది వివరాలను అప్‌లోడ్ చేస్తున్నారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లోనే సిబ్బంది హాజరు కోసం యాప్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మొబైల్ ద్వారా ఫేస్ రికగ్నైజేషన్, జియో ఫెన్స్‌డ్ విధానంతో హాజరు నమోదు అవుతుంది. ఎక్కడో ఉండి అటెండెన్స్ వేస్తామంటే యాప్ తీసుకోదు. దీంతో ఆరోజు అటెండెన్స్ పడకుండా ఆబ్సెంట్ పడుతుంది. జిల్లావ్యాప్తంగా వైద్య సిబ్బంది సుమారు మూడు వేల వరకు ఉంటారు. పలు చోట్ల వంతుల వారీగా విధులకు హాజరవుతారని ఆరోపణలున్నాయి.
- బయోమెట్రిక్ స్థానంలో అబాస్....
జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, పల్లె, బస్తీ దవాఖానాలు, సబ్ సెంటర్లలో వైద్యులు, సిబ్బంది హాజరు నమోదుకు తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ అభివృద్ధి చేసిన మొబైల్ ముఖ ఆధారిత, జియో ఫెన్స్‌డ్ విధానంలో నూతన సాంకేతికతను తీసుకవచ్చింది. ఇప్పటివరకు బయోమెట్రిక్‌తో పాటు, ఫేస్ యాప్ ద్వారా హాజరు తీసుకునే వారు. కానీ జిల్లా వ్యాప్తంగా చాలా ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ గానీ ఫేస్ యాప్ ద్వారా హాజరు తీసుకోకుండానే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం అమల్లోకి రానున్న అబాస్ హాజరుతో గైర్హాజరుకు పూర్తి చెక్ పెట్టవచ్చని, విధులకు డుమ్మా కొట్టేవారి విషయంలో కఠినంగా వ్యవహరించేం దుకు దీనిని అమల్లోకి తీసుకొని రావడానికి ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈవిధానం ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, వాటికి అనుబంధంగా కొనసాగుతున్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో అమలు చేస్తున్నారు.
- ఉద్యోగుల్లో వ్యతిరేకత..
వైద్య ఆరోగ్య శాఖలోని వైద్యులు, సిబ్బంది హాజరు కోసం బయోమెట్రిక్, ఫేస్ యాప్‌లను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ అబాస్ పేరిట తీసుకువచ్చిన నూతన విధానాన్ని వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఉద్యోగులతో చర్చించకుండానే అమలు చేస్తున్నట్లుగా ఉత్తర్వులు విడుదల చేయడాన్ని వైద్యులు, సిబ్బంది వ్యతిరేకిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అబాస్ హాజరు విధానంపై కొందరు ఉద్యోగులు, సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న చర్చలు వైద్య ఆరోగ్య శాఖలో వినిపిస్తున్నాయి.
- ఖమ్మంలో పైలట్ ప్రాజెక్ట్..
అబాస్ ద్వారా అటెండెన్స్‌ను పైలెట్ ప్రాజెక్ట్‌గా ఖమ్మంలో కొనసాగుతోంది. అక్కడ సిబ్బంది డుమ్మాలకు చెక్ పెట్టడంతో రాష్ట్రమంతటా అమలు చేయాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల డీఎంహెచ్‌వోకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదేశించింది. దీంతో జిల్లాలోని వైద్యారోగ్య శాఖ కసరత్తును ప్రారంభించింది. ఉద్యోగుల వివరాలను యూడీసీలు సేకరిస్తున్నారు. త్వరలో ఈ యాప్ ద్వారానే అటెండెన్స్‌ను అమలు చేయనున్నారు. అత్యవసర సిబ్బంది కావడంతో వెసులుబాటుకు అవకాశం ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
వివరాలను సేకరిస్తున్నాము
- డాక్టర్ ప్రమోద్‌కుమార్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి
అబాస్ కోసం సిబ్బంది వివరాలను సేకరిస్తున్నాము. మరికొద్ది రోజుల్లో పూర్తి కానుంది. ఈ వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి పంపిస్తాము. వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేయగానే అబాస్ ద్వారానే అటెండెంట్స్‌ను అమలు చేస్తాము.
జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు..
జనరల్ ఆసుపత్రి 1
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 17
24 గంటలు పనిచేసే పీహెచ్‌సీలు 7
పల్లె దవాఖానాలు 102
బస్తీ దవాఖానాలు 9
అర్బన్ హెల్త్ సెంటర్లు 5
కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 3
ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు 151