Share News

‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు

ABN , Publish Date - Mar 18 , 2025 | 11:02 PM

మహబూబ్‌నగర్‌ జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈవో ఎ.ప్రవీణ్‌కుమార్‌ చె ప్పారు. విద్యార్థులను పరీక్షలకు అన్ని విధాల సిద్ధం చేశామని, ఒత్తిడికి గురవకుండా నిపుణులతో కెరియర్‌ గైడెన్స్‌ ఇప్పించామని తెలిపారు.

‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు
ఆంధ్రజ్యోతితో మాట్లాడుతున్న డీఈవో

మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా 60 కేంద్రాలు..

హాజరుకానున్న 13,038 మంది విద్యార్థులు

ప్రైవేట్‌ స్కూల్స్‌ హాల్‌ టికెట్స్‌ ఇవ్వకున్నా ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

మహబూబ్‌నగర్‌ డీఈవో ప్రవీణ్‌కుమార్‌

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌ జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈవో ఎ.ప్రవీణ్‌కుమార్‌ చె ప్పారు. విద్యార్థులను పరీక్షలకు అన్ని విధాల సిద్ధం చేశామని, ఒత్తిడికి గురవకుండా నిపుణులతో కెరియర్‌ గైడెన్స్‌ ఇప్పించామని తెలిపారు. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న పరీక్షల కోసం 60 కేంద్రాలు ఏర్పాటు చేశామన్న ఆయన మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఆ వివరాలు..

పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు చేశారా?

పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రశ్న పత్రాలు స్ర్టాంగ్‌ రూమ్‌లకు చేరాయి. సీఎస్‌, డీవోలకు శిక్షణ ఇచ్చాం.

ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు?.. ఎంతమంది హాజరు కానున్నారు?

జిల్లాలో 60 కేంద్రాలు ఏర్పాటు చేశాం. 13,038 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. రెగ్యులర్‌ విద్యార్థులు 12,749 మంది, ప్రైవేట్‌ విద్యార్థులు 269 మంది ఉన్నారు.

నిమిషం ఆలస్యం అయితే అనుమతి ఉండదన్న నిబంధన ఉందా?

విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలి. అర గంట ముందే పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తారు. విద్యార్థులు కేంద్రాలకు ముందే చేరుకుంటే ఒత్తిడికి లోనుకారు. నిమిషం ఆలస్యమైతే అనుమతించరన్న నిబంధన ఏమీ లేదు.

పరీక్షలకు ఎంత మంది సిబ్బందిని నియమించారు?

60 మంది సీఎ్‌సలు, 60 మంది డీవోలను ఏర్పాటు చేశాం. 640 మంది ఇన్విజిలేటర్లను నియమించాం. కేంద్రాలను తనిఖీ చేసేందుకు ప్రత్యేక స్క్వాడ్‌ బృందాలు ఉంటాయి.

కాపీయింగ్‌ నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

పరీక్షల్లో కాపీయింగ్‌ అన్న మాటే వినిపించకూడదని ఇప్పటికే సీఎస్‌, డీవో, ఇన్విజిలేటర్లకు చెప్పాం. కాపీయింగ్‌ ప్రోత్సహిస్తే కఠిన చర్యలు ఉంటాయి. ఎవరూ కాపీయింగ్‌కు పాల్పడవద్దు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. గట్టి పోలీస్‌ బందోబస్తు ఉంటుంది.

కేంద్రాల వద్ద ఏమేం సౌకర్యాలు కల్పించారు?

కేంద్రాల వద్ద తాగునీరు, వైద్యం, విద్యుత్‌ సౌకర్యాలు అన్ని శాఖల సమన్వయంతో కల్పించాం. విద్యార్థులు కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు ఆర్టీసీ ఆధర్యంలో బస్సు సౌకర్యం కూడా కల్పించారు. అన్ని కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.

ఫీజులు చెల్లించలేదని పలు ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు హాల్‌ టికెట్స్‌ ఇవ్వడం లేదని తెలిసింది. మీ దృష్టికి వచ్చిందా?

ఆ విషయం నా దృష్టికి కూడా వచ్చింది. విద్యార్థులను ఫీజుల పేరుతో వేధించొద్దని అన్ని ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలను ఆదేశించాం. పాఠశాలల యాజమాన్యాలు హాల్‌ టికెట్స్‌ ఇవ్వకున్నా విద్యార్థులు ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు. ఇబ్బందేమీ లేదు.

Updated Date - Mar 18 , 2025 | 11:02 PM