ప్రజలకు పాలేవో.. నీళ్లేవో తెలిసింది!
ABN , Publish Date - Apr 06 , 2025 | 04:07 AM
తెలంగాణ ప్రజలకు పాలేవో, నీళ్లేవో స్పష్టంగా తెలిసిందని.. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఏం కోల్పోయారో అర్థం చేసుకున్నారని బీఆర్‌ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఏం కోల్పోయారో అర్థం చేసుకున్నారు
ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం నేతలతో భేటీలో కేసీఆర్
హైదరాబాద్/గజ్వేల్/మర్కుక్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజలకు పాలేవో, నీళ్లేవో స్పష్టంగా తెలిసిందని.. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఏం కోల్పోయారో అర్థం చేసుకున్నారని బీఆర్‌ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో బీఆర్‌ఎ్‌సకు ఆదరణ పెరిగిందని, ఎన్నికలు ఏవైనా గులాబీ పార్టీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో శనివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పార్టీ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలన్నారు. సభకు లక్షలాదిగా జనం తరలివస్తారని.. వారికి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
నల్లగొండ జిల్లాను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాను నిరంజన్‌రెడ్డి, ఖమ్మం జిల్లాను పువ్వాడ అజయ్ సమన్వయం చేసుకోవాలన్నారు. రజతోత్సవ సభ తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభిస్తామని, గ్రామ స్థాయి నుంచి కమిటీల నిర్మాణం ఉంటుందని చెప్పారు. రైతుల కష్టాలపై కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాలు, అధికారమే పరమావధిగా పనిచేసే కాంగ్రెస్ నేతలు ప్రజల పాలిట శాపంగా మారారని మండిపడ్డారు. హెచ్‌సీయూ విషయంలో ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు. అధికారం చేతిలో ఉందని నోటికొచ్చినట్లు మాట్లాడి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే.. అటు న్యాయస్ధానాలు, ఇటు సభ్య సమాజం తిప్పికొడుతుందన్నారు. హెచ్‌సీయూ ఉదంతాన్ని ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలని హితవు పలికారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..
సిట్ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here