ధాన్యం కొనుగోళ్లకు సన్నాహాలు
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:53 AM
జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యేటా వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఎస్సారెస్పీ నీటితో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండడం, ఆశించినస్థాయిలో సాగునీరు అందడంతో వరి సాగు చేస్తున్న రైతుల సంఖ్య యేటా పెరుగుతోంది.

జగిత్యాల, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యేటా వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఎస్సారెస్పీ నీటితో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండడం, ఆశించినస్థాయిలో సాగునీరు అందడంతో వరి సాగు చేస్తున్న రైతుల సంఖ్య యేటా పెరుగుతోంది. గత యాసంగితో పోలిస్తే ఈసారి సాగు విస్తీర్ణం పెరిగింది. ఏప్రిల్ తొలి, మలి వారాల్లో పంట చేతి కొచ్చే సమయం కావడంతో రైతులకు మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ బీఎస్ లత ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. సన్నరకాలకు ప్రభుత్వం ఇచ్చే ధర గిట్టుబాటు కాకపోవడంతో రైతులు వానాకాలం సీజన్‌లో ప్రైవేటు కొనుగోలు కేంద్రాల వైపే మొగ్గు చూపడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేర లేదు. యాసంగిలో 424 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 6,23,094 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యల పరిష్కారంపై సైతం అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో 132 కేంద్రాలు, 291 సహకార సంఘాలు, ఒకటి మెప్మా ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ఫకేంద్రాల్లో వసతుల కల్పనకు చర్యలు
జిల్లాలో గత యాసంగి సీజన్‌లో జిల్లాలో సుమారు 4.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ప్రస్తుత 2024-25 యాసంగి సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 6.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో సుమారు 5,20,000 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం, 1,03,094 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం వస్తుందని అంచనా వేశారు. ధాన్యం కొనుగోళ్లకు 1.60 లక్షల గన్నీ బ్యాగులు అవసరమన్న అంచనా ఉంది. ఇప్పటికే పౌరసరఫరా శాఖ వద్ద సుమారు 80 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయంటున్నారు. అవసరమైన సమయంలో మరిన్ని గన్నీ బ్యాగులను తెప్పిండానికి నిర్ణయించారు. జిల్లాలో ఏర్పాటు చేయనున్న కేంద్రాల్లో 772 ప్యాడీ క్లీనర్లు, తేమను పరిశీలించే 900 యంత్రాలు, 420 ఎలకా్ట్రనిక్ కాంటాలు అందుబాటులో ఉంచనున్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రంలో నీడ, మంచినీరు, తాత్కాలిక టాయిలెట్స్ సమకూర్చడంపై అధికారులు దృష్టి సారించారు. విద్యుత్ కనెక్షన్, ఆన్‌లైన్, వసతి ఉండడంతో పాటు ప్రతి ఒక్క అధికారి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఫ80 పారాబాయిల్డ్ రైస్ మిల్లుల భాగస్వామ్యం
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత యాసంగి సీజన్‌లో 80 పారా బాయిల్డ్ రైస్ మిల్లులు కొనుగోలులో భాగస్వామ్యం కానున్నాయి. ప్రతీ రైస్ మిల్లులో సుమారు 50 నుంచి 60 మంది హమాలీలు అందుబాటులో ఉండే విదంగా జాగ్రత్తలు తీసుకోవాలని మిల్లర్లకు అధికారులు సూచించారు. ఎప్పటికప్పుడు మిల్లుకు వచ్చిన లారీని అన్‌లోడ్ చేసి త్వరిగతిన దిగుమతి జరిగేలా చూడాలని సూచించారు. ధాన్యం అప్పగించడానికి మిల్లర్ల నుంచి ముందస్తుగానే బ్యాంక్ గ్యారెంటీలు స్వీకరించాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా మిల్లర్లకు అధికారులు సూచనలు ఇచ్చారు.
ఫకొనుగోళ్ల ఏర్పాట్లపై దృష్టి సారించిన అధికారులు
హార్వెస్టర్ యజమానులతో ఇటీవల అదనపు కలెక్టర్ బీఎస్ లత, సివిల్ సప్లయిస్, వ్యవసాయ, రవాణా శాఖ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులచే రెండు రోజుల్లో సమీక్ష సమావేశం నిర్వహించేందుకు సివిల్ సప్లయిస్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ్ల అదనపు కలెక్టర్ బీఎస్ లత సైతం సంబంధిత అధికారులతో ముందస్తు సమీక్ష సమావేశం నిర్వహించి ధాన్యం కొనుగోళ్లపై దిశ నిర్ధేశం చేయనున్నారు. జిల్లా పారా బాయిల్డ్ రైస్ మిల్లర్లు, జిల్లా లారీ ట్రాన్స్‌పోర్టు ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
పకడ్బందీగా ధాన్యం కొనుగోలుకు చర్యలు
-సత్యప్రసాద్, కలెక్టర్
జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే హార్వేస్టర్ నిర్వాహకులతో సమీక్ష నిర్వహించాం. ప్రస్తుత సీజన్‌లో అకాల వర్షాల కారణంగా రైతులు ముందస్తు కోతలు జరిపే అవకాశాలను సైతం పరిశీలిస్తున్నాం. ప్రతి రైతు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధరను పొందాలి. ధాన్యం కోతలు ప్రారంభం అయ్యే లోపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం.