కుప్పకూలిన రియల్ ఎస్టేట్
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:06 AM
పెద్దపల్లి జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలింది. జిల్లా ఏర్పడిన తరువాత అంచెలంచెలుగా ఎదిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారం క్రమంగా తగ్గుతూ వచ్చింది. రెండు మూడేళ్ళుగా అమ్మకాలు, కొనుగోళ్ళు లేక రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుదేలవుతున్నారు. పెట్టిన పెట్టుబడులు నిలిచిపోవడంతో అప్పుల పాలవుతున్నారు. వీరి పై ఆధార పడ్డ బ్రోకర్లకు ఉపాధి లేకుండా పోయింది.

పెద్దపల్లిటౌన్, ఏప్రిల్ 1 (ఆంఽధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలింది. జిల్లా ఏర్పడిన తరువాత అంచెలంచెలుగా ఎదిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారం క్రమంగా తగ్గుతూ వచ్చింది. రెండు మూడేళ్ళుగా అమ్మకాలు, కొనుగోళ్ళు లేక రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుదేలవుతున్నారు. పెట్టిన పెట్టుబడులు నిలిచిపోవడంతో అప్పుల పాలవుతున్నారు. వీరి పై ఆధార పడ్డ బ్రోకర్లకు ఉపాధి లేకుండా పోయింది.
జిల్లాలో పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్, గోదావరిఖని, సెంటినరి కాలనీల్లో వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసి వెంచర్లుగా మార్చి ప్లాట్లు విక్రయిస్తున్నారు. జిల్లాగా ఏర్పడిన తరువాత మరింతగా వ్యాపారం ఊపందుకుంది. చట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములు వెంచర్లుగా మారిపోయాయి, మూడు వెంచర్లు ఆరు ప్లాట్లుగా కొనసాగిన వ్యాపారం ఒక్కసారిగా నిలిచిపోయింది. అమ్మకాల కోసం ఎదురు చూసి చూసి వెంచర్లను తిరిగి పొలాలు, చేళ్ళుగా మార్చి సాగు చేస్తున్నారు. వెంచర్ ఏర్పాటు చేయడానికి వెచ్చించిన ఖర్చులు నష్టపోయారు.
భూయజమాని దగ్గర ధర కుదుర్చుకొని బయానాగా కొంత చెల్లించి వెంచర్ పనులు ప్రారంభిస్తారు. మిగితా డబ్బులు వాయిదాలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంటారు. పెద్దపల్లి జిల్లాగా ఏర్పడిన తరువాత మూడు నాలుగేళ్ళపాటు రియల్ వ్యాపారం జోరుగా కొనసాగింది. అనంతరం వ్యాపారం పూర్తి స్థాయిలో నిలిచి పోయింది. ఈక్రమంలో ప్లాట్లు అమ్ముడు పోక వాయిదాలు చెల్లించ లేక భూయజమానులతో వివాదాలు తలెత్తి పోలీస్ స్టేషన్, కోర్టుల చుట్టు తిరుగుతున్నారు. కొందరు అప్పులు తెచ్చి వాయిదాలు చెల్లించినప్పటికి అప్పుల వడ్డీలు పేరుకపోయి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు విలాస వంతమైన జీవితం గడిపిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు దిగ జారిపోయారు. రియల్ వ్యాపారంపై ఆధారపడి సుమారు 8 వందల నుంచి వెయ్యి మంది వరకు బ్రోకర్లు ఆధారపడి ఉన్నారు. కొనుగోలుదారులను మభ్యపెటి,్ట నచ్చజెప్పి ప్లాట్లు విక్రయించి కమీషన్ తీసుకునే వారు. ఇప్పుడు వారికి ఉపాధి లేకుండా పోయింది. ఒక్కొక్క బ్రోకర్ వద్ద పదుల సంఖ్యలో ప్లాట్లు అమ్మకానికి ఉన్నాయి. కొనే వారు లేక కుటుంబాలు గడపడం కష్టంగా మారింది. బ్రోకర్ల వద్ద అమ్మకానికి ఉన్న ప్లాట్లకు ధర పలుకడం లేదు. కొనుగోలు చేసిందాని కంటే తక్కువ ధరకు అమ్ముకుందామన్న కొనేవారు లేరు. భూమిపై పెట్టుబడి పెడితే నష్టపోమనే నమ్మకం పోయింది. పిల్లల పెళ్ళిళ్ళు తదితర అవసరాలకు అమ్యుకుందామంటే అమ్మక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కారణాలు ఇవే
ధరలు పెరగడంతో సామాన్యుడు ప్లాట్లు కొనలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం రిజిస్ర్టేషన్ ఫీజలు అధికంగా పెరగడం మరో కారణంగా చెప్పు కోవచ్చు, కరోనా కాలం నాటి కరువు ఇంకా కొనసాగుతోంది. మార్కెట్లో డబ్బుల లావాదేవీలు లేకపోవడం, అప్పటి అప్పులు ఇంకా తీరలేదని తెలుస్తోంది.
భూమలకు అధిక ధరలు పెరిగాయి
పెగడ రమేష్, రియల్ ఎస్టెట్ సంఘం జిల్లా అధ్యక్షుడు
రైతులు తమ భూములను అధిక ధరకు మాకు విక్రయించడం వల్ల మేం కస్టమర్ల మీద భారం వేయాల్సి వస్తోంది. దీంతో కొనుగోళ్ళు జరుగడం లేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం.
కుటుంబం గడపవడం కష్టంగా ఉంది
మెరుగు చందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్
భూములు, ప్లాట్ల క్రయవిక్రయాలతో వచ్చే కమీషన్‌తో కుటుంబం గడిచేది. ప్రస్తుతం కొనేవారే కరువయ్యారు. జిరాక్స్ సెంటర్ పెట్టుకొని ఉపాధి పొందుతున్నా.