Share News

Cabinet Expansion: మాకూ ఓ మంత్రి పదవి ఇవ్వండి

ABN , Publish Date - Mar 27 , 2025 | 04:02 AM

త్వరలో చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో తమ సామాజికవర్గాలకు కూడా అవకాశం కల్పించాలని ఎస్సీల్లోని మాదిగ, ఎస్టీల్లోని లంబాడా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని కోరారు.

Cabinet Expansion: మాకూ ఓ మంత్రి పదవి ఇవ్వండి

  • మాదిగ, లంబాడా ఎమ్మెల్యేల డిమాండ్‌

  • ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు వేర్వేరుగా లేఖలు

  • సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి లేఖల అందజేత

హైదరాబాద్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): త్వరలో చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో తమ సామాజికవర్గాలకు కూడా అవకాశం కల్పించాలని ఎస్సీల్లోని మాదిగ, ఎస్టీల్లోని లంబాడా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని కోరారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు, రాహుల్‌గాంధీకి, సీఎం రేవంత్‌రెడ్డికి వేర్వేరుగా లేఖలు రాశారు. బుధవారం సీఎం రేవంత్‌రెడ్డిని శాసనసభలో రెండు వర్గాల ఎమ్మెల్యేలు వేర్వేరుగా కలిసి ఆ లేఖలను అందజేశారు. కాగా, మాదిగ ఎమ్మెల్యేల లేఖను మల్లికార్జున ఖర్గేకు అందజేయడానికి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. లేఖ రాసిన వారిలో లక్ష్మణ్‌కుమార్‌తోపాటు మందుల సామేలు, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, తోట లక్ష్మీకాంతరావు, కాలె యాదయ్య ఉన్నారు. నాగర్‌కర్నూల్‌, పెద్దపల్లి, వరంగల్‌ పార్లమెంటు నియోజక వర్గాల్లో మాదిగ జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ... ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా తమకు కేటాయించలేదని లేఖలో వారు పేర్కొన్నారు.


ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఒక్కరికీ అవకాశం కల్పించలేదని తెలిపారు. పార్టీ పట్ల విశ్వసనీయత, సంఖ్యాపరమైన బలం ఉన్నప్పటికీ... మంత్రివర్గంలో తగిన ప్రాతినిధ్యం లభించలేదని గుర్తు చేశారు. మాదిగలకు న్యాయమైన వాటా కల్పించడంలో భాగంగా మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు ఓ పదవి ఇవ్వాలని కోరారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సామాజిక ఆర్థిక కులగణనలో లంబాడా జనాభా 32.20 లక్షలుగా ఉన్నట్లు తేలిందని ఆ సామాజికవర్గ ఎమ్మెల్యేలు తమ లేఖలో తెలిపారు. గత 50 ఏళ్లుగా మంత్రివర్గంలో లంబాడాలకు ప్రాతినిధ్యం లభిస్తోందని, ఇప్పుడు కూడా ఒక మంత్రి పదవిని కేటాయిస్తే.. కాంగ్రెస్‌ పార్టీకి తమ జాతి చేసిన సేవలు, ఆకాంక్షలను గుర్తించినట్లవుతుందని పేర్కొన్నారు. లేఖ రాసిన లంబాడా ఎమ్మెల్యేల్లో నేనావత్‌ బాలు నాయక్‌, జాటోతు రాంచందర్‌ నాయక్‌, మాలోతు రాందాస్‌ నాయక్‌, భూక్యా మురళీ నాయక్‌ ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..

GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 27 , 2025 | 04:02 AM