Share News

హుస్నాబాద్‌కు ఇంజనీరింగ్‌ కళాశాల

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:58 AM

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కళాశాలను యూనివర్సిటీ కేంద్రంగా కాకుండా హుస్నాబాద్‌లో నెలకొల్పడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల పెద్దపల్లిలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాతవాహన యూనివర్సిటీకి ప్రభుత్వం ఇంజనీరింగ్‌ కళాశాలను, లా కళాశాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

హుస్నాబాద్‌కు ఇంజనీరింగ్‌ కళాశాల

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కళాశాలను యూనివర్సిటీ కేంద్రంగా కాకుండా హుస్నాబాద్‌లో నెలకొల్పడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల పెద్దపల్లిలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాతవాహన యూనివర్సిటీకి ప్రభుత్వం ఇంజనీరింగ్‌ కళాశాలను, లా కళాశాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఫ యూనివర్సిటీలో అనుకూలతలు

జిల్లాలో ప్రస్తుతమున్న ఇంజనీరింగ్‌ కళాశాలలన్నీ ప్రైవేట్‌ యాజమాన్యంలోనే నడుస్తున్నాయి. శాతవాహన యూనివర్సిటీకి ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాలను మంజూరు చేయాలని విద్యార్థి సంఘాలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం జారీ అయిన ఉత్తర్వుల్లో ఇంజనీరింగ్‌ కళాశాలను యూనివర్సిటీలో కాకుండా హుస్నాబాద్‌లో నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు. హుస్నాబాద్‌ శాతవాహన యూనివర్సిటీ పరిధిలోనే ఉన్నా ఆ నియోజకవర్గం ముఖ్యంగా, మండల కేంద్రం సిద్దిపేట జిల్లాలో ఉన్నాయి. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉండగా రెండు మండలాలు హన్మకొండ జిల్లాలో, రెండు మండలాలు కరీంనగర్‌ జిల్లాలో, మూడు మండలాలు సిద్దిపేట జిల్లాలో ఉన్నాయి. శాతవాహన యూనివర్సిటీలోనే ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాలను నెలకొల్పితే విద్యార్థులకు అనువుగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. జిల్లా కేంద్రంలో కళాశాల ఉంటే విద్యార్థులకు వసతి సౌకర్యం దొరకడం సులువవుతుంది. హుస్నాబాద్‌లో కళాశాల ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అక్కడ సీటు పొందే విద్యార్థులకు వసతి, రవాణా తదితర సమస్యలు ఎదురవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. యూనివర్సిటీలో 200 ఎకరాల స్థలం అందుబాటులో ఉన్నది. విద్యార్థులకు హాస్టల్‌ వసతి ఏర్పాటు చేసే వీలుంటుంది.

ఫ అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత

యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాలను హుస్నాబాద్‌లో ఏర్పాటు చేయడాన్ని విద్యార్థులు, జిల్లా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా తన నిర్ణయాన్ని ప్రభుత్వం మార్చుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లాలో ఆరు ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్న నేపథ్యంలో ఇక్కడే ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడుతున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందిన శాసనసభ్యులు ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాలను యూనివర్సిటీ ఆవరణలోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. లేనిపక్షంలో తాము ఆందోళనబాట పట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి.

అధికారముందని తరలిస్తే చూస్తూ ఊరుకోం

- మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ ప్రజల చిరకాల కోరిక ఇంజనీరింగ్‌ కళాశాల. శాతవాహన యూనివర్శిటీకి మంజూరైన ఇంజనీరింగ్‌ కళాశాలను ఇక్కడే ఏర్పాటు చేయాలి. అధికారముందికదా అని సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌కు తరలించి అక్కడే ఏర్పాటు చేస్తే చూస్తూ ఊర్కొనేది లేదు... శాతవాహన యూనివర్సిటీకి లా కళాశాలతోపాటు ఇంజనీరింగ్‌ కళాశాల మంజూరు చేసి లా కళాశాల ఇక్కడ, ఇంజనీరింగ్‌ కళాశాల హుస్నాబాద్‌లో ఎలా ఏర్పాటు చేస్తారు. దీన్ని జిల్లా ప్రజలెవరూ హర్షించరు... శాతవాహన యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్‌ కళాశాలను ఏర్పాటు చేయాలి. ఉమ్మడి జిల్లా పరిధిలోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా దీనిని వ్యతిరేకించి కరీంనగర్‌లో కళాశాల ఏర్పాటు చేసేందుకు కృషిచేయాలి. లేకుంటే ప్రజల్లో దోషులుగా నిలుస్తారు... విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఇప్పటికే ప్రభుత్వం హుస్నాబాద్‌లో ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్‌లో ఇంజనీరింగ్‌ కళాశాల కోసం పోరాటం చేస్తాం.. అధికార బలముందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే న్యాయస్థానాన్ని అయినా ఆశ్రయించి ఇక్కడే కళాశాల ఏర్పటయ్యేలా చూస్తాం.

ఫ ఇంజనీరింగ్‌ కళాశాలను హుస్నాబాద్‌లో ఏర్పాటు చేయడం శోచనీయం

- మాజీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు

శాతవాహన యూనివర్సిటీకి మంజూరు చేసిన ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాలను సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఏర్పాటు చేయడం శోచనీయం. కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తే విద్యార్థులకు అనువుగా ఉంటుంది. ఇంజనీరింగ్‌ కళాశాలతరలింపు విషయంలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. మంత్రి పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌ అభివృద్ధికి వ్యతిరేకమైన ఇలాంటి కార్యక్రమాలను మానుకోవాలి.

ఫ విద్యార్థులకు, యువతకు మంత్రి పొన్నం సమాధానం చెప్పాలి..

- బామండ్లపల్లి యుగేందర్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి

రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌కు మంజూరైన ఇంజనీరింగ్‌ కళాశాలను హుస్నాబాద్‌కు తరలించుకుపోయారు. జిల్లాలోని విద్యార్థులకు, యువతకు మంత్రి సమాధానం చెప్పాలి. కరీంనగర్‌ జిల్లా ప్రజలకు, విద్యార్థి, యువతకు బేషరతుగా మంత్రి క్షమాపణ చెప్పాలిు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకొని, ఇంజనీరింగ్‌ కళాశాలను కరీంనగర్‌లోనే ఏర్పాటు చేయాలి.

ఫ హుస్నాబాద్‌కు తరలించడం సరికాదు

- కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి

జిల్లాకు మంజూరైన ఇంజనీరింగ్‌ కళాశాలను హుస్నాబాద్‌కు తరలించడం సరికాదు. శాతవాహన యూనివర్సిటీకి అనుబంధంగా ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల నిర్మిస్తే కఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. తన వ్యక్తిగత రాజకీయ స్వార్థం కోసం ఇంజనీరింగ్‌ కళాశాలను కరీంనగర్‌లో కాకుండా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నెలకొల్పటం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వం ఇంజనీరింగ్‌ కళాశాలను కరీంనగర్‌ జిల్లాలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.

శాతవాహన యూనివర్సిటీ లోనే ఏర్పాటు చేయాలి

- కసిరెడ్డి మణికంఠరెడ్డి, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు

ఏఐఎస్‌ఎఫ్‌ డిమాండ్‌ ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్‌, లా కళాశాల మంజూరు చేసింది. ఇంజనీరింగ్‌ కళాశాలను శాతవాహన యూనివర్సిటీనే ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఏర్పాటు చేస్తేనే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించాలి.

ఫ విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లిన రాష్ట్ర ప్రభుత్వం

- కాంపెల్లి అరవింద్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు

హుస్నాబాద్‌ నియోజకవర్గానికి ఇంజనీరింగ్‌ కళాశాల తరలించి జిల్లా విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. కరీంనగర్‌ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల కలగానే మిగిలిపోయింది. మంత్రి పొన్నం ప్రభాకర్‌ జిల్లాకు ద్రోహం చేస్తున్నారు.

ఫ ప్రభుత్వం పునరాలోచన చేయాలి

- నర్సింగోజు శ్రీనివాస్‌, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు

శాతవాహన యూనివర్సిటీలోనే ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాలి. హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసి జిల్లా విద్యార్థులకు అన్యాయం చేయొద్దు. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి.

ఫ జిల్లా విద్యార్థులకు అన్యాయం

నక్కా ప్రమోద్‌, న్యాయవాది

జిల్లా విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. శాతవాహన విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజినీరింగ్‌ కళాశాల హుస్నాబాద్‌లో ఏర్పాటు చేయడం సరికాదు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి.

Updated Date - Mar 26 , 2025 | 12:58 AM