Share News

క్షయపై ప్రజలకు అవగాహన కల్పించాలి

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:27 AM

టీబీ(క్షయ)వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటరమణ అన్నారు. సోమవారం వరల్డ్‌ టీబీ డేను పురస్కరించుకుని ఓరియేంటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

క్షయపై ప్రజలకు అవగాహన కల్పించాలి
ప్రశంసా పత్రాన్ని అందచేస్తున్న జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటరమణ

సుభాష్‌నగర్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): టీబీ(క్షయ)వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటరమణ అన్నారు. సోమవారం వరల్డ్‌ టీబీ డేను పురస్కరించుకుని ఓరియేంటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీ ఉన్న వ్యక్తి దగ్గినా, తుమ్మినా వచ్చే తుంపర్లను పీల్చడం ద్వారా ఇతరులకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందన్నారు. టీబీ పేషంట్లు తుమ్మినపుడు, దగ్గినపుడు ఇతరులకు వ్యాధి సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోషకాహార లోపం ఉన్నవారు, హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ వ్యాధి ఉన్నవారికి ఈ వ్యాధి త్వరగా సోకే అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్‌ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ దగ్గినపుడు రక్తం పడడం, జ్వరము, బరువుతగ్గడం, తొందరగా అలసిపోవడం, ఛాతిలో నొప్పి లక్షణాలు ఉన్నవారు టీబీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీబీ నిర్దారణ అయితే 6 నుంచి 12 నెలల వరకు డాట్స్‌ ద్వారా పూర్తి చికిత్స ఉచితంగా అందిస్తారని తెలిపారు. వారు చికిత్స పొందుతున్న సమయంలో పోషకాహారం కోసం నెలకు వెయ్యి రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారని తెలిపారు. టీబీ వ్యాధి లక్షణాలు ఉన్నవారికి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రిలో ఉచితంగా పరీక్షలు చేస్తారని తెలిపారు. అనంతరం టీబీ నివారణలో ఉత్తమ సేవలందించిన వైద్యాధికారులు, టీబీ నోడల్‌ పర్సన్స్‌, ఆశా నోడల్‌ పర్సన్స్‌కు ప్రశంసా పత్రాలను అందచేశారు. కార్యక్రమంలో స్టేట్‌ టీం అధికారులు హెపోజిబా, ఉష, సంపత్‌, జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్‌ సాజిదా, విప్లవశ్రీ, సనజవేరియా పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2025 | 12:28 AM