Share News

రాష్ట్రస్థాయిలో.. అయిజకు 4వ ర్యాంకు

ABN , Publish Date - Mar 31 , 2025 | 11:27 PM

ఇంటి పన్ను వసూలులో అయిజ మునిసిపాలిటీకి రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు దక్కింది.

రాష్ట్రస్థాయిలో.. అయిజకు 4వ ర్యాంకు
95 శాతం పన్ను వసూలు చేసిన అయిజ మునిసిపాలిటి సిబ్బంది

- 95 శాతం ఇంటిపన్ను వసూలు

- మార్చి 31 నాటికి రూ.1.62 కోట్లు

- 15వ ఆర్థిక సంఘం నిధులకు అర్హత సాధించిన పట్టణం

అయిజ టౌన్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : ఇంటి పన్ను వసూలులో అయిజ మునిసిపాలిటీకి రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు దక్కింది. 2024- 25 ఆర్థిక సంవత్సరానికి అయిజ పట్టణంలో ఇంటిపన్నుల డిమాండ్‌ రూ.1.82 కోట్లు ఉండగా మార్చి 31 నాటికి రూ, 1.62 కోట్లు వసూలు చేశారు. 95 శాతం పన్నులు వసూలు చేయటంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ 15 ఆర్థిక సంఘం నిధులు సాధించేందుకు అయి జ మునిసిపాలిటీ అర్హత సాధించింది. ఈ మేరకు ఈ ఏడాది నుంచి అయిజ మునిసిపాలిటీకి వివిధ అభివృద్ధి పనులకు విడుదలయ్యే కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాల నిధులు పెరగనున్నాయి. ఆర్థిక సంఘాల నియమనిబంధనల ప్రకారం గతేడాది రూ.1.44 కోట్లు వసూలు చేసిన పన్నుల శాతానికి, ఈ ఏడాది 12 శాతం అధికంగా వసూలు చేయాలి. అప్పుడే ఆర్థిక సంఘం నిధులు విడుదల అయ్యేందుకు వీలవుతుంది. ఈ ఏడాది అయిజ మునిసిపాలిటీ సిబ్బంది గతేడాది కంటే 12.09 శాతం పన్నులు ఎక్కువగా వసూలు చేశారు. దీంతో అయిజ మునిసిపాలిటీకి ఆర్థికసంఘం నిధులు అందే అవకాశం ఏర్పడింది. అయిజ పట్టణం మరింత అభివృద్ధి జరగాలంటే నిధులు రావాలని, అందుకు అనుగుణంగా సిబ్బంది ప్రణాళిక ప్రకారం పన్ను వసూలు చేసి రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించారు. దీంతో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులు పెరిగేలా కృషి చేశామని కమిషనర్‌ సైదులు తెలిపారు.

Updated Date - Mar 31 , 2025 | 11:27 PM